గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:15

ప్రైవేటు దవాఖానలపై టాస్క్‌ఫోర్స్‌

ప్రైవేటు దవాఖానలపై టాస్క్‌ఫోర్స్‌

  • వాటి ఫీజు దోపిడీని వదిలిపెట్టేదిలేదు
  • నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం
  • శవాలు పెట్టుకొని లక్షలు పీడించడం సరికాదు
  • సంపాదించేందుకు ఈ బీమారే దొరికిందా?
  • కార్పొరేట్‌ హాస్పటళ్లపై నిఘా ఉండాల్సిందే
  • ప్రతిపక్షాలు కూడా వాటిపై నిఘా వేయాలి
  • ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను పరిశీలిస్తాం
  • కరోనా నియంత్రణకు యథాశక్తిగా పనిచేశాం
  • కరోనా వైరస్‌పై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేస్తూ వెంటనే జీవో జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :వైద్య చికిత్సల పేరుతో దోపిడీకి పాల్పడే కార్పొరేట్‌ దవాఖానలను వదిలేదిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కరోనా చికిత్సలో అధిక ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. అధిక ఫీజుల నియంత్రణకు సీనియర్‌ ఐఏఎస్‌లతో ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ ప్రతివారం అది తీసుకున్న చర్యలపై నివేదిక ఇస్తుందని చెప్పారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు 

తీసుకున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఒకేసారి లక్షమందికి కరోనా వచ్చినా మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు ఉన్నాయని స్పష్టంచేశారు. ప్రజలు ఆందోళన పడవద్దన్నారు. స్వీయ నియంత్రణ శ్రీరామ రక్ష అని చెప్పారు. కరోనా నియంత్రణ చర్యలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘కరోనా చికిత్సను ప్రైవే టు దవాఖానలకు ఇవ్వొద్దు.. అవి ఇష్టం వచ్చినట్లు చేస్తయని మొదటినుంచి చెప్పిన. కేంద్రం మొదట 15 హాస్పిటళ్లకు అనుమతి ఇచ్చింది. మిగిలిన వారు హైకోర్టుకు వెళ్లారు. భరించేవాళ్లు వెళ్లి చికిత్స చేయించుకుంటరు.. ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ప్రైవేటు దవాఖానలు చికిత్స మొదలుపెట్టినయి. కార్పొరేట్‌ హాస్పిటళ్లపై నిఘా ఉండాల్సిందే. కార్పొరేటు హాస్పిటల్‌ వాళ్లు దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తరో కూడా అర్థమైతలేదు. బాధ్యత నిర్వర్తించాల్సిన ఈ టైంలో శవాలు పెట్టుకొని గందరగోళం చేసి లక్షలకు లక్షలు పీడించడం కరెక్టు కాదు. అటువంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటమని హామీఇస్తున్న. ఎవడైనాగానీ, ఏ హాస్పిటల్‌ అయినా దుర్మార్గంగా వ్య వహరిస్తే సహించేదిలేదు. లోకమంతా అల్లాడిపోతున్న టైంలో సంపాదించేందుకు ఈ బీమారే దొరికిందా? ఇది దుర్మార్గం. సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసరుతో టాస్క్‌ఫోర్సు వేసి రిపోర్టు తీసుకుంటం. తప్పకుండా ఫలితాలు ఉంటయి. ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీ తరఫున ప్రతివారం వివరాలు పంపండి. అందరూ గమనిస్తున్నారన్న భయం వారికీ ఉంటుంది. టాస్క్‌ఫోర్స్‌ పరిశీలన, తీసుకున్న చర్యలను ఆరోగ్యమంత్రి ప్రతివారం అధికారికంగా లేఖలో పంపిస్తారు’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

యథాశక్తి పనిచేసినం

‘కరోనా కట్టడికి ప్రభుత్వం యథాశక్తిగా పనిచేసింది. డబ్బుకు ఇబ్బందిలేదు. రూ.10 వేల కోట్లయినా ఖర్చుచేస్తం. అత్యవసర సమయంలో బాధ్య త కలిగిన ప్రభుత్వం ధైర్యం చెప్తది, భయపెట్టదు. తెలంగాణ ప్రభుత్వం అదే చేసింది. మందులు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అన్నీ ఉన్నయి. టిమ్స్‌లో 1500 పడకలు ఏర్పాటుచేసినం. ప్రభు త్వ దవాఖానలోని ప్రతిబెడ్డుకు వెంటిలేటరు ఏర్పా టు చేస్తున్నం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే దేశ సగటు కంటే కేసులు, మరణాలు తగ్గిన యి. చాలా రాష్ర్టాల్లో కంటే టెస్టుల్లోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. కరోనా నియంత్రణ కోసం డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు బాగా పనిచేశారు. కరోనాపై పోరులో ముం దున్న వీరికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ ఇచ్చినం. వైద్య సిబ్బందితోపాటు అక్కడ ఉండే పోలీసులకు పీపీఈ కిట్లు ఇచ్చినం. కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటూనే ప్రజలకు సంక్షేమం కూడా ఆగకుండా చేసినం. పేదలకు పైసలు, బియ్యం ఇచ్చినం. పెన్షన్లు పంపిణీ చేసినం. రెండు లక్షల మంది వలస కార్మికులను వారి ఇండ్లకు పంపినం. కేంద్రం పట్టించుకోకుంటే.. వారికి అరటిపండ్లు, భోజనం పెట్టి, చార్జీలు భరించి పంపించినం. రైతులు, పేదల కోసం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత పెట్టినం. కరోనా కాలంలో పండిన మొత్తం పంటను కొనుగోలు చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే’ అని సీఎం చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు

‘కేంద్రం ఏమీ ఇవ్వలేదు. అచ్చంగ చెప్పాలంటే శుష్కప్రియాలు, శూన్యహస్తాలు. ఎన్‌హెచ్‌ఎం కింద రూ.256 కోట్లు, మరో రూ.90 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఇతర గ్రాంట్లలో కోత పెడ్తరు. ఆరోగ్యశ్రీతో పోల్చితే ఆయుష్మాన్‌భవ ఎందుకూ పనికిరాదు. కరోనాతో ప్రభుత్వం ఆర్థికంగా బాగా ఇబ్బందిపడింది. రూ.15 వేల కోట్లు రావాల్సిన ఆదాయం వంద కోట్లకు పడిపోయింది. కేంద్రం జీఎస్టీ బకాయిలు కూడా ఇవ్వడంలేదు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నరు. ఇంకేదో అన్నరు. ఎదురుచూస్తున్నం. లొట్టపిట్ట పెదవులకు నక్క ఆశ పడ్డట్లు ఉన్నది. చిరు వ్యాపారులు, చిరుద్యోగుల కోసం ఏదైనా చేయొచ్చా? అని మున్సిపల్‌ మంత్రి కూడా సమీక్షించారు. ఏమీ కనిపిస్తలేదు. విసిగిపోయి వదిలేసిన. వారికి ఏదైనా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనిమీద అక్బరుద్దీన్‌, భట్టి విక్రమార్క లిఖితపూర్వకంగా ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నా’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

మీరు ఇచ్చిన దరిద్రమేకదా..

‘దవాఖానల్లో బెడ్లకు ఆక్సిజన్‌ లేకపోవడం మీ నుంచి లేదా? యాభై, అరవై ఏండ్ల నుంచి మీరే కదా ఉన్నది? ఈ దరిద్రం వచ్చింది మీ నుంచే కదా! కాంగ్రెస్‌ ప్రభుత్వాల కంటే మేం బాగా చేసినం. అనవసరంగా ఆపరేషన్లు చేసి మహిళల ఆరోగ్యాలను దెబ్బతీసిన పరిస్థితులను మార్చేందుకు కేసీఆర్‌ కిట్‌ తెచ్చినం. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలను ఏరాటుచేస్తున్నం’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

అయోమయంలోనూ ముందుకు...

‘వైద్యరంగంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్ర భుత్వాలు దృష్టి పెట్టాల్సిన పరిస్థితిని కరోనా తెప్పించింది. కరోనా పరిమితమైన జబ్బు కాదు. ఎవరికి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రపంచ ఆరో గ్య సంస్థ రోజుకో ప్రకటన చేస్తున్నది. కేంద్రం ఏం చేయాలో చెప్పదు. ఒకరు జీవితకాలం ఉంటుందంటరు. మరొకరు పదేండ్లకు పోతదంటరు. టీకా వచ్చిందని ఒకరు, ఇప్పుడే ఎట్లా వస్తదని ఇంకొకరు అంటరు. కరోనాపై ప్రపంచం మొత్తం అయోమయంలో ఉన్నది’ అని సీఎం అన్నారు.

ప్రార్థన మందిరాలు నిర్మిస్తం

‘కొత్త సచివాలయం నిర్మాణంతోపాటు అక్కడ గతంలో ఉన్న ప్రార్థనా మందిరాలను నిర్మిస్తం. నేను భక్తుడిని, దేవుడిని నమ్ముత. సచివాలయంలో గతంలో ఉన్న రెండు మసీదుల మధ్య స్థలం ఉంది. అది ఇమామ్‌కు కేటాయిస్తం. మసీదు నిర్మిస్తం. వక్ఫ్‌ బోర్డుకు అప్పగిస్తం. క్రైస్తవ సోదరుల కోసం చర్చి కూడా నిర్మిస్తం’ అని సీఎం చెప్పారు.

ప్రతిపక్షాలను కలువం

ప్రతిపక్షాలు గౌరవంగా, హుందాగా ఉంటే కలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ‘ప్రతిపక్షాలను కలువరు, అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు’ అంటున్నరు. ప్రతిపక్షాలు హుందాగా, గౌరవంగా, పద్ధతిగా ఉంటే కలుస్తం. ముందే ఒక అభిప్రాయంతో ఉండి ఏదో చేయాలని దానికి అనుగుణంగా కార్యక్రమంతో బయల్దేరితే ఎట్ల కలుస్తం? చావులను దాచిపెట్టామని అంటరు. ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధువులు ఉండరా? ఆ ఊరిలో, వాడలో ఎవరికీ తెలియదా? ఒక్క తెలంగాణలోనే బార్లు తెరిచినట్టు ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదు. కేంద్ర మార్గదర్శకాల మేరకే చర్యలు తీసుకున్నం. రాజస్థాన్‌, పంజాబ్‌లో తెరవలేదా? అసెంబ్లీలోనైనా, బయటైనా మంచి సూచనలు ఇస్తే కచ్చితంగా స్వీకరిస్తం. అంతే గానీ.. అంతా కుప్పకూలిపోయింది.. కాలిపోయింది.. అన్నట్టు మాట్లాడితే డాక్టర్లు, మంత్రి నిరుత్సాహపడుతరు. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసినట్లు మాట్లాడితే ఊరుకోం. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో మెరుగ్గా ఉన్నది. అందుకే మూడు పార్టీల వారు వైద్యమంత్రిని అభినందించారు. వారికి ధన్యవాదాలు’ అన్నారు. 

ఎవరి గొంతు నొక్కం

అసెంబ్లీలో ప్రాతినిధ్యానికి తగినట్లుగా పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ కోరారు. ముఖ్యమైన అంశాలపై చర్చ సమయంలో వీలైనంత ఎక్కువమంది మాట్లాడేలా చూడాలన్నారు. ‘చట్టసభలకు నిబంధనలు ఉంటాయి. పార్టీల సంఖ్యకు అనుగుణంగా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మేం ఎవరి గొంతు నొక్కం. ఆ అలవాటు మాకులేదు. సభలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు రావాలి. ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చిన మేరకు అధికార పార్టీ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అవకాశం ఇవ్వాలి. బయట పబ్లిక్‌ మీటింగ్‌ అయితే రెండు గంటలైనా మాట్లాడవచ్చు. శాసనసభలో నిబంధనల మేరకే మాట్లాడాలి. కీలకమైన రెవెన్యూ బిల్లు వంటి వాటిపై ఎక్కువమంది సభ్యులకు అవకాశం ఇవ్వాలి. నేను సభా నాయకుడిగా ఉన్నా టీఆర్‌ఎస్‌ పక్ష నేతగా మా పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం కోరుతాను. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాప తీర్మానంపై చర్చలో తమకు అవకాశం ఇవ్వలేదని పలువురు మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి నాతో చెప్పారు. ప్రతిపక్షాలు మంచి సూచనలు చేస్తే రెవెన్యూ బిల్లులో మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నం. అలాంటి విషయాల్లో మాకు భేషజాలు లేవు’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


logo