శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 01, 2020 , 02:27:08

25 కోట్లతో శానిటేషన్‌ హబ్‌

25 కోట్లతో శానిటేషన్‌ హబ్‌
  • త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తాం
  • ఏడాదిలోపల టీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ప్రారంభం
  • మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం నా పనితీరుకు నిదర్శనం
  • ఇంక్‌ వాష్‌ ముగింపు సమావేశంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో త్వరలోనే రూ.25 కోట్లతో శానిటేషన్‌ హబ్‌ (ఎస్‌-హబ్‌)ను ఏర్పాటుచేస్తామని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఏడాదిలోపు టీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. రెండున్నర నెలల్లో హైదరాబాద్‌ సహా వివిధ పట్టణాల్లో 3 వేల మూత్రశాలలు ఏర్పాటుచేస్తామని.. వీటి ఏర్పాటులో భాగస్వామ్యం కావడానికి స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. 


అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలే జ్‌ ఆఫ్‌ ఇండియా (అస్కి) ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఐసీఐసీఐ భవనంలో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఇంక్‌ వాష్‌ ముగింపు కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మున్సిపల్‌శాఖ మంత్రిగా తన పనితీరుకు ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజ లు ఏకపక్షంగా మద్దతు తెలిపారని, 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 122 స్థానా ల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. 


ఐటీ, పరిశ్రమలశాఖలు తన కూతురులాంటివని, మున్సిపల్‌శాఖ కుమారుడు లాంటిదని ఆయన అభివర్ణించారు. తండ్రులు ఎక్కువగా ప్రేమించేది, అభిమానించేది కూతుళ్లనేని.. అయినప్పటికీ కొడుకు కూడా సమానమేనని, ఈ రెండు శాఖలను సమానంగా చూస్తానని పేర్కొన్నారు. మున్సిపల్‌శాఖ కృతజ్ఞతలేని (థ్యాంక్‌లెస్‌ జాబ్‌) ఉద్యోగంగా ఆయన అభివర్ణించారు. మున్సిపాలిటీల్లో ఎంతపనిచేసినా అభినందించేవారు ఉండరని కానీ.. చిన్న పనిచేయకపోయినా తప్పుపట్టేవారు పెద్దఎత్తున ఉంటారన్నారు. 


ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ అంశాలు దేశాభివృద్ధికి ఎం తో కీలకమైనవని పేర్కొన్నారు. రూ.50 వేలకోట్లతో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించే బృహత్తరమైన మిషన్‌ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టి, నీటి సమస్యను తీర్చారని తెలిపారు. ఏడాది లోపల టీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభమవుతాయ ని, ప్రతి ఇంటికి నీటిని అందించినట్టే హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందజేస్తామన్నారు. 


హైదరాబాద్‌లో రెండువేల ఎమ్మెల్డీల లిక్విడ్‌ డిశ్చార్జి అవుతున్నదని చెప్పారు. ఇందులో 41శాతాన్ని శుద్ధిచేస్తున్నామని, ఇంత పెద్దమొత్తంగా దేశంలో ఏ నగరంలోనూ చేయడంలేదన్నారు. దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ముంబై లో 30శాతం, బెంగళూరులో 25శాతం మాత్ర మే నీటిని శుద్ధిచేస్తున్నారని వివరించారు. అధిక వ్యయమైనా ఎస్టీపీలను వికేంద్రీకరణ విధానంలో అమలుచేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 


స్టార్టప్‌లకు సర్కారు ప్రోత్సాహం

రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నదని, వారి ఉత్పత్తులకు మొదటి కస్టమర్‌ సర్కారేనని కేటీఆర్‌ తెలిపారు. టీ హబ్‌ ఏర్పాటుకు ముందు 200 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వేలసంఖ్యలో ఉన్నాయ ని చెప్పారు. గ్రామీణ, ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో అనేకమంది స్టార్టప్‌లు చేసేవారు ఉన్నారని, వారి ప్రతిభను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. కేంద్రం ఢిల్లీ దాటి బయటప్రాంతాల గురించి ఆలోచించదని, గుర్గావ్‌ వరకే పరిమితమవుతున్నదన్నారు. 


దేశ జనాభాలో 40 ఏండ్ల లోపువారు 65శాతం మంది, 25 ఏండ్ల లోపువారు 50శాతం ఉన్నారని, వీరి సేవలను, ఆలోచలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో మురికికాల్వలను శుభ్రం చేయడానికి జెట్టింగ్‌ మిషన్ల ఏర్పాటుపై ప్రధానమంత్రి కార్యాలయం ఆసక్తి కనబర్చిందని, ప్రస్తుతమున్న 75 మిషన్లకుతోడు మరో 75 కొనుగోలు చేస్తామని చెప్పారు. వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్క్‌కు నగరంలో మంచి ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. సెంటర్‌ ఆఫ్‌ అర్బన్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. 


అస్కి చైర్మన్‌ పద్మనాభయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నూతన ఆవిష్కరణలకు నిలయమని అభివర్ణించారు. టీ హబ్‌ సహా అనేక నూతన ఆవిష్కరణ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయని, హైదరాబాద్‌లో వాష్‌ హబ్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ)కు ఐవోసీఎల్‌ సంస్థ ట్రక్కును బహూకరించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ ఎండీ దానకిశోర్‌, సీడీఎంఏ శ్రీదేవి, మహబూబ్‌నగర్‌ డీఆర్డీవో వీ క్రాంతి, అస్కి ప్రొఫెసర్‌ వీ శ్రీనివాసచారి పాల్గొన్నారు.


హైదరాబాద్‌లోనూ ఇలా చేద్దాం

ముంబైలో ట్రాఫిక్‌ నియంత్రణపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ముంబై పోలీసులు అమలుచేస్తున్న విధానాన్ని హైదరాబాద్‌లో కూడా అనుసరించాలని మంత్రి కే తారకరామారావు పోలీస్‌ అధికారులకు సూచించారు. రెడ్‌సిగ్నల్స్‌ పడినప్పటికీ, కొంతమంది వాహనదారులు హారన్‌ మోగిస్తూ శబ్దకాలుష్యం సృష్టిస్తున్న నేపథ్యంలో దీనిని అరికట్టేందుకు ముంబై పోలీసులు సరికొత్త వ్యూహం అమలుచేస్తున్నారు. 


ఏదైనా కూడలిలో ధ్వనికాలుష్యం లెవల్స్‌ పరిమితిని దాటితే అక్కడ మళ్లీ రెడ్‌సిగ్నల్‌ పడేలా ఏర్పాటుచేశారు. దీంతో అక్కడ వాహనదారుల్లో మార్పు కనిపిస్తున్నది. సోషల్‌మీడియాలో వచ్చిన ఈ వీడియోను కేటీఆర్‌ శుక్రవారం ట్వీట్‌చేశారు. ‘ఇదే విధానాన్ని హైదరాబాద్‌లో తెద్దాం. చర్యలు తీసుకోండి’ అని డీజీపీతోపాటు  హైదరాబాద్‌ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ట్విట్టర్‌ ద్వారా సూచించారు. 


logo