బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 01:45:15

1 నుంచి బడులు

1 నుంచి బడులు

  • 9, ఆపై తరగతులు మాత్రమే
  • 25 నాటికి విద్యాసంస్థలు సిద్ధం కావాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను ఫిబ్రవరి 1 నుంచి తెరవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. 9, ఆపైతరగతులకు క్లాసులు నిర్వహించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు విద్యాసంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మెగా సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్‌ విద్యాసంస్థల పునఃప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9, 10, ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యాకోర్సుల తరగతులను మాత్రమే నిర్వహించాలని స్పష్టంచేశారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వాటిల్లో టాయిలెట్లు, ఇతర వసతులను సిద్ధంచేయాలని ఆదేశించారు.

కొన్ని నెలలుగా మూసిఉన్న నేపథ్యంలో భవనాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో అప్పట్లో నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుందని.. కొత్తగా స్టాక్‌ను ఏర్పాటుచేసుకోవాలని పేర్కొన్నారు. మొత్తంగా ఈ నెల 25వ తేదీలోగా విద్యాసంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలని చెప్పారు. మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను సందర్శించాలని, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.


logo