గురువారం 04 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:57:15

పైకం చెల్లింపు వారంలోపే

పైకం చెల్లింపు వారంలోపే

  • ఇటు మద్దతు ధర..  పోర్టల్‌లో పేరు నమోదు కాగానే ఖాతాల్లో సొమ్ము
  • కరోనా పరిస్థితుల్లో కర్షకుడికి అండగా ప్రభుత్వం
  • పంట కొనుగోళ్లలో కొత్తశకం
  • లాక్‌డౌన్‌లో కర్షకుడికి అండగా సర్కార్‌
  • ఊరూరా పంటకొనుగోలు కేంద్రాలు
  • పౌరసరఫరాలశాఖ పోర్టర్‌లో పేరు నమోదుకాగానే ఖాతాల్లో సొమ్ము
  • అన్నదాతల్లో అంతులేని ఆనందం

నిన్న మొన్నటిమాట.. 

తెలంగాణలో పంట పండటమే గొప్ప.. కొద్దో గొప్పో పండితే.. ఆ పంటను అమ్ముకోవడమూ  గగనమే.. ప్రభుత్వాలు పట్టించుకోవు..  సేట్లు.. దళారుల బారినపడితే అంతే సంగతులు.. తేమశాతమో..తాలున్నదనో.. అడ్డికిపావుసేరు బేరమాడుతారు.. మద్దతు ధర దక్కదు.. ఇస్తమన్న పైసలైనా వెంటనే ఇస్తరా అంటే నెలలు గడువాల్సిందే.. వచ్చే పంటకాలానికైనా దక్కుతుందా లేదా అన్నది అనుమానమే.. ఫలితం.. అప్పులు.. ఆర్థిక కష్టాలు.. ఆత్మహత్యలు..!

ఇది ఇవాళ్టి మాట

తెలంగాణలో పంట పండించడం ఓ స్టేటస్‌. పుష్కలంగా నీళ్లు.. 24 గంటల కరంటు.. ఊరూరా ధాన్యపురాశులు పోటెత్తాయి.. లారీలు, ట్రాక్టర్లు రికాం లేకుండా తిరుగుతున్నాయి. రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎక్కడికీ పోలేదు. కాంటాలే ఊళ్లకు వచ్చినయి.. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటున్నది. మద్దతు ధరను ఇచ్చి మరీ సేకరిస్తున్నది. ధాన్యం కొన్న వారంరోజుల్లో  డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నయి.. ఫలితం.. అప్పులు లేవు.. ఆర్థిక కష్టాలు లేవు.. అన్నదాత కండ్లల్లో ఆనందం తప్ప..!


నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ప్రపంచమంతా కరోనా కరాళనృత్యం చేస్తున్నది. సర్వవ్యవస్థలూ అవస్థలు పడుతున్నయి. కానీ, గ్రామాల్లో రైతులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పండిన ప్రతిగింజనూ కోనుగోలు చేస్తామని ప్రకటించినట్టుగానే పల్లెల్లో పంట కొనుగోళ్లు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతేవేగంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమవుతున్నది. రాష్ట్రంలో మునుపెన్నడూలేనివిధంగా రికార్డుస్థాయిలో యాసంగి పంట పండింది. అయితే, కరోనా కారణంగా కొనుగోళ్లపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలుచేసినా ఏ నెలకో.. రెండు నెలలకో డబ్బులు చేతికొస్తాయని రైతులు భయపడ్డారు. కానీ, పంటను అమ్ముకున్న వారంలోపే ఖాతాల్లో సొమ్ము జమకావడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఒకవైపు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మరోవైపు అన్నదాతల్లో సంతోషాన్ని నింపుతున్నది. ధాన్యం ఏ-గ్రేడ్‌కు రూ.1,835, బీ-గ్రేడ్‌కు రూ.1,815 మద్దతుధర చెల్లిస్తూ ప్రభుత్వం కొనుగోలుచేస్తున్నది.వరికి ఈస్థాయిలో మద్దతు ధర గతంలో ఎన్నడూ దక్కిన దాఖలాలు లేవు.

కొనుగోళ్లలో సాంకేతికత

పంట కొనుగోళ్లలో ఆన్‌లైన్‌ వ్యవస్థను అనుసంధానం చేసి ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ట్యాబ్‌లను అందజేసిన పౌరసరఫరాల అధికారులు.. ఇందుకోసం బుక్‌కీపర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రైతు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చాక తూకం వేయగానే నిర్వాహకులు ట్యాబ్‌లో యూజర్‌ ఐడీని నమోదుచేసి లాగిన్‌ అవుతారు. ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, కన్స్యూమర్‌ అఫైర్స్‌ అండ్‌ సివిల్‌ సప్లయ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ అనే పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో రైతుపేరు, బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్లు, పట్టాపాసు పుస్తకం వివరాలు నమోదుచేస్తారు. రైతు ధాన్యం వివరాలను పొందుపరుస్తారు. వెంటనే ఆ వివరాలు సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి మద్దతు ధర ప్రకారం 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమవుతాయి. ధాన్యం కొనుగోలు సమయంలో త్వరితగతిన తూకం వివరాల నమోదు చకచకా పూర్తవుతున్నది. ధాన్యం తూకం వేయడం, తేమశాతం నిర్ధారించడం, సంచులు కుట్టడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో నిర్వాహకులు ప్రశంసలందుకుంటున్నారు.

ఐదు రోజుల్లో పైసలొచ్చినయ్‌..

పోయిన నెల 29న హుజూరాబాద్‌ సొసైటీ కేంద్రంలో 57 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. సోమవారం 1,04,595 రూపాయలు బ్యాంక్‌ ఖాతాలో జమైనయ్‌. ఇంతతొందరగా పైసలు వస్తాయని అనుకోలే. ప్రభుత్వం ఈ కష్టకాలంలో రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నయి. గతంలో పదిరోజుల్లో పైసలు పడగా, ఇప్పుడు ఇంత త్వరగా రావడంతో సంతోషమనిపిస్తాంది. కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటం. సన్నవడ్లు వ్యాపారులకు ఇస్తే పైసలకు 20 రోజులకు పైగానే వాయిదా పెడుతున్నరు. 

-బద్దం రాజిరెడ్డి, రైతు, రాంపూర్‌, హుజూరాబాద్‌

లాక్‌డౌన్‌ అడ్డుపడలేదు

లాక్‌డౌన్‌తో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రెండెకరాలపొలంలో పండిన 149 బస్తాల (40 కిలోల బస్తా) ధాన్యాన్ని అమ్ముడెప్పుడో.. డబ్బులు చేతికందుడెప్పుడో అని గందోరగోళానికి గురయ్యా. కొనుగోలుకేంద్రానికి తీసుకెళ్లిన రోజునే వరుస సంఖ్యకు టోకెన్‌ ఇచ్చారు. దానిఆధారంగా ధాన్యం కాంటా పెట్టారు. కాంటా అయిన మూడురోజుల్లోనే బ్యాంకులో డబ్బులు జమయ్యాయి. 

- సింగరబోయిన వీరయ్య, కాచికల్‌, నెల్లికుదురు, మహబూబాబాద్‌ జిల్లా

మా ఊర్లోనే వడ్లు అమ్ముకున్నా

మా ఊర్లోనే ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ కేంద్రంలో నా వడ్లు అమ్ముకున్నా. గతంలో సూర్యాపేట మార్కెట్‌కు 12 కిలోమీటర్ల దూరం పోయి ఇబ్బందులు పడేటోళ్లం. ఒక్కోసారి 4,5 రోజులు మార్కెట్‌లోనే గడిచేది. మూడేండ్లుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్‌పల్లి వద్ద ఐకేపీలో అమ్ముకున్నం. కానీ ఈ ఏడాది మా ఊర్లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన్రు. రైతులంతా సంతోషంగా ధాన్యం అమ్ముకుంటున్నరు. 

- తేజావత్‌ జాను, వల్లభాపురం, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా

రోగం కాలంలోనూ మాకేం ఇబ్బంది లేదు

దేశమంతా కరోనా రోగమని బాధపడుతుండ్రు. గిసుంటి టైంలో కూడా రైతులకైతే ఇబ్బందిలేకుండా జూస్తుండ్రు. నేను పండించిన పంటను ఇబ్బంది లేకుండ అమ్ముకున్నా. బ్యాంక్‌ అకౌంట్లా పైసల్‌ గూడా వచ్చేసినయ్‌. గతంలో దళారులే వచ్చి మా పంటను తక్కువ ధరకు బలవంతంగా కొనేది. ఇప్పుడు సర్కార్‌ వాళ్లే వచ్చి మా పంటను తీసుకపోతుండడంతో మంచిగుంది.

- మేకల చిన్న గాలయ్య, కామారెడ్డి జిల్లా

ధాన్యం ఆగమైతదనుకున్న.. 

కరోనా పరిస్థితులతో మస్తు భయపడ్డం. ఆరుగాలం పండించిన ధాన్యం ఆగమైతదని అనుకున్న. ఈసారి యాసంగిలో మంచి లాభాలు వచ్చినయ్‌. కాళేశ్వరం పూర్తయ్యాక ఎస్సారెస్పీ కాలువల నుంచి పుష్కలమైన నీళ్లు అచ్చినయ్‌. మొత్తం 14 ఎకరాల్లో 560 బస్తాలు (392 క్వింటాళ్లు) ధాన్యం దిగుబడి అచ్చింది. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే అమ్మిన. రూ. 7,19,320ల ఆదాయం అచ్చింది. రెండు రోజుల్లోనే పైసలు బ్యాంకు ఖాతాలో వేయడం ఆనందంగా ఉంది. 

- గుండా పాపారావు, పవర్‌హౌస్‌ కాలనీ, మంథని, పెద్దపల్లి జిల్లా


logo