సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:12:18

అబ్బురపరిచేలా కొత్త భవనం

అబ్బురపరిచేలా కొత్త భవనం

  • దక్కన్‌ కాకతీయశైలిలో నిర్మాణం
  • శ్రావణ మాసంలో పనుల ప్రారంభం  
  • ఏడాదిన్నరలో పూర్తిచేసేందుకు ప్రణాళిక
  • ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్చర్స్‌ డిజైన్‌ 
  • 7 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తులతో
  • 20% భవనం.. 80% ఉద్యానవనాలు  
  • రూఫ్‌టాప్‌లపై సోలార్‌ విద్యుత్‌ ప్యానెళ్లు
  • ఏకకాలంలో 800 కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు 
  • ప్రార్థనాస్థలాలు, ఏటీఎంలు, క్యాంటీన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వాగతం పలికే పచ్చికబయళ్లు.. దారివెంట సందర్శకులను పలుకరించే రంగురంగుల పూల మొక్కలు. అక్కడక్కడా నీటిని విరజిమ్ముతూ ఆహ్లాదపరిచే తంగేడుపువ్వు ఆకారంలోని ఫౌంటెన్లు. ఎటుచూసినా ఉద్యానవనాలు.. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 80% పచ్చదనం ఉంటే.. మిగిలిన 20% స్థలంలో అబ్బురపరిచే అందమైన భవనం! ఓ వైపు గుడి, మరోవైపు బ్యాంకు. డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు.. పునరుత్తేజం పొందడానికి  క్యాంటీన్లు! ఏ మంత్రినైనా, అధికారినైనా ఒకేచోట కలుసుకొనే సదుపాయం! ఇన్ని హంగులు.. ఆర్భాటాలతో.. మరిన్నో విశేషాలతో.. తెలంగాణకే తలమానికంగా.. వందేండ్లు నిలిచేలా హైదరాబాద్‌లో నూతన సచివాలయం రూపుదిద్దుకోబోతున్నది. 

శ్రావణమాసంలోనే పనులు ప్రారంభం

అత్యాధునిక వసతులు, అత్యంత భద్రతా ప్రమాణాలతో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ శ్రావణ మాసంలోనే నిర్మాణం ప్రారంభించనున్నారు. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో నూతన సచివాలయం నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే చెన్నైకి చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్చర్స్‌ రూపొందించిన భవనం బాహ్యరూపానికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. ఆ భవన నమూనాను ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసింది.  దక్కన్‌ కాకతీయ శైలిలో ఈ భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. భవనం లోపలివైపు నిర్మాణాల డిజైన్‌కు ముఖ్యమంత్రి త్వరలో ఆమోదం తెలుపనున్నారు. చెన్నై సంస్థ మొత్తం 10 డిజైన్లను రూపొందించగా, రోడ్లు భవనాలశాఖ మూడింటిని ఎంపికచేసి సీఎం ముందుంచింది. వాటిలో ఒకదాన్ని సీఎం ఖరారు చేయనున్నారు. 

గుడి, బడి, పార్కింగ్‌, గ్రీనరీ

ఈ కాంప్లెక్స్‌లో ఓ శిశుసంరక్షణ కేంద్రం, దేవాలయం, మసీదు, ఇతర ప్రార్థనా మందిరాలు, క్యాంటీన్‌, ఫైర్‌ స్టేషన్‌, బ్యాంకులు, ఏటీఎంలకు ప్రత్యేక భవనాలు, విజిటర్స్‌ కోసం ప్రత్యేక పార్కింగ్‌ తదితర సౌకర్యాలు ఉండేలా నమూనాను రూపొందించారు. పార్కింగ్‌ స్థలంలో ఒకేసారి 500 కార్లు, విజిటర్స్‌ పార్కింగ్‌లో మరో 300 కార్లు పార్క్‌ చేసేలా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పార్కింగ్‌ ప్రదేశాలు కూడా పచ్చదనంతో సందర్శకులను ఆకర్షించేలా, చూపరులకు ఆహ్లాదం కలిగించేలా ఉంటాయి. వీటన్నింటితోపాటు ఈ ప్రాంగణంలోనే ఒక హెలిపాడ్‌ కూడా ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు అక్కడినుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చే సదుపాయం కల్పించనున్నారు. 

రూ.500 కోట్లతో నిర్మాణం

సమీకృత సచివాలయ భవనాన్ని ప్రభుత్వం దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నది. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సమావేశాలు నిర్వహించడం కోసం అధునాతన హాల్స్‌ నిర్మించనున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీలు కూడ ఇక్కడే జరిగేలా సమావేశ మందిరాలను నిర్మించనున్నారు. శాఖలవారీగా మంత్రులు, సెక్రటరీలు, సెక్షన్లవారీగా ఉద్యోగులంతా ఒకే దగ్గర ఉండేలా కార్యాలయాలను నిర్మించనున్నారు.

కాకతీయ శైలిలో

కొత్త భవనం ఫీచర్స్‌ అన్నీ పూర్తి వాస్తు ప్రకారం డిజైన్‌ చేయనున్నారు. దక్షిణభారత సంప్రదాయంలో, దక్కన్‌ కాకతీయ శైలిలో నిర్మించనున్న సమీకృత సచివాలయ భవనం తెలంగాణకు తలమానికంగా ఉండబోతున్నది. మనోహరమైన కాకతీయుల నిర్మాణశైలిలో విలక్షణంగా కొత్త భవనం రూపుదిద్దుకోనున్నది. మొత్తం 25 ఎకరాల స్థలంలో 20% మాత్రమే సమీకృత భవన నిర్మాణానికి, మిగిలిన 80% ఉద్యానవనాలు, ఫౌంటైన్ల కోసం వినియోగించనున్నారు.

ఇంటిగ్రేటెడ్‌, స్మార్ట్‌ అండ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌

కొత్త సచివాలయ భవనాన్ని దీర్ఘ చతురస్రాకారంలో, జీ ప్లస్‌ 5.. అంటే ఆరు అంతస్తుల్లో, ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. భవనం ప్రవేశద్వారం రెండు మీటర్ల ఎత్తయిన పోడియంతో ఉంటుంది. పెద్దపెద్ద కారిడార్లు, గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా గదులు, భారీ వరండాలను డిజైన్‌ చేశారు. కొత్త భవనం ముఖద్వారం తూర్పు వైపు ఉంటుంది. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ప్రవేశద్వారం ఏర్పాటుచేస్తారు. భవనం మధ్యలో చెట్లు, పచ్చికబయళ్లతో కూడిన రెండు పెద్ద వరండాలు లోపల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేలా ఉంటాయి. ఎదురుగా ఉండే హుస్సేన్‌సాగర్‌ మీదుగా వీచే గాలులు లోపలికి ప్రవేశించి, భవనం ఎప్పుడూ చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త సెక్రటేరియట్‌ రూఫ్‌ టెర్రస్‌, పార్కింగ్‌ రూఫ్‌టాప్‌లపై సోలార్‌ ప్యానళ్ల అమరికతో సౌర విద్యుత్తు ఉత్పత్తిచేసి అక్కడే వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం మొత్తం ధారాళంగా గాలి ప్రసరించి సహజమైన చల్లదనం ఉండేలా, లోపల ఉండే భారీవరండాలు స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు దోహదపడేలా ఏర్పాట్లు చేస్తారు. మంత్రుల కార్యాలయాలన్నీ ఒకే అంతస్తులో పక్క పక్కనే ఉంటాయని తెలుస్తున్నది. అధికారుల కార్యాలయాలు కూడా వారికి సమీపంలోనే ఉంటాయని సమాచారం. ఈ ఏర్పాటువల్ల పనులు అకారణంగా జాప్యమయ్యే అవకాశాలు ఉండవు.

ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తి

కొత్త సచివాలయం ప్రాంగణంలో దాదాపు 60% అందమైన పచ్చికబయళ్లతో ఉంటుంది. ఆ ప్రదేశాన్ని కర్బన రసాయనాలను నియంత్రించేలా,  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా తీర్చిదిద్దనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా పచ్చికబయళ్లు భవనానికి ఈశాన్యం, ఆగ్నేయం మూలల్లో ఉండేలా నిర్మాణం జరుగనుంది. రెండు ల్యాండ్‌ స్కేప్‌లలో రెయిన్‌వాటర్‌ హార్వెస్టర్లు ఏర్పాటుచేయనున్నారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర అధికారిక పువ్వు తంగేడు ఆకారంలో వాటర్‌ ఫౌంటైన్లను నెలకొల్పనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌లో, విద్యుత్‌ దీపాల అవసరం లేకుండా సహజమైన వెలుతురుపడేలా ఉంటుంది. భవనం మొత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌లో నిర్మితమవుతుంది. స్మార్ట్‌ లైటింగ్‌ కంట్రోళ్లు, మోషన్‌ సెన్సర్లు, ఆటోమేటిక్‌ స్విచ్‌లు, టైమర్లు, డిమ్మింగ్‌ కంట్రోళ్లు లాంటి హంగులన్నిటినీ ఏర్పాటు చేయనున్నారు.

ఆర్కిటెక్ట్‌   కపుల్‌ ఆస్కార్‌ అండ్‌ పొన్ని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ నూతన సచివాలయ భవనానికి డిజైన్‌ను అందించిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్స్‌కు చెందిన ఇంజినీర్లు ఆస్కార్‌ జీ కాన్సెస్సావో, పొన్ని ఎం కాన్సెస్సావోలు భార్యాభర్తలు. తిరుచిరాపల్లిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీ ఆర్చ్‌ డిగ్రీ పూర్తిచేసిన వీరిద్దరు ఆ తరువాత అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. రెండు అంతర్జాతీయ యూనివర్సిటీలు వీరిద్దరినీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. తొలుత వీరిద్దరూ న్యూయార్క్‌ నగరంలో ప్రముఖ ఆర్కిటెక్ట్స్‌తో కలిసి ఆకాశ హర్మ్యాలు, సంస్థాగత భవనాలు, హోటళ్లు, దవాఖానలు, స్టేడియాలు నిర్మించారు. 1996లో భారత్‌కు తిరిగొచ్చి చెన్నైలో కార్యకలాపాలు ప్రారంభించారు. వీరిద్దరూ దోహా, కతార్‌ దేశాల్లో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలకు రూపకల్పనచేశారు. అంతేకాకుండా భారత్‌లో సైతం ఐటీ పార్కులు, బయోటెక్‌ పార్కులు, నానో టెక్నాలజీ పార్కులు, టౌన్‌షిప్‌లు, దవాఖానలు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, రిసార్ట్‌లు, మాల్స్‌, కార్పొరేట్‌ కార్యాలయాలు, విలాసవంతమైన భవనాలు, ఫ్యాక్టరీలు, సెజ్‌లు, పలు ప్రభుత్వ భవనాలకు డిజైన్లను అందిచారు. వీరికి 131కి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అవార్డులు లభించాయి. 

922 కోట్లతో పార్లమెంట్‌కూ కొత్త భవనం 

న్యూఢిల్లీ: దేశ శాసన వ్యవస్థకు కేంద్రస్థానమైన పార్లమెంట్‌ భవనాన్నే మార్చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనాన్ని నిర్మించి 93 ఏండ్లు కావడంతో కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రూ.922 కోట్లతో నిర్మించే ఈ భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణశాఖ తాజాగా అనుమతులు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నప్పటికీ పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలో ఇప్పటి పరిస్థితులకు తగినవిధంగా మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు లేవని, భవనం అనేక భాగాల్లో శిథిలమవుతున్నదని సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం తెలిపింది.


logo