గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 20:26:58

కోవిడ్‌-19 చికిత్స‌ మ‌రింత వికేంద్రీకర‌ణ : మ‌ంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌

కోవిడ్‌-19 చికిత్స‌ మ‌రింత వికేంద్రీకర‌ణ : మ‌ంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌

హైద‌రాబాద్ : కోవిడ్ -19 చికిత్సను మరింత వికేంద్రీకరించ‌నున్న‌ట్లు రాష్ర్ట వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. ఈ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా  వైద్యాధికారుల‌ను ఆయ‌న శ‌నివారం ఆదేశించారు. కోవిడ్‌-19పై స‌మీక్షా స‌మావేశం సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌రోనా రోగులను టిమ్స్ గ‌చ్చిబౌలి, కింగ్ కోటిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల‌న్నారు. గాంధీ ఆసుపత్రి కాకుండా హైదరాబాద్ లోని ఇతర సంరక్షణ కేంద్రాలలోని ఆరోగ్య సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో అనేక ప్రైవేట్ బోధనా ఆసుపత్రులు ఉన్నాయన్నారు. అవి కూడా కోవిడ్ -19 పాజిటివ్ రోగులకు చికిత్స అందించ‌డంలో ముందుండాల‌న్నారు. 

మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్‌విఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ, సిద్దిపేట ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ, అపోలో హాస్పిటల్స్, కామినేని మెడికల్ కాలేజీలతో సహా శివార్లలోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోవిడ్ చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌ చికిత్స వికేంద్రీకరణను అన్ని జిల్లాల్లో అమలు చేయాల‌న్నారు. అత్యవసర ప‌రిస్థితుల్లో హైదరాబాద్‌కు తరలించవచ్చు అన్నారు. లక్షణాలు లేని రోగులు ఇంటి వ‌ద్దే ఐసోలేషన్ మార్గదర్శకాలను పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొన్నారు.


logo