ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 02:15:27

కోటి బేళ్లు!

కోటి బేళ్లు!

  • ఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా..
  • వ్యవసాయవర్సిటీ లెక్క 99 లక్షల బేళ్లు
  • గత ఏడాది కంటే 39 లక్షల బేళ్లు అధికం
  • కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ రెడీ
  • అంతర్జాతీయంగా పెరుగనున్న డిమాండ్‌
  • 60.22 లక్షల ఎకరాల్లో దూదిపూల సాగు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పత్తి ఈ ఏడాది రికార్డుస్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం సుమారు 99 లక్షల బేళ్ల (ఒక బేల్‌ 170 కేజీలు) పత్తి ఉత్పత్తవుతుందని జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ అంచనా వేసింది. పత్తి దిగుబడికి అనుగుణంగానే అంతర్జాతీయంగానూ డిమాండ్‌ పెరిగే అవకాశమున్నదని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పత్తి పంట చేతికి రావడం ప్రారంభమైంది. ఈ నెల మూడోవారం వరకు ఇది క్రమంగా పెరుగనున్నది. 

ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది పత్తిసాగులో తెలంగాణ.. గుజరాత్‌ను వెనక్కినెట్టి దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. నియంత్రిత సాగులో భాగంగా ప్రభుత్వం ఈ సీజన్‌లో 60.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకుమించి 60.22 లక్షల ఎకరాల్లో సాగయింది. దేశవ్యాప్తంగా 318.64 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 104.08 లక్షల ఎకరాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉన్నది.

తెలంగాణలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరుగడంతో దిగుబడి కూడా అదేస్థాయిలో పెరిగే అవకాశం ఉన్నది. సెప్టెంబర్‌ అంచనాల ప్రకారం 99.53 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని వర్సిటీవర్గాలు తెలిపాయి. గతేడాది 60 లక్షల బేళ్లు మాత్రమే వచ్చింది. గతేడాదితో పోల్చితే ఈసారి 39 లక్షల బేళ్లు అధికంగా రానున్నదని చెప్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, విస్తారమైన వర్షాలు కురిసినా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని.. దీంతో దిగుబడి తగ్గవచ్చని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 371.18 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కావచ్చని అంచనావేయగా.. 2019-20లో 330 లక్షల బేళ్లు పండింది.


అంతర్జాతీయంగా పెరుగనున్న డిమాండ్‌

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో అంతర్జాతీయ పత్తి మార్కెట్‌కు మళ్లీ పాతరోజులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడు నాలుగు నెలల్లో అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్‌ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. భారత్‌ నుంచి ఎగుమతులు కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఈ ఏడాది సుమారు 65 లక్షల బేళ్ల పత్తి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉన్నదని కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనావేసింది. ఈ అంచనాలు వాస్తవ రూపం దాల్చితే దేశంలో పత్తికి భారీగా డిమాండ్‌ పెరుగనున్నది.

కొనుగోళ్లకు ఏర్పాట్లు

పంట చేతికొస్తుండటంతో పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగానే ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలో మొత్తం పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ సీఎండీ ప్రదీప్‌కుమార్‌ అగర్వాల్‌ హామీఇచ్చారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. సీసీఐ మద్దతు ధరకు కొనుగోలుతో రైతుకు కూడా గిట్టుబాటు ధర వస్తుందని పేర్కొంటున్నారు.logo