బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 02:55:01

పది పరీక్షకు 99.61% హాజరు

పది పరీక్షకు 99.61% హాజరు

  • తొలిరోజు ప్రశాంతంగా నిర్వహణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ భాష పరీక్షలకు 99.61 శాతం హాజరు నమోదైందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి చెప్పారు. పరీక్షల కోసం 5,10,461 మంది నమోదు చేసుకోగా, 5,08,457 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క మాల్‌ ప్రాక్టిస్‌ కేసు కూడా నమోదుకాలేదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. విద్యార్థులు సైతం ఎవరికివారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

పరీక్ష కేంద్రాలకు ‘కరోనా’ మార్గదర్శకాలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ప్రభుత్వ పరీక్షల విభాగం మార్గదర్శకాలు విడుదలచేసింది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు గుమికూడకుండా చూడాలని సూచించింది. గేట్ల ముందు నిలబడకుండా పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని తెలిపింది. రోజూ టేబుళ్లు, కుర్చీలు, తలుపులు, కరంట్‌ స్విచ్‌లు వంటివి పరిశుభ్రంగా ఉంచాలని, కేంద్రాల్లో లిక్విడ్‌ సోపులు, శానిటైజర్లు ఏర్పాటుచేయాలని సూచించింది. మాస్క్‌లు పెట్టుకోవడానికి, వాటర్‌ బాటిళ్లను తీసుకెళ్లడానికి విద్యార్థులను అనుమతించాలని.. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ప్రత్యేక గది ఏర్పాటుచేయాలని పాఠశాలల యాజమాన్యాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ సత్యనారాయణ ఆదేశించారు.


బాధను దిగమింగి.. బాధ్యతనెరిగి

రాష్ట్రంలో పలువురు విద్యార్థులు కుటుంబసభ్యులు మరణించిన బాధను దిగమింగి.. బాధ్యతతో పది పరీక్షకు హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్‌లో తండ్రి చనిపోగా కొడుకు రవి పది పరీక్ష రాసొచ్చాక అంత్యక్రియలు నిర్వహించాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కొత్తూర్‌లో తండ్రి చనిపోగా కుమార్తె చల్ల త్రిష, ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో తల్లి మృతిచెందగా  కొడుకు పుండలిక్‌, గద్వాల జిల్లా బుడమొర్సులో అన్న చనిపోగా.. చెల్లి సంపూర్ణ పరీక్షకు హాజరయ్యారు.

ఒక విద్యార్థి.. 8 మంది సిబ్బంది హుజూరాబాద్‌టౌన్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని న్యూశాతవాహన ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల (ప్రైవేట్‌ సెంటర్‌)లో గురువారం పదోతరగతి పరీక్షకు ఒకే విద్యార్థి హాజరయ్యాడు. అతడిని పర్యవేక్షించేందుకు సిట్టింగ్‌ స్కాడ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ మొదలు అటెండర్‌ వరకు మొత్తం ఎనిమిది మంది విధులు నిర్వహించారు. 


logo
>>>>>>