శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 15:35:13

ప్రాణాంతక వ్యాధితో పోరాటం.. జార్జియాలో చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డ

ప్రాణాంతక వ్యాధితో పోరాటం.. జార్జియాలో చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డ

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోందిప్పుడు. వ్యాధి నిరోధానికి, వైరస్‌ వ్యాప్తికి ఆయా దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో విమానయాన ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి వచ్చేందుకు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వెళ్లిన ప్రదేశంలో ఉండనీయక, ఉండలేక, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయాణ సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. ఎవరైన అస్వస్థకు గురైతే వారి కుటుంబ సభ్యుల వేధన వర్ణనాతీతం. ఇటువంటి ఘటనే తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ విద్యార్థిని విషయంలో జరిగింది.

భువనగిరికి చెందిన శివాణి అనే విద్యార్థిని వైద్య విద్య అభ్యసించేందుకు జార్జియా వెళ్లింది. కాగా రెండు రోజులక్రితం కాలేజీకి వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైంది. వైద్యులు పరీక్షలు చేసి మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని తెలిపారు. వెంటనే చికిత్స చేయాల్సిందిగా సూచించారు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు బాధితురాలి తల్లిదండ్రులకు తెలియజేశారు. హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుని తమ బిడ్డను తిరిగి పంపించాల్సిందిగా కోరారు. కానీ శివాణిని భారత్‌కు తరలించేందుకు జార్జియా అధికారులు నిరాకరించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తీవ్ర ఆంక్షలు అమలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ చికిత్స అందకపోతే బ్రతకలేదని కావునా తిరిగి భారత్‌కు రప్పించాల్సిందిగా తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.


logo