సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:34

‘ఉపాధి’ పనిదినాలు 24 కోట్లకు పెంచండి

‘ఉపాధి’ పనిదినాలు 24 కోట్లకు పెంచండి

  • కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధికారుల లేఖ
  • నెలాఖరుకే ఏడాది లక్ష్యం చేరనున్న రాష్ట్రం
  • 13.66 కోట్లలో 11.09 కోట్ల పనిదినాలు పూర్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) పనిదినాలను 24 కోట్లకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణాలు వదిలి పల్లెలకు చేరిన పేదలు, ఉపాధి కూలీలుగా మారారు. సాధారణంగా ఇప్పటివరకు 7.30 కోట్ల నుంచి 8 కోట్ల పనిదినాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో  ఈ ఏడాది కేంద్రం కేటాయించిన 13.66 కోట్ల పనిదినాల్లో 11.09 కోట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం హరితహారం, కల్లాల నిర్మాణం  పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు కోట్ల పనిదినాలు నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో పూర్తవుతాయి. ఎనిమిది నెలల ముందే కేటాయించిన పనిదినాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర సానుకూలంగా స్పందిస్తుందని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.  

ఐదేండ్ల రికార్డులు బ్రేక్‌

పనిదినాల పెంపునకు కేంద్ర ఆమోదం తెలిపితే.. ఐదేండ్ల రికార్డులు బ్రేక్‌ కానున్నాయి. 2015-16లో అత్యధికంగా 14.21 కోట్ల పనిదినాలను రాష్ట్రం వాడుకున్నది. ఆ తర్వాత ఏడాది నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న పనిదినాల వినియోగం ఈ ఏడాది అనూహ్యంగా పెరిగింది. రోజు కూలిని రూ.231కి పెంచడం కూడా కూలీల హాజరు పెరగడానికి దోహదపడుతున్నది. ఇప్పటికే రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది కూలీలకు పనుల్లో ఉంటున్నారు. 

ఐదేండ్లలో తెలంగాణ వాడుకున్న పనిదినాలు ఇలా..

సంవత్సరం 

పనిదినాలు  (కోట్లలో)

2015-16
14.21
2016-17
10.81
2017-18
11.47
2018-1911.77
2019-209.75
2020-2111.09 


(ఇప్పటి వరకు)
logo