ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 04:16:22

తెలంగాణ క్రమశిక్షణ

తెలంగాణ క్రమశిక్షణ
  • ఎఫ్‌ఆర్బీఎం పరిధిలోనే తెలంగాణ అప్పులు
  • బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి అతి తక్కువ రుణం తీసుకున్న రాష్ట్రం
  • పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి కేంద్రం స్పష్టీకరణ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఆర్థికక్రమశిక్షణలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, ఎక్కువ సంపద ఉన్నా తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ర్టాల్లో ముందు వరుసలో నిలిచిందని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి వెల్లడించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఆర్థిక క్రమశిక్షణ దాటలేదని పేర్కొన్నది. తెలంగాణప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్బీఎం) పరిమితికి లోబడే ఉన్నాయా? లేక పరిధి దాటాయా? అంటూ రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ సోమవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు పరిమితిలోనే ఉన్నాయంటూ గతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించగా.. బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి తీసుకుంటున్న అప్పులు ఇతరరాష్ర్టాల కంటే తెలంగాణలోనే తక్కువగా ఉన్నాయంటూ సహాయమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ తాజాగా లిఖితపూర్వకంగా ప్రకటించడంతో రాష్ట్రం అప్పులపై గొంతుచించుకునే ప్రతిపక్షాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 (3) సెక్షన్‌ ప్రకారం ఆయా రాష్ర్టాల సంపద (జీఎస్డీపీ) మొత్తంలో 3శాతం వరకు మాత్రమే అప్పుతీసుకునే పరిమితి ఉంటుందని.. దానిని అనేక రాష్ర్టాలు అతిక్రమిస్తున్నా తెలంగాణ మాత్రం పరిధి దాటలేదని కేంద్రమంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. 


రాష్ట్రఖజానాపై అప్పుల భారం పెంచకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నదని కితాబిచ్చారు. ‘తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఏ ఏడాది కూడా ఆర్థిక క్రమశిక్షణ గీత దాటలేదు. సంపద ఎక్కువ ఉన్నా అతితక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ర్టాల్లో ముందువరుసలో ఉన్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బ్యాంకులు, నాబార్డు, పీఎఫ్‌సీ, హడ్కో వంటి ఆర్థికసంస్థల నుంచి రూ. 3,468 కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నది’ అని వెల్లడించారు. ఎఫ్‌ఆర్బీఎంకు లోబడే రుణాలు తీసుకుని ఆర్థికక్రమశిక్షణ పాటిస్తున్నట్టు స్పష్టంచేశారు. దేశంలోని 29 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి బ్యాంకులు ఇతరఆర్థిక సంస్థల నుంచి ఇప్పటివరకు రూ.2,58,232.30 కోట్ల అప్పు తీసుకున్నాయని.. పెద్దరాష్ర్టాలలో అతితక్కువ అప్పు తీసుకున్న జాబితాలో తెలంగాణ ముందువరుసలో నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో ఏపీ రూ.5,117కోట్లు, తమిళనాడు రూ.11,220 కోట్లు, కర్ణాటక రూ. 4,941 కోట్లు అప్పు తీసుకున్నాయి. 


దేశవ్యాప్తంగా అత్యధికంగా అప్పు తీసుకున్న రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రం రూ.63,452 కోట్లు తీసుకోగా.. పంజాబ్‌ రూ.29310.90 కోట్లు, మహారాష్ట్ర రూ.18,721 కోట్లు, గుజరాత్‌ రూ.17,075 కోట్లు, మధ్యప్రదేశ్‌ రూ.15,061.60 కోట్లు తీసుకున్నాయి. చిన్నరాష్ర్టాలయిన అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరం, గోవా వంటి చిన్న రాష్ర్టాలు తక్కువ అప్పు తీసుకున్న జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సంపద ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉన్నది. అందులో 3 శాతం వరకు అప్పు తీసుకునే అవకాశముంటుంది. రాష్ట్ర ఆర్థికపరిస్థితి పటిష్ఠంగా ఉండటంతోపాటు, క్రమశిక్షణ పాటిస్తున్న కారణంగా కేంద్రప్రభుత్వం ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని 3 నుంచి 3.25కు తర్వాత 3.5 వరకు పెంచుతున్నది. దీనిప్రకారం మన రాష్ట్రం ఈ ఏడాది రూ.27 వేల వరకు అప్పుతీసుకునే అవకాశమున్నది. అయితే తెలంగాణ సర్కార్‌ మాత్రం మొత్తం అప్పులు పరిమితి దాటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.


రాష్ట్ర రాబడులు 67,574 కోట్లు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో జనవరి వరకు రాష్ట్రం మొత్తం రాబడులను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం సొంత రాబడులతోపాటు కేంద్రగ్రాంట్లు కలుపుకుని రూ.67,574 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరిందని తెలిపింది. ఇది మొత్తం బడ్జెట్‌ అంచనాలలో 70 శాతాన్ని దాటినట్టు పేర్కొన్నది. ఫిబ్రవరి, మార్చి కలిపితే ఇది ఇంకా పెరిగే అవకాశమున్నది.


ప్రతిపక్షాలకు చెంపపెట్టు

తెలంగాణ అప్పల ఊబిలో కూరుకుపోతున్నదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదంటూ వీలు దొరికినప్పుడల్లా గొంతుచించుకునే కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రప్రభుత్వం ఇచ్చిన సమాధానం చెంపపెట్టులా మారింది. తెలంగాణ రెవెన్యూ లోటులేకుండా ఆర్థికంగా స్వయంసమృద్ధిని సాధిస్తున్నదని, 2014-15 ఆర్థిక సంవత్సరం మొదలుకుని 2018-19 వరకు తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నదని కేంద్రం మరోసారి స్పష్టంచేయడంతో ప్రతిపక్షాల నోరుమూసినట్టయింది. 2014-15 నుంచి ఇప్పటివరకు తెలంగాణ తీసుకున్న అప్పులు 14వ ఆర్థికసంఘం సిఫారసు చేసిన నిబంధనల పరిమితులకు లోబడే ఉన్నాయంటూ ఇదివరకే ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. పైగా, తెలంగాణ రూపొందించుకున్న మధ్యకాలిక ప్రణాళికకు అనుకూలంగా ఉన్నదంటూ వెల్లడించారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ నిధులను మంజూరుచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఆయా శాఖలవారీగా యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను ఇస్తున్నదని పేర్కొన్నారు.కాగా, రాష్ర్టానికి ఉన్న ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని 3 నుంచి 3.5కు పెంచుతూ కేంద్ర ఆర్థికశాఖ అధికారికంగా ఉత్తర్వులను జారీచేసింది. రాష్ట్రం సాధిస్తున్న స్థిరమైన ఆర్థికవృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నది.logo