శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 30, 2020 , 03:23:01

పంటల రుణ పరిమితి పెంపు

పంటల రుణ పరిమితి పెంపు
  • తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ నిర్ణయం
  • డ్రాగన్‌ ఫ్రూట్‌కు ఎకరానికి రూ.4.25 లక్షలు
  • పసుపు ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.68 వేలు
  • వరి ఎకరానికి రూ.34 వేల నుంచి రూ.38 వేలు
  • పత్తి ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేలు
  • ఆర్గానిక్‌ పంటల ప్రోత్సాహానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వివిధ పంటలకు రుణపరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) పెరిగింది. దాదాపు 120 రకాల పంటలకు 2020-21 ఆర్థిక ఏడాదిలో ఎంతెంత రుణం ఇవ్వాలన్నదానిపై తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) భారీ కసరత్తుచేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణాన్ని నిర్ధారించింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ)కి పంపించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కొన్ని పంటలకు మాత్రమే రుణ పరిమితి పెరిగింది. 


రాష్ట్రంలో సాగయ్యే వరి విత్తనోత్పత్తికి, శ్రీవరి, కంది, శనగ, పెసర, మినుము, ఆయిల్‌పాం, టమాట, వంకాయ మొదలైన పంటలకు రుణ పరిమితిని పెంచారు. వరి విత్తనోత్పత్తికి రుణపరిమితిని ఎకరాకు రూ.42 వేల నుంచి రూ.45 వేల మధ్య, శ్రీవరికి రూ.36 వేలకు పెంచుతూ టెస్కాబ్‌ నిర్ణయం తీసుకున్నది. ఈసారి కొత్తగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు ఎకరానికి రూ.4.25 లక్షల రుణపరిమితి ఖరారుచేసింది. అత్యంత ఎక్కువగా ఈ పం టను సాగుచేసే రైతులకు గరిష్ఠంగా బ్యాంకులు రుణం ఇవ్వాల్సి ఉం టుంది. 


ఇక సేంద్రియ కూరగాయల సాగుకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేల మధ్య, సాగునీటి వసతి ఉన్న టమాట ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.45 వేల మధ్య ఇవ్వాలని నిర్ణయించారు. గత ఏడాది టమాటకు రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఇచ్చారు. వంకాయ (విత్‌ మల్చింగ్‌కు) ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.45 వేల మధ్య, ఆయిల్‌పాంకు రూ.35 వేల నుంచి రూ.38 వేల మధ్య, మినుములు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, పెసర రూ.13 వేల నుంచి రూ.16 వేలు, శనగకు రూ.20 వేల నుంచి రూ.22 వేల మధ్య పరిమితి విధించింది. 


సేంద్రి య సాగు కూరగాయలు సహా కంది, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వే మధ్య పరిమితి ఖరారుచేసింది. రూఫ్‌ గార్డెన్‌ కు మొదటిసారి రూ. 9వేల నుంచి రూ.10 వేలు మధ్య, రెండోదశలో రూ.18 వేల నుంచి రూ.20 వేలు, మూడోదశలో రూ.27 వేల నుంచి రూ.30 వేల మధ్య ఇవ్వాలని నిర్ణయించింది. విత్తనరహిత ద్రాక్షకు ఇప్పటివరకు ఉన్న పరిమితిని మార్చలేదు.


logo