మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:56:14

పది పరీక్షలు వాయిదా

పది పరీక్షలు వాయిదా

  • సీఎంతో సంప్రదించి తదుపరి నిర్ణయం
  • విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటన
  • జీహెచ్‌ఎంసీలో పరీక్షల నిర్వహణకు నో 
  • మిగతా చోట్ల అనుమతించిన హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సోమవారంనుంచి ప్రారంభం కావాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదావేసింది. పరీక్షల వాయిదా నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రమంతా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. పదో తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై త్వరలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని శనివారం ఉదయం తీర్పు చెప్పింది. దీంతో రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహించడంపై రాష్ట్ర విద్యాశాఖ విముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితాలు విడుదల చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.

సాంకేతికంగా ఇబ్బందులు

పరీక్షలకు రెండుమార్లు ఏర్పాటుచేయడం, రెండుసార్లు స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం, జిల్లాల్లో, హైదరాబాద్‌లో వేర్వేరుగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధపడటం వంటి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని విద్యాశాఖ భావించింది. ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ ప్రవేశాలకు గందరగోళం తలెత్తుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కంటే వాయిదా వేయటమే మంచిదని విద్యాశాఖ అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. ఈ నెల 20 నుంచి జరిగే డిగ్రీ ఫైన లీయర్‌ పరీక్షలు, జూలైలో జరిగే ఎంసెట్‌ తది తర ప్రవేశపరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొ న్నది. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. పరీక్షలు రద్దుచేసి ఇంటర్నల్‌ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌ (ఫలితాలు) ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరిశేఖర్‌రావు సూచించారు. పరీక్షల వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పీఆర్‌టీయూటీఎస్‌ నేతలు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు చెప్పారు. 

గ్రేటర్‌ మినహా నిర్వహించుకోవచ్చు: హైకోర్టు

హైదరాబాద్‌, దాని పరిసరాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిని మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు ఆదేశించింది. పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషన్లపై శనివారం విచారణను కొనసాగించిన చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో రిస్కు తీసుకోలేమని, ప్రతి విద్యార్థి ప్రాణం అత్యంత విలువైనదని వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా వేసి, ఇతర ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చని తెలిపింది. 

జీహెచ్‌ఎంసీలోని విద్యార్థులకు సప్లిమెంటరీలో అవకాశం కల్పించాలని తెలిపింది. సప్లిమెంటరీలో పరీక్షలు రాసిన విద్యార్థులకు రెగ్యులర్‌ విద్యార్థుల తరహాలో మెమోలు ఇవ్వాలని స్పస్టంచేసింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డిలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. అక్కడ కూడా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నందున నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇది ఒక సంక్షోభ సమయమని, ఎవరైనా విద్యార్థి కరోనా వైరస్‌ బారినపడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

పరీక్షలు జరిగే జిల్లాల్లో కూడా వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఒకవేళ ఏదైనా ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయని గుర్తిస్తే.. అక్కడ పరీక్షలను వాయిదా వేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు కూడా రెగ్యులర్‌ మెమో జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించడాన్ని హైకోర్టు అభినందించింది. పంజాబ్‌ తరహాలో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వవచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. పక్కనున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కూడా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపాయని చెప్పారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమని, తదుపరి చదువులకు వెళ్లేందుకు, ఉపాధి అవకాశాలకు పదో తరగతి మార్కుల శాతానికి ప్రాధాన్యం ఉంటుందని ఏజీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పదో తరగతి తర్వాత ఉపాధి అవకాశాలను వెతుక్కుంటారని, వారికి పదో తరగతి మార్కులు చాలా కీలకమని వెల్లడించారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.


logo