సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:39:25

విత్తనోత్పత్తి లక్ష్యం 4 లక్షల క్వింటాళ్లు

విత్తనోత్పత్తి లక్ష్యం 4 లక్షల క్వింటాళ్లు

  • తెలంగాణ సోనా సాగుపై రైతును చైతన్యపర్చాలి 
  • సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ వానకాలంలో 4 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని ఉద్యాన శిక్షణాకేంద్రంలో వానకాలం సాగుకు విత్తనాల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగుకు సరిపడా విత్తనాలను సిద్ధం చేయాలని, రైతులు విత్తనాల కోసం వేచిఉండే పరిస్థితి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

విత్తనాలు ఎక్కడెక్కడ అందుబాటులో పెట్టింది క్లస్టర్ల వారీగా ప్రతిరోజూ వివరాలు నమోదుచేయాలని సూచించారు. సన్నాలలో తెలంగాణ సోనా సాగుపై రైతులను చైతన్యపర్చాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు పాల్గొన్నారు.

 ఆయిల్‌పాం విస్తరణకు ప్రోత్సాహం 

రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంపును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆయిల్‌పాం సాగును నూతన ప్రాంతాలకు విస్తరించడంపై అవసరమైన ప్రతిపాదనలను  సిద్ధంచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీ నిర్మల, ఉద్యానశాఖ కమిషనర్‌ ఎల్‌ వెంకట్రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


logo