గురువారం 02 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 16:45:48

తెలంగాణను హరితహారంలో అగ్రగామిగా నిలుపాలి

తెలంగాణను హరితహారంలో అగ్రగామిగా నిలుపాలి

రాజన్న సిరిసిల్ల : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, తెలంగాణను అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. హరితహారంలో భారీ ఎత్తున మొక్కలను నాటేందుకు కోదండరాం, పొట్టిగుట్ట, పెద్ద గుట్టలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి, వ్యవసాయ రంగంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను, హరితహారంలోనూ అగ్రభాగాన నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల జిల్లాలోని వీర్ పల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట మండలాల్లో అడవులు పెద్ద ఎత్తున ఉండేవన్నారు. కాలక్రమంలో అడవులు అంతరించి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి అడవులకు పునర్జీవం పోయడానికి సీఎం కేసీఆర్‌ హరిత యజ్ఞాన్ని చేపట్టారన్నారు. 

మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని ప్రతి పల్లే పచ్చదనం సంతరించుకునేలా మొక్కలు నాటాలని కోరారు. ఈ వర్షాకాలంలో భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు నాగారం గుట్టలను పరిశీలించినట్లు చెప్పారు. 


logo