శుక్రవారం 10 జూలై 2020
Telangana - May 30, 2020 , 02:09:31

మరో 169 మందికి పాజిటివ్‌

మరో 169 మందికి పాజిటివ్‌

    • -వీరిలో తెలంగాణవారు 100 మంది
  • -దేశవిదేశాలనుంచి వచ్చినవారు 69 మంది
  • -నలుగురి మృతి.. 36 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొద్ది రోజులుగా హైదరాబాద్‌, పరిసర జిల్లాలను కరోనా కలవర పెడుతున్నది. తెలంగాణలో మార్చి 2న మొదటిసారి పాజిటివ్‌ కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఒ్కరోజు 169 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో తెలంగాణవారు 100 మంది (జీహెచ్‌ఎంసీలో 82, రంగారెడ్డి 14, మెదక్‌ 2, సంగారెడ్డి 2) ఉండగా, ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లివచ్చివారు ఐదుగురు, విదేశాల నుంచి వచ్చినవారిలో 64 మంది ఉన్నారు. ఈ నెల 14న మరణాల సంఖ్య 34 ఉండగా, ప్రస్తుతం 71కి చేరింది. శుక్రవారం మృతి చెందిన నలుగురిలో కరోనాతోపాటు కార్సినోమా థైరాయిడ్‌తో బాధపడుతున్న 52 ఏండ్ల వ్యక్తి ఒకరు, మల్టీపుల్‌ మైలోమాతో బాధపడుతున్న 59 ఏండ్ల వ్యక్తి, హెమిప్లెజియాతో బాధపడుతున్న 62 ఏండ్ల వ్యక్తి,  హైపర్‌టెన్షన్‌, కొమొర్బిడిటీలతో బాధపడుతున్న 60 ఏండ్ల మహిళ ఉన్నట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. కాగా, సంగారెడ్డి జిల్లా హత్నూరకు చెందిన పసిపాపను (7 నెలలు) ఈ నెల 27న హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానకు తీసుకెళ్లారు. కొన్నిగంటల్లో చిన్నారి మృతిచెందింది. పాపనుంచి సేకరించిన నమూనాలను ఈ నెల 28న  పరీక్షించగా పాసిటివ్‌ అని తేలింది. దీంతో అధికారులు శుక్రవారం గ్రామానిచేరుకొని కుటుంబీకులతోపాటు పాపను ముట్టుకున్న మరికొంతమందిని క్వారంటైన్‌కు తరలించారు. కరీంనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు (80) మహారాష్ట్రలోని షోలాపూర్‌ వెళ్లింది. శుక్రవారం ఇంటికి చేరుకోవటంతో కరోనా భయంతో కొడుకు తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వచ్చి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, కరోనా లేదన్న తర్వాతనే ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా ఉన్న గదిలో ఉంచారు. 

నేటి నుంచి హైదరాబాద్‌లో ఐసీఎమ్మార్‌ సర్వే 

 క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌)బృందాలు శనివారం నుంచి హైదరాబాద్‌ సర్వే చేపట్టనున్నాయి. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో రెండు రోజులపాటు సర్వే నిర్వహించనున్నారు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో చేపట్టే ఈ సర్వేలో ఐసీఎమ్మార్‌, ఎన్‌ఐఎన్‌ బృందాలు పాల్గొననున్నాయి.


logo