బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:36

ధాన్యరాశుల తెలంగాణ

ధాన్యరాశుల తెలంగాణ

  • వరి ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానం.. పంజాబ్‌ మొదటిస్థానం 
  • ప్రకటించిన ఎఫ్‌సీఐ  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ సత్తా చాటింది. అనతికాలంలోనే దేశానికి అన్నం పెట్టేస్థాయికి ఎదిగింది. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) చెప్పిన మాట ఇది. 2019-20లో దేశంలో ఎఫ్‌సీఐ ధాన్యం ఎక్కువగా కొనుగోలుచేసిన రాష్ర్టాల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉన్నది. గత ఏడాది వానకాలం(46 లక్షల టన్నులు), యాసంగి(65 లక్షల టన్నులు) కలిపి 1.11 కోట్ల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ నుంచి కొనుగోలుచేసినట్టు పేర్కొన్నది. 1.62 కోట్ల టన్నులతో పంజాబ్‌ మొదటిస్థానంలో నిలువగా, 79.37 లక్షల టన్నులతో ఏపీ మూడోస్థానంలో నిలిచింది. 2019-20 ఏడాదికి దేశవ్యాప్తంగా 7.51 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఎఫ్‌సీఐ తెలిపింది. 

పంజాబ్‌, తెలంగాణ రెండు రాష్ర్టాలవాటానే 36.35 శాతం. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితానికి ధాన్యరాశులుగా ఎదిగిన తెలంగాణే నిదర్శనం. తెలంగాణ చరిత్రలోనే గతేడాది రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 2014-15లో వానకాలం, యాసంగిలో కలిపి రాష్ట్ర ఫౌరసరఫరాలశాఖ 24 లక్షల టన్నుల ధాన్యాన్ని,   2015-16లో 23.56 లక్షల టన్నులు, 2016-17లో 53.69 లక్షల టన్నులు, 2017-18లో 53.98 లక్షల టన్నులు, 2018-19లో 77.41 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, 2019-20 ఏడాదిలో కొనుగోళ్లు 1.11 కోట్ల టన్నులకు చేరాయి. ఈ ఏడాదిలో ధాన్యం కొనుగోలు సమయంలోనే కరోనా పంజా విసిరింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ రైతులకు భరోసా ఇచ్చారు. 6,408 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి పంట ఉత్పత్తులను సేకరించారు. ఒక్క యాసంగిలోనే రూ.12 వేల కోట్ల విలులైన ధాన్యం కొనుగోలుచేయడం గమనార్హం.


logo