శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:56:56

జన జీవనం ఆరంభం

జన జీవనం ఆరంభం

  • రోడ్డెక్కిన బస్సులు.. 
  • వ్యాపార సంస్థల కార్యకలాపాలు మొదలు
  • గర్భిణులు, పిల్లలు బయటకు రావొద్దు
  • వృద్ధులు, వ్యాధిగ్రస్థులు కూడా..
  • నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అమలు
  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు
  • పని మనుషులకు అనుమతిపై 
  • నివాస సంఘాలదే తుది నిర్ణయం: ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా జనసందడి మళ్లీ మొదలైంది. ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి. ఉదయం ఆరుగంటల నుంచే బస్సు లు వివిధ ప్రాంతాలకు బయల్దేరాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవడంతో వాటిలో వినియోగదారుల సందడి కనిపించింది. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఆటోరిక్షాలు మళ్లీ రోడ్లమీదకు వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూనే ప్రయాణికులను అనునిత్యం అప్రమత్తం చేశారు. మాస్కులు లేకుండా వచ్చిన వారిని అనుమతించలేదు. దుకాణదారులు సైతం లోపలికి వచ్చే వారిని శానిటైజ్‌చేశారు. 

ఈ నెల 31వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాలలో కొన్ని మినహాయింపులు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను మంగళవారం జారీచేసింది. లాక్‌డౌన్‌ సమయంలో గర్భిణులు, పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఇండ్లనుంచి బయటకు రాకూడదని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం విడుదలచేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను ఈ నెల 29నుంచి 31వరకు పొడిగించింది.

ఈ నాలుగో విడుత లాక్‌డౌన్‌లో అనుసరించాల్సిన నిబంధనలను తాజాగా నిర్దేశించింది. పగటిపూట అన్ని కార్యకలాపాలకు అనుమతించిన ప్రభుత్వం రాత్రి సమయంలో కర్ఫ్యూను కొనసాగించనుంది. గతంలో పేర్కొన్న కర్ఫ్యూ నిబంధనలు యథావిధిగా అమలవుతాయని ఉత్తర్వుల్లో తెలిపింది. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలవుతాయని పేర్కొంది. అత్యవసర వైద్యసేవల కోసం మినహా ఎవ్వరూ బయటకురావడానికి వీలులేదని స్పష్టంచేసింది. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నది. రెస్టారెంట్లలో టేక్‌ అవే, హోం డెలీవరీలను అనుమతించనున్నారు.  

బైక్‌పై ఒక్కరే వెళ్లాలనే నిబంధనను సడలించారు. ఈ-కామర్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకాలు, కొనుగోళ్లకు అనుమతినిచ్చారు. పెళ్లికి 50మంది, అంత్యక్రియలలో 20 మంది మాత్రమే పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే భౌతికదూరం పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో దుకాణాలు రోజు విడిచి రోజు తెరిచేందుకు అనుమతించారు. రోస్టర్‌ విధానాన్ని జీహెచ్‌ఎంసీ అమలు చేయనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాలను అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. కొన్ని ప్రత్యేక రైళ్లు మినహా, ఇతర రైళ్లను కూడా అనుమతించబోమని తెలిపింది.


logo