గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:01:21

1.83 లక్షల కోట్ల బడ్జెట్‌

1.83 లక్షల కోట్ల బడ్జెట్‌
  • ప్రగతి పద్దు రూ.1,04,612.62 కోట్లు
  • నిర్వహణ పద్దు రూ.78,301.80 కోట్లు
  • అసెంబ్లీకి సమర్పించిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజాసంక్షేమానికి పెద్దపీటవేస్తూ.. రైతన్నకు మరింత భరోసాను కల్పిస్తూ.. సబ్బండవర్ణాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.1,82,914 కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దేశంలో ఆర్థిక మాంద్యం నీడలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత, ఇతర ప్రతికూల ప్రభావాలతో రాబడులు తగ్గినప్పటికీ.. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. రైతన్నకు ఆపన్న హస్తాన్నందించారు. అదేసమయంలో సాగునీటిరంగానికి నిధులు అధికంగా కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సంతులనాన్ని సాధిస్తూ వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) బడ్జెట్‌ 1,46,492.30 కోట్లుకాగా రానున్న ఏడాదికి ప్రతిపాదించిన బడ్జెట్‌ రూ.36,422 కోట్లు అధికం కావడం విశేషం. సొంత రాబడులు భారీగా పెరుగుతాయని అంచనావేసిన సర్కార్‌.. ఆ మేరకు బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచింది. మొత్తం పద్దులో ప్రగతిపద్దు రూ.1,04,612 కోట్లుగా, నిర్వహణ వ్యయం రూ.78,301.80 కోట్లుగా పేర్కొన్నది. నిర్వహణ ఖర్చులకంటే అభివృద్ధి, సంక్షేమానికి కేటాయింపులు రూ.26,310 వేల కోట్లు అధికంగా ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది రాబడులు రూ.1,82,701.94 కోట్లకు పెరుగుతాయని అంచనావేయగా రెవెన్యూ మిగులును రూ.4,482.12 కోట్లుగా, ద్రవ్యలోటును రూ.33,191.25గా చూపింది. ద్రవ్యలోటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి మొత్తం జీఎస్డీపీలో 3% మేరకే ఉన్నదని ప్రకటించింది. ఈసారి రాష్ట్ర సంపద ప్రస్తుత ధరల వద్ద రూ. 8,61,031కోట్ల నుంచి రూ. 9,69,604 కోట్ల కు పెరుగుతుందని ప్రణాళికావిభాగం లెక్కల్లో తేలింది.


సామాజిక సేవారంగాలకు నిధులు

సామాజిక సేవారంగాలకు నిధుల కేటాయింపును భారీగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.42,197 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని అమాంతంగా రూ. 60,905 కోట్లకు పెంచి ప్రజాసంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని తేల్చిచెప్పింది. ఆసరా వంటి పథకాలకు నిధులను పెంచింది. బీసీ,ఎస్‌సీ, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌ను పెంచింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, కార్మిక సంక్షేమం, గృహనిర్మాణాలకు చాలినన్ని నిధులను కేటాయించింది. మొత్తానికి సామాజిక రంగానికి రూ.60,905.76 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్ట్‌లకు.. అంటే ఎకనామిక్‌ సర్వీసెస్‌కు రూ.43,988.89 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక సాధారణ సర్వీసులు, పరిపాలనకు గతంలో మాదిరిగానే రూ.33,765.07 కోట్లను కేటాయించింది. 


క్లస్టర్‌కు ఒక రైతు వేదిక

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ఐదువేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున   రైతువేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్‌ భగీరథ కారణంగా       రాష్ట్రమంతటా సురక్షితమైన తాగునీరు లభిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. గత ఆరేండ్లలో రాష్ట్రంలో ఒక్కరు కూడా ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడలేదని భారత సహజవనరులు, ఆర్థిక నిర్వహణ ఫౌండేషన్‌ ప్రకటించిందని వెల్లడించారు.      హరితహారం కార్యక్రమంలో భాగంగా           ముమ్మరంగా తాటి, ఈత వనాలను పెంచుతున్నామని తెలిపారు. నీరాను శీతల పానీయంగా అమ్మటంద్వారా గీత కార్మికుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది. కంటివెలుగు తరహాలోనే చెవిముక్కుగొంతు, దంత సంబంధమైన వ్యాధుల నిర్ధారణకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనున్నట్లు హరీశ్‌ తెలిపారు. తెలంగాణలోని ప్రతి పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామని ప్రకటించారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1896 యూనిట్లు కాగా, దేశంలో 1181 యూనిట్లని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజక అభివృద్ధి నిధుల కింద ఒక్కొకరికి రూ.3 కోట్లు కేటాయిస్తు న్నామన్నారు.  


త్వరలోనే టీఎస్‌ బీపాస్‌

ప్రణాళికాబద్ధంగా పట్టణాల విస్తరణ జరగాలన్న లక్ష్యంతో నూతన మున్సిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు.  సులభ పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు టీఎస్‌బీపాస్‌ను ప్రభుత్వం త్వరలోనే అమలుచేయనున్నదని పేర్కొన్నారు. 


33శాతం పచ్చదనం

రాష్ట్రంలో పచ్చదనాన్ని 33శాతానికి పెంచడంకోసం.. తద్వారా వాతావరణ సమతుల్యం కాపాడేందుకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్‌ అన్నారు. మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులకు తప్పనిసరిచేస్తూ చట్టంచేశామని చెప్పారు.   


వరుసగా మిగులును సాధిస్తున్న రాష్ట్రం 

వచ్చే ఆర్థిక సంవత్పరం రాబడులను భారీగా పెంచడానికి పక్కా వ్యూహాన్ని అనుసరించనున్నట్లు ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో రూ.71 వేల కోట్ల వరకు ఉన్న సొంతపన్నుల రాబడిని వచ్చే ఏడాది చివరినాటికి రూ.85 వేల కోట్లకు పెంచడానికి అవసరమైన ప్రణాళికను బడ్జెట్‌లో వెల్లడించింది. 2018-19లో పన్నుల రాబడిలో 14.4% వృద్ధిరేటు నమోదుకాగా ఈ ఆర్థిక సంవత్సరంలో అది కాస్తా 9.7 శాతానికి పడిపోయింది. సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర రాబడులు రూ.71,327.57 కోట్లుగా లెక్కగట్టారు. ఈ సొంత రాబడులను వచ్చే సంవత్సరానికి రూ.85,300 కోట్లకు పెంచుతామని సర్కార్‌ ధీమా వ్యక్తంచేసింది. భూములు, నిరర్థక అస్తుల అమ్మకాలతోపాటు జీఎస్టీ, వ్యాట్‌, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లన్‌ల రాబడులలో లీకేజీని పూర్తిగా అరికట్టి రాబడులను మరింత పెంచుతామని ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థిరాస్తి వ్యాపారం మరింత పుంజుకుని సొంత రాబడులు పెరుగుతాయని అంచనా వేసింది.  ఈ కారణంగానే బడ్జెట్‌ను పెంచినట్లు ప్రకటించింది. పన్నేతర రాబడిని రూ.12 వేల కోట్ల నుంచి 30వేల కోట్లకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. 


కేంద్రంపై ఆశలు లేవు

కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 18,560 కోట్లుగా ఉన్న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఈ నెలాఖరుకు రూ.15,987 కోట్లు మాత్రమే  రావచ్చని అంచనావేశారు. వచ్చే ఆర్థి క సంవత్సరంలో ఇది నామమాత్రంగా పెరిగి రూ.16,726 కోట్లకు పరిమితమవుతుందని లెక్కగట్టారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రెవెన్యూ మిగులు సాధిస్తున్న రాష్ట్రం వచ్చే ఏడాది ఆ మిగులు రూ.4,482 కోట్లుగా ఉండవచ్చని అంచనావేసింది. 2017-18లో రూ. 3,459 కోట్లుగా ఉన్న మిగులు ఈసారి రూ. 100 కోట్లకు తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరం పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి కాబట్టి మిగులు అంచనాను పెంచినట్లు అధికారులు వెల్లడించారు.


నేతల మాటలు

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు

హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, ఆర్థికమంత్రి హరీశ్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కప్రాంతాల అభివృద్ధికోసం దాదాపు రూ.50వేల కోట్లు ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపాంతరం చెందడానికి మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం.  

- బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ నగర మేయర్‌


ఆర్థిక శాస్త్రంలో చెప్పిన గోల్డెన్‌ రూల్‌ ప్రకారం వివిధ సంస్థల నుంచి తెస్తున్న రుణాలన్నింటినీ పెట్టుబడి వ్యయం కోసమే వినియోగిస్తున్నాం. రాజీవ్‌ స్వగృహ తరహాలో నిరర్థక ఆస్తులను పారదర్శకంగా విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


మహిళా వికాసానికి, భద్రతకు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువులకు ప్రతిరోజూ పోషకాహారం అందిస్తున్నది. కేసీఆర్‌ కిట్స్‌తో ఆర్థికసహాయం అందిస్తున్నది. మహిళా సంక్షేమానికి బడ్జెట్‌లో కోట్లు కేటాయించడం హర్షణీయం.

- సారిక, గృహిణి, ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా


logo
>>>>>>