శనివారం 06 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:37:32

దేశానికే అన్నపూర్ణగా..

దేశానికే అన్నపూర్ణగా..

  • బయటి రాష్ర్టాలకు తెలంగాణ బియ్యం
  • లాక్‌డౌన్‌ వేళ.. వరంగల్‌ నుంచి నాలుగు రాష్ర్టాలకు ఎగుమతి 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారి దేశానికే అన్నం పెడుతున్నది. ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఈ గడ్డ.. స్వరాష్ట్రంలో సుజల స్వప్నం సాకారం కావడంతో ఇప్పుడు అన్నపూర్ణగా మా రింది. అన్నార్తుల ఆకలి మంటల్ని తీరుస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. లాక్‌డౌన్‌ సమయంలో ఇక్క డి నుంచి అనేక రాష్ర్టాలకు బియ్యం రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి గత మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నాలుగు రాష్ర్టాలకు 1,79,400 టన్నుల బియ్యం ఎగుమతి కావడమే ఇందుకు నిదర్శనం. 

69 రేక్‌ల బియ్యం ఎగుమతి..

సాధారణంగా ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఒక నెల లో 10 నుంచి 12 రేక్‌లు మాత్రమే ఎగుమతి అవుతాయి. కానీ కరోనా కష్టకాలంలో నాలుగు రాష్ర్టాలకు 69 రేక్‌లు ఎగుమతయ్యాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో ఉన్న బియ్యం నిల్వలు, అక్కడి నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతయ్యే ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 30వరకు ఎఫ్‌సీఐ గోదాముల ద్వారా 73,183 టన్నుల రా రైస్‌, పాత నిల్వలు 1,06,217 టన్నులు కలిపి మొత్తం 1,79,400 టన్నుల బియ్యం కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కాజీపేట ఎఫ్‌సీఐ ప్రధాన గోదాముతోపాటు వరంగల్‌, నెక్కొండ, జనగామ రైల్వే స్టేషన్ల (ఎఫ్‌సీఐ స్టాక్‌ గోదాములున్న రైల్వే స్టేషన్లు) నుంచి ఎగుమతయ్యాయి. అత్యధికంగా తమిళనాడుకు 83,200 టన్నుల బియ్యం తరలివెళ్లడం విశేషం.

కరీంనగర్‌ నుంచి కూడా..

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌లోని రైల్వే స్టేషన్‌ నుంచి కూడా బియ్యాన్ని భారీగా ఎగుమతి చేస్తున్నారు. గత 40 రోజులుగా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ర్టాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. తమిళనాడు, కేరళకు పది గూడ్స్‌ రైళ్లలో సుమారు 2.61 లక్షల టన్నులు ఎగుమతి చేశారు. ఆదివారం 1.82 లక్షల టన్నుల బియ్యాన్ని జంబో గూడ్స్‌లో తరలించారు.

 వరంగల్‌ నుంచి  ఎగుమతైన బియ్యం..

(మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 30వరకు)

రాష్ట్రం
టన్నులు
రేక్‌లు
కర్ణాటక
39,000
15
కేరళ
26,000
10
పశ్చిమ బెంగాల్‌
31,200
12
తమిళనాడు
83,200
32
మొత్తం
1,79,400
69


logo