గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 02:20:21

అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి

అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి
  • తెలంగాణలో ప్రాధాన్య రంగాలకు పెరిగిన ఖర్చులు
  • గత ఐదేండ్లలో భారీగా పెరిగిన కేటాయింపులు
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వృద్ధిరేటు 13.6 శాతం
  • ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధిని సాధించిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం శాసనమండలిలో సభ్యులు రామచంద్రారావు, టీ జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి, రాజేశ్వర్‌రావు, జనార్దన్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, జాఫ్రీ తదితరులు వ్యక్తంచేసిన సందేహాలను మంత్రి హరీశ్‌రావు నివృత్తిచేశారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా గుణాత్మక మార్పు రావాలంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఐదేండ్లలోనే అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ప్రస్తుతం పలు రాష్ర్టాలు ఉద్యోగులకు నిర్ణీత సమయంలో వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని, మరికొన్ని రాష్ర్టాలు సంక్షేమ పథకాల్లో కోతలు విధించాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థికమాంద్యాన్ని అధిగమించి సమగ్ర అభివృద్ధిని సాధించడం గొప్ప విషయమన్నారు.

పేదలకు జీవనభద్రత

రాష్ట్ర ఆదాయం, అన్ని రంగాల్లో వ్యయం పెరుగడంతో పేదలకు జీవనభద్రత లభించిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దేశంలోని వివిధ అభివృద్ధి సూచీల్లో తెలంగాణ తొలి మొదటి  మూడు స్థానాల్లో నిలిచినట్టు నీతిఆయోగ్‌, కేంద్ర ప్రభుత్వ సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తొలి ఏడాది (2014-15లో) రూ.62,306 కోట్లుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ వ్యయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాటికి రూ.1,35,328 కోట్లకు చేరిందని, గత ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు 117 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు పదేండ్లలో రూ.54,052 కోట్లుగా ఉన్న రాష్ట్ర పెట్టుబడి వ్యయం ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగి రూ.2,11,800 కోట్లకు చేరిందన్నారు. 2019-20లో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 13.6 శాతంగా నమోదైందని, 2014-19 మధ్య కాలంలో తెలంగాణ 21.5 శాతం రెవెన్యూ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. వ్యవసాయ, విద్యుత్‌, పారిశ్రామిక తదితర పలు రంగాల్లో తెలంగాణ గత ఐదేండ్లలో సాధించిన వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటుకంటే చాలా అధికంగా ఉన్నదన్నారు.

గత ఐదేండ్లలో పలు రంగాలకు భారీగా కేటాయింపులు

2004 నుంచి 2014 వరకు బడ్జెట్‌లో   వ్యవసాయరంగానికి రూ.8,851 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఐదేండ్లలో రూ.33,125 కోట్లకు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇదేకాలంలో               పశుసంవర్ధక శాఖకు రూ,2,219 కోట్ల నుంచి రూ.9,035 కోట్లకు, సాగునీటిరంగానికి రూ.54,021 కోట్ల నుంచి రూ.1,14,434 కోట్లకు, విద్యుత్‌రంగానికి రూ.13,922 కోట్ల నుంచి రూ.49,872 కోట్లకు, సామాజిక భద్రత పింఛన్లకు రూ.5,550 కోట్ల నుంచి రూ.42,470 కోట్లకు, పరిశ్రమలరంగానికి  రూ.2,352 కోట్ల నుంచి రూ.4, 389 కోట్లకు కేటాయింపులు పెరిగాయన్నారు.

రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోతలు

దేశ రక్షణ, అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి రూ.1,60,072 కోట్లు అధికంగా ఇచ్చిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి హక్కుగా కేంద్రం రూ.20,583 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.15,788 కోట్లే ఇచ్చిందని, దాదాపు రూ.4,595 కోట్లు తగ్గించిందని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోగా రూ.1,435 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిందని, 15వ ఆర్థిక సంఘం చేసిన అంతర్గత సర్దుబాటు కారణంగా రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో రూ.2,384 కోట్లు తగ్గాయని, ఈ నిధుల స్థానంలో గ్రాంటుగా రూ.723 కోట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక సంఘం కేంద్రానికి సూచించిందని ఆయన తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ర్టానికి గ్రామీణాభివృద్ధి పద్దు కింద రూ.313 కోట్లు, పట్టణాభివృద్ధి పద్దు కింద మరో రూ.801 కోట్లు రావాల్సి ఉందన్నారు. అలాగే ఫిబ్రవరి 29 నాటికి కేంద్రం నుంచి తెలంగాణకు జీఎస్టీ కింద రూ.933 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్లు రావల్సి ఉన్నదని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అనంతరం సభ్యులు ద్రవ్యవినిమయ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.


logo
>>>>>>