గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:21

3.53 లక్షలు దాటిన టెస్టులు

3.53 లక్షలు దాటిన టెస్టులు

  • ప్రతి 10 లక్షల మందికి 391 మందికి పరీక్షలు
  • శనివారం 998 మంది డిశ్చార్జి.. 8 మంది మృతి
  • ఒక్కరోజే 1,593 మందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శనివారం నిర్వహించిన 15,654 పరీక్షలను కలుపుకొని ఇప్పటివరకు 3,53,425 టెస్టులుచేసింది. ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, దానికి కంటే ఎక్కువగా 391 పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదలచేసిన సమగ్ర బులెటిన్‌ స్పష్టంచేస్తుంది. రాష్ట్రంలో శనివారం 1,593 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జీహెచ్‌ఎంసీలోనే 641 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, వరంగల్‌ అర్బన్‌లో 131, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 91, సంగారెడ్డిలో 61, కరీంనగర్‌లో 51, నాగర్‌కర్నూల్‌లో 46, మహబూబ్‌నగర్‌లో 38, కామారెడ్డిలో 36, నిజామాబాద్‌లో 32, మహబూబాబాద్‌లో 29, మంచిర్యాల, రాజన్న సిరిసిల్లలలో 27 చొప్పున, సూర్యాపేటలో 22, జనగామ, మెదక్‌, వరంగల్‌ రూరల్‌లలో 21 చొప్పున, ఖమ్మంలో 18, భద్రాద్రి కొత్తగూడెంలో 17, పెద్దపల్లిలో 16, ఆదిలాబాద్‌లో 14, ములుగులో 12, యాదాద్రి భువనగిరిలో 11, వికారాబాద్‌లో 9, నారాయణపేటలో 7, నల్లగొండలో 6, సిద్దిపేట, జోగుళాంబ గద్వాలలో 5, జయశంకర్‌ భూపాలపల్లిలో 3, జగిత్యాలలో 2, నిర్మల్‌, వనపర్తి జిల్లాల్లో ఒక కేసు చొప్పున రికార్డయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 8 మంది మరణించగా, మొత్తం మరణించినవారి సంఖ్య 463కు చేరుకున్నది. 998 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 21 శాతంగా ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా పాజిటివ్‌

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా టెస్టుల్లో పాజిటిగా నిర్ధారణ అయ్యింది. కుటుంబసభ్యులతో కలిసి శనివారం ర్యాపిడ్‌ టెస్ట్‌చేయించుకున్నట్టు మేయర్‌ ఆదివారం తెలిపారు. కుటుంబసభ్యులందరికీ నెగెటివ్‌ వచ్చినట్టు పేర్కొన్నారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైరస్‌ పాజిటివ్‌గా రావడంతో తాను ‘సెల్ఫ్‌ ఐసొలేషన్‌'లో ఉన్నట్టు చెప్పారు. ఐసొలేషన్‌ పీరియడ్‌ పూర్తైన తర్వాత మరోసారి టెస్ట్‌ చేయించుకొని, ప్లాస్మా దానం చేయనున్నట్టు మేయర్‌ ప్రకటించారు.

నేను ఆరోగ్యంగానే ఉన్నా: మంత్రి ఎర్రబెల్లి

ప్రజల ఆశీస్సులతో తాను బాగానే ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, దయచేసి అసత్య ప్రచారాలను ప్రజలెవ రూ నమ్మొద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని కొందరు ప్రచారం చేస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లోనూ వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. తన ఎస్కార్ట్‌, పైలట్‌ వాహనాల్లో పనిచేసే ఆరుగురు గన్‌మెన్లు, మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. వారంతా చికిత్సలు చేయించుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని మంత్రి వివరించారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు


 శనివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,593
54,059  
డిశ్చార్జి అయినవారు   
  998
41,332
మరణాలు  
 8
  463
చికిత్స పొందుతున్నవారు   
  -
12,264


    


logo