గురువారం 09 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:47

15 వేలు దాటిన కేసులు

15 వేలు దాటిన కేసులు

  • తాజాగా 975 మందికి పాజిటివ్‌
  • హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్‌కు పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 975 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 861 మందికి వైరస్‌ సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్‌ మల్కాజిగిరి 20, సంగారెడ్డి 14, కరీంనగర్‌ 10, భద్రాద్రికొత్తగూడెం 8, వరంగల్‌రూరల్‌ 5, వరంగల్‌ అర్బన్‌ 4, మహబూబ్‌నగర్‌ 3, నల్లగొండ, కామారెడ్డి, యాదాద్రిభువనగిరి 2 చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్‌, సిద్దిపేట, జోగుళాంబగద్వాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 1 కేసు చొప్పున వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,394కు చేరింది. చికిత్స పొందుతున్నవారిలో ఆరుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 253కు పెరిగింది. సోమవారం 2,648 నమూనాలను పరీక్షించగా, 1,673 మందికి నెగెటివ్‌గా తేలిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 85,106కు చేరింది. మరోవైపు చికిత్స అనంతరం కోలుకున్న 410 మంది డిశ్చార్జి అయ్యారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళకు జన్మించిన ఒక రోజు మగ శిశువుకు పరీక్షలు నిర్వహించగా వైరస్‌ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

హోంక్వారంటైన్‌లో మహమూద్‌అలీ 

మూడురోజుల కిందట హోంమంత్రి మహమ్మద్‌అలీకి పరీక్షలు నిర్వహించారు. సోమవారం పాజిటివ్‌గా తేలటంతో హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గొంతునొప్పితో బాధపడుతూ పరీక్షలు చేయించుకోగా సోమవారం రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలింది. ఆయన కుటుంబంలో మరో నలుగురికి కూడా వైరస్‌ సోకింది. వీరిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స ఇస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆయన సతీమణి వినోద కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
975
15,394  
డిశ్చార్జి అయినవారు
410
5,582
మరణాలు
6253
చికిత్స పొందుతున్నవారు
-9,559


logo