హైదరాబాద్, సిటీబ్యూరో, అక్టోబరు 2 (నమస్తే తెలంగాణ): వినూత్న ఆవిష్కరణల కోసం స్టార్టప్‌లు ఏర్పాటుచేయడానికి తెలంగాణ దేశంలోనే ఉత్తమమైన రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్నది. టెక్నాలజీ స్టార్టప్‌లే కాకుండా విభిన్న రంగాలు, సామాజిక విభాగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించే అనుకూల వాతావరణం ఇప్పుడు తెలంగాణ సొంతం. ఈ క్రమంలో సరికొత్త ఆలోచనలతో వచ్చే వారికి అండగా నిలిచేలా ఇంక్యుబేటర్లు నెలకొన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీ-హబ్ ఏర్పాటు చేయడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఇక్కడ స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమలు చేస్తోంది. పాలసీలో భాగంగా ప్రభుత్వం కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో, మెడికల్, అగ్రికల్చర్, ఉమెన్, సామాజిక అంశాలల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయించారు. దాని ఫలితమే ఇటీవల గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో తెలంగాణకు ప్రత్యేక స్థానం లభించింది.
స్టార్టప్ జినోమ్, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్‌లు కలిసి ఆసియా మొత్తానికి స్టార్టప్‌లపై నిర్వహించిన సర్వేలో ఐదు విభాగాల్లో తెలంగాణ టాప్ ర్యాంకుల్ని సాధించింది. ఈ సంస్థలు ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్టు(జీఎస్‌ఈఆర్)-2021లో మెరుగైన నైపుణ్యంలో తెలంగాణ టాప్-15 ర్యాంక్‌ల్లో స్థానం సంపాదించగా, ఫండింగ్‌లో టాప్-20 స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆవిష్కరణలు, పనితీరు, ప్రతిభ విభాగాల్లో తెలంగాణ…ఆసియాలోనే టాప్-30లో నిలిచింది. ఒక అంతర్జాతీయ నివేదికలో ప్రత్యేకస్థానం పొందడానికి… తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లకు ఇస్తున్న ప్రాధాన్యత, అమలుచేస్తున్న విధానాలే కారణమయ్యాయి.
ప్రభుత్వం విధానాలు రూపొందించి, అమలుచేయడమే కాదు…వాటిని ప్రజలకు తెలియచేస్తూ, ప్రోత్సహించడం కూడా పెద్ద ఎత్తున స్టార్టప్ ఆవిష్కరణలకు దోహదపడింది. సాంకేతిక, శాస్త్రీయ నైపుణ్యం కలిగినవారు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, కొత్తగా ఉద్యోగాలను స్పష్టించేందుకు స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఎప్పటికప్పుడు చేసే ప్రోత్సాహకర సూచనలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. పలువురు ఈ ప్రోత్సాహం నుంచి స్ఫూర్తిపొంది స్టార్టప్‌లకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్లతో ‘స్టార్టప్స్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల కేటీఆర్ ప్రకటించారు. స్టార్టప్‌లకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా 8,000 కంపెనీలకు మద్దతు అందిస్తామని చెప్పడం ఔత్సాహికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.
స్టార్టప్ ఎకోసిస్టంను హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా స్టార్టప్ తెలంగాణ పేరుతో ప్రభుత్వం కొత్తగా వెబ్సైట్ (https://startup. telangana.gov.in)ను ప్రారంభించింది. పట్నం నుంచి పల్లెటూర్ల దాకా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసి, దానికి ప్రత్యేకంగా అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలా స్టార్టప్‌ల విషయంలో దేశంలో మరే రాష్ట్రం చూపని చొరవ తెలంగాణ చూపిస్తుండడం వల్లే స్టార్టప్‌లు అధికంగా ఇక్కడి నుంచే పుట్టుకు వస్తున్నాయి.