సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 15:59:20

ఆరు వందల ఏండ్ల నాటి శాసనంలో తెలంగాణ పదం

ఆరు వందల ఏండ్ల నాటి శాసనంలో తెలంగాణ పదం

ఆరు వందల సంవత్సరాల క్రితమే తెలంగాణ పదం ప్రావీణ్యంలో ఉంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో ఉన్న శిలా శాసనమే అందుకు నిదర్శనం. బహిమనీ సుల్తాన్ ఫిరోజ్ హయాంలో అంటే క్రీ.శ 1417లో నేటి తెల్లాపూర్ నాటి తెలంగాణపురంలో ఈ శిలా  శాసనాన్ని ఏర్పాటు చేశారు. శిలా శాసనంలో మొత్తం 24 పంక్తులు ఉంటే అందులో 13వ పంక్తిలో తెలంగాణపురం అనే పదం ఉంటుంది. నాటి తెలంగాణపురమే కాలక్రమేణ తెల్లాపూర్ మారింది. బహిమనీ సుల్తాన్ తర్వాత వంద సంవత్సరాలకు అంటే క్రీ.శ 1510లో కాకతీయ రాజు ప్రతాపరుద్ర గజపతికి సంబంధించిన వెలిచర్ల శాసనంలో కూడా ‘తెలంగాణ’ పదాన్ని ప్రస్తావించారు. 

ఆరు వందల ఏండ్ల నాటి చరిత్ర..

ఆరు వందల ఏండ్ల క్రితం తెలంగాణపురంలోని దిగుడు బావి వద్ద ఈ శాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ శాసనంకు ఇరువైపుల రెండు స్థంభాలు ఉంటాయి. దాంతో పాటు అక్కడ వీరభద్రుడి విగ్రహాన్ని కూడా చెక్కించారు. ఈ శాసనాన్ని ఓజురుద్రోజు శిల్పి చెక్కిండు. విశ్వకర్మ కులంలో పుట్టిన మైలోజు కొడుకు పోచోజు విస్తృత కీర్తి ఘటించిన శిల్పి. నాగోజు కొడుకు కొండమీది మల్లోజు అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు, పోచోజు మోటబావిని తవ్వించి వనం చెరువు ఉత్తరాన మామిడి వనం, పూల తోటను ఏర్పాటు చేయించారు. అయితే పోచోజు మనవడు అయిన అయ్యలోజు బహిమనీ సుల్తాన్ ఫిరోజ్ భార్య నూర్ బంగారు ఆభరణాలు, గాజులు, పూసలు చేయించారు. 

బహిమనీ సుల్తాన్ గోల్కొండ నుంచి బీదర్ వెళ్లే క్రమంలో తెలంగాణ పురంలోని మోటబావి, మామిడి వనం వద్ద సేదతీరి, ఏనుగులు, గుర్రాలను ఆ బావి వద్ద కట్టేసి నీళ్లు, మేత వేసేవాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు. క్రీ.శ 1418లో ఫిరోజ్ విజయనగర రెండవ దేవరాయాల ఆధినంలో ఉన్న పానుగల్లు కోటమీదకు యుద్ధానికి వేళ్లేటప్పుడు ఆయన తెలంగాణపురం ‘తెల్లాపూర్’ మీదుగాప్రయాణించారు. తెలంగాణ పురంలోని విశ్వకర్మలు ఫిరోజ్ భార్య నూర్ సుల్తాన్ ఆభరణాలు చేయించడంతో ఆ గుర్తుగా ఆయన ఈ శాసనాన్ని చెక్కించిన్నట్లు శాసనంలో తెలుస్తుంది. కాలక్రమేణ బావి, మామిడి వనాలు పోయినప్పటికీ గత చరిత్రను సూచిస్తు ఈ శాసనం పదిలంగా ఉంది. ఈ శాసనం ప్రాముఖ్యత 1986లో బయటపడింది. అయితే సమైక్యరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సారిగా తెలంగాణ అనే పదాన్ని ఈ శాసనమే వెల్లడిస్తుంది. 

తెలంగాణపురం అని చెప్పుట వలన ఈ శాసనానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శాసనం సహయంతో ఆరు వందల ఏండ్ల నుంచే తెలంగాణ పేరు ప్రావిణ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. బహిమనీ సుల్తాన్ హయాంలోనే తెలంగాణపురం ఉండడం విశేషం. క్రీ.శ 1510లో కాకతీయ రాజు ప్రతాపరుద్ర గజపతికి సంబంధించిన వెలిచర్ల శాసనంలో కూడా తెలంగాణ పదాన్ని ప్రస్తావించిన్నట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. నిపుణత గల శిల్పులు భాష, మత, ప్రాంతీయ భావాలకు అతీతంగా వ్యవహరించేవారని కూడా ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. శాసనం విషయంకు వస్తే ‘తెలంగాణపురం’ శిల్పులు బంగారు గాజుపూసలతో ఆభరణాలు తయారుచేసేవారని తెలుస్తుంది. గత ఆరు వందల ఏండ్లనాటి చరిత్ర కలిగిన శాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. logo