శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:19

అసెంబ్లీలో మంత్రుల సమాధానాలు

అసెంబ్లీలో మంత్రుల సమాధానాలు

33 శాతం అడవే లక్ష్యం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో అటవీ ప్రాంతాన్ని 24% నుంచి 33 శాతానికి పెంచాలన్న సీఎం  కేసీఆర్‌ సం కల్పం మేరకు హరితహారం జోరుగా కొనసాగుతున్నదని అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. బుధవారం శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మం త్రి జవాబిస్తూ.. హరితహారం ద్వారా రాష్ట్రంలో 120 కోట్ల మొక్కలను పెంచే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మొక్కల పెంపకం కోసం ఆరేండ్లలో రూ.4,900 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మొక్కల పెంపకానికి ప్రతి గ్రామంలో ఎకరం భూమి కేటాయించామని మంత్రి వివరించారు.

అన్ని కొత్త పంచాయతీల్లో బీటీ రోడ్లు : మంత్రి ఎర్రబెల్లి 

 రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ అన్ని పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రోడ్ల నిర్మాణాల కోసం కేంద్రం నుంచి రూ.4వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.2,400 కోట్లు మాత్రమే మంజూరైనట్టు వెల్లడించారు. అయినా, 11,200 గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని వివరించారు.

తర్వాతైనా అన్ని పరీక్షలు రాయాల్సిందే : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నందున డిగ్రీ/బీటెక్‌ ఫస్టియర్‌, సె కండియర్‌ విద్యార్థులను పైతరగతులకు  ప్రభుత్వం ప్రమోట్‌చేసిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి  చెప్పారు. బుధవారం సభ్యుల ప్రశ్నలకు బదులిస్తూ.. పైతరగతులకు ప్రమోటైనా తర్వాత రోజుల్లో తప్పకుండా ఆ పరీక్షలు రాయాల్సిందేనని ఆమె స్పష్టంచేశారు. దీనిపై వర్సిటీలు త్వరలోనే కాలేజీలకు సర్క్యులర్‌ జారీ చేస్తాయన్నారు. 

అక్బరుద్దీన్‌ రాద్ధాంతం సరికాదు : మీడియాతో మంత్రి తలసాని

అసెంబ్లీలో బాధ్యత లేకుండా మాట్లాడితే సహించబోమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ సీనియర్‌ సభ్యుడైనంత మాత్రాన ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోబోమని చెప్పారు. కరోనా నోట్‌పై అక్బరుద్దీన్‌ రాద్ధాం తం సరికాదన్నారు. ఆయన అతి తెలివి ప్రదర్శించారని విమర్శించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అపర మేధావిలాగా వ్యవహరిస్తుంటారని, కానీ, ఇచ్చిటైం వాడుకోవడం చేతకాదన్నారు.

రాష్ట్రంలో పత్తికి ఆదరణ : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

 రాష్ట్రం లో పత్తి పంటకు మంచి ఆదరణ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శాసనమండలిలో బుధవారం తెలిపారు. పం టకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు కూడా చేస్తున్నామన్నారు. యాసంగి పంటలపైనా సర్వే చేయిస్తున్నామని, అందుకు కావాల్సిన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద రాష్ట్రం లో లబ్ధిదారులకు 2,123 ట్రాక్టర్లను పంపిణీ చేశామన్నారు.

దెబ్బతిన్న రోడ్లను బాగుచేశాం : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఇటీవలి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి తాత్కాలికంగా మరమ్మతులు చేశామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యేల ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆయన.. వానలతో రాష్ట్రవ్యాప్తంగా 1675.75 కిలోమీటర్ల మేర 664 రోడ్ల భాగాలు దెబ్బతిన్నాయన్నారు. 187 కల్వర్టులు, ఒక వంతెన కూడా పాడైందని వివరించారు. హైవేలకు సంబంధించి 40 భాగాలు దెబ్బతిన్నాయని చెప్పారు. రోడ్ల మరమ్మతులకు మొత్తం రూ.224 కోట్లు అవుతాయని ఆర్‌ఆండ్‌బీ శాఖ అంచనా వేసిందన్నారు. వాటి మరమ్మతులకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ నుంచి నిధులు అందటం లేదన్నారు.

వక్ఫ్‌ ఆస్తులకు జియో ట్యాగింగ్‌ : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, వక్ఫ్‌ ఆస్తులకు జియో ట్యాగింగ్‌ ప్రక్రి య కొనసాగుతున్నదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఎంఐఎం సభాపక్షనేత అక్బరుద్దీన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో డిస్ట్రిక్ట్‌ వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు కేంద్ర సాయాన్ని కోరగా ఐఐటీ-రూర్కీ, సీడబ్ల్యూసీ ద్వారా జియో ట్యాగింగ్‌ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.

బర్త్‌ సర్టిఫికెట్‌ బదులు ఆధార్‌ కరోనాలోనూ కల్యాణలక్ష్మికి 1,100 కోట్లు:గంగుల

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు జనన ధ్రువపత్రం లేకుంటే ఆధార్‌ కార్డులోని తేదీని పరిగణనలోకి తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని చెప్పారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ పథకాల కింద 7,14,575 మంది లబ్ధిదారులకు రూ.5,556.44 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు హరిప్రియ బానోతు, పద్మాదేవేందర్‌రెడ్డి, రవిశంకర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.  

రాష్ట్రంలో అవినీతి తగ్గింది: రాజాసింగ్‌

సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం లో అవినీతి తగ్గిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. రెవెన్యూ చట్టాన్ని సమర్థిస్తున్నానని, దీని ద్వారా అవినీతి తగ్గుతుందని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో కరోనాపై జరిగిన చర్చలో రాజాసింగ్‌ మాట్లాడారు. డాక్టర్లు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బంది, పోలీసులు, వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది బాగా పనిచేశారన్నారు. కరోనా కట్టడికి మంత్రి ఈటల చేసిన కృషిని రాజాసింగ్‌ ప్రశంసించారు. 


logo