సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Apr 17, 2020 , 09:02:50

సమస్యల్లో మహిళలకు సాంత్వన

సమస్యల్లో మహిళలకు సాంత్వన

  • గృహిణులకు పోలీసుల భరోసా
  • కౌన్సెలర్లతో మానసిక ైస్థెర్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలపై గృహహింస కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో మహిళలకు కౌన్సెలర్లతో మానసిక ైస్థెర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గృహహింస, మానసిక ఒత్తిడికి గురవుతున్నామంటూ మార్చి నెలలో డయల్‌ 100కు 10,414 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి బుధవారం వరకు అవే కారణాలపై 1874 మంది మహిళలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మహిళల భద్రతకోసం ఇప్పటికే ఏర్పాటుచేసిన భరోసా కేంద్రాలతోపాటు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి వారికి టెలిఫోన్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు. పరిస్థితి మరీ శ్రుతిమించినట్టు అనిపిస్తే పోలీస్‌ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి చర్యలు తీసుకుంటున్నారు. భర్త, పిల్లలు అందరూ ఇంట్లోనే ఉండటంతో మహిళలపై పనిభారం పెరిగింది. కొందరు భర్తలు ఇంటిపనిలో భార్యలకు సహకరించకపోగా వారిని మరిన్ని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో చాలామంది మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కసారిగా పెరిగిన పనిభారాన్ని, మానసిక ఒత్తిడిని తట్టుకునేలా కౌన్సెలర్లు గృహిణులకు సూచనలు ఇస్తున్నారు. 

ఏ ఇబ్బంది ఉన్నా డయల్‌ 100: స్వాతిలక్రా, ఐజీ, వుమెన్‌సేఫ్టీ వింగ్‌ ఇంచార్జి

మహిళలు మానసికంగా, శారీరకంగా ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. ఏ సమయంలో అయినా డయల్‌ 100 అందుబాటులో ఉంటుంది. ఇంకా మా భరోసా కేంద్రాల్లోని కౌన్సెలర్లు టెలిఫోన్‌ ద్వారా కూడా కౌన్సెలింగ్‌ ఇస్తారు.


ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం: మహేశ్‌భగవత్‌, సీపీ, రాచకొండ 

లాక్‌డౌన్‌ తర్వాత ఏర్పాటుచేసిన కొవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు  మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫోన్‌లు వస్తున్నాయి. వీటిపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. ఒత్తిడిలో ఉన్నవాళ్లు  9490617234 లేదా 040-48214800 నంబర్‌కు ఫోన్‌ చేస్తే మేం  వారిలో ధైర్యం నింపేందుకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు కొందరు ప్రైవేటు కౌన్సెలర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు 


logo