బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 23:31:55

సోషల్‌మీడియా పుకార్లపై నిఘా

సోషల్‌మీడియా పుకార్లపై నిఘా

  • తాజాగా మూడు సుమోటో కేసులు నమోదు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సోషల్‌ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలపై పోస్టింగ్‌లు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి సోషల్‌మీడియాలో వచ్చే పుకార్లు, నకిలీ వార్తలు, ప్రజల్లో భయాందోళనలు, విధ్వంసాలు సృష్టించే పోస్టింగ్‌లపై  హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు.  నకిలీ పోస్టింగ్‌లపై పోలీసులు ఎప్పటికప్పుడు సుమోటోగా కేసులు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బుధవారం మూడు సుమోటో కేసులను నమోదు చేశారు. అందులో ఒకటి ట్విట్టర్‌లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన ఓ వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

 పదో తరగతి పరీక్షలంటూ..

పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి తిరిగి ప్రారంభమై.. ఏప్రిల్‌ 6న ముగుస్తున్నాయంటూ షేర్‌చాట్‌, వాట్సాప్‌ల్లో పోస్టులు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక డాక్యుమెంట్‌ను తయారు చేసి, అది ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగా ... షేర్‌చాట్‌, వాట్సాప్‌లో పోస్టు చేసి సర్క్యూలేట్‌ చేశారు. 

70 వేల మందికి అంటించాలంటూ..

 ఢిల్లీలో నిజాముద్దీన్‌లో తబ్లిక్‌-ఇ-జిమాతేలో చీప్‌ మౌలానా కరోనా వైరస్‌ను 70 వేల మంది ఇండియన్స్‌కు అంటించగలిగితే.. భారత దేశంలో అల్లకల్లోలం జరుగుతుందని, దీంతో ఆర్థిక వ్యవస్థ పతనమై మనం అనుకున్నది సాధించవచ్చంటూ ఆదేశాలిచ్చారని, దీనిపై ఇష్టానుసారంగా పోస్టులను తయారు చేసి వాటిని గుర్తుతెలియని వ్యక్తులు సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా, మతకలహాలను సృష్టించే విధంగా ఉన్న ఈ పోస్టింగ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 


logo