శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:46:05

సూపర్‌ పోలీస్‌

సూపర్‌ పోలీస్‌

పారా హుషార్‌.. రాష్ట్రంలో నేరంచేస్తే శిక్ష తప్పదు. ఏదో ఒకటి చేసి తప్పించు కుందామంటే కుదరదు. బెయిల్‌పై విడుదలైతే చాలు.. బిందాస్‌గా ఉండొచ్చ నుకుంటే సాధ్యంకాదు. రాష్ట్రంలో పోలీస్‌ విచారణ తీరు సమూలంగా మారింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న పోలీస్‌శాఖ నేరం జరిగిన వెంటనే వేగంగా దర్యాప్తు పూర్తిచేస్తున్నది. కోర్టు ముందు దోషులను నిలబెట్టి బాధితులకు న్యాయమందించడంలో తెలంగాణ పోలీసుశాఖ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. గత కొన్నేండ్లలో నేరాల పరిష్కారంలో పోలీసులు చూపిన చొరువతో దోషులకు శిక్షల శాతం గణనీయంగా పెరిగింది.

  • నేరంచేసి దొరికారో.. శిక్ష తప్పదు
  • పక్కా దర్యాప్తుతో పెరుగుతున్న శిక్షల సంఖ్య
  • సాంకేతికత సాయంతో కీలక సాక్ష్యాల సేకరణ
  • గతేడాది 2,074 కేసుల్లో శిక్షలు ఖరారు
  • కోర్టు వర్టికల్‌ విధానంతో చేకూరుతున్న మేలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వపరంగా అందుతున్న మౌలిక సదుపాయాలు.. అందిపుచ్చుకొన్న సాంకేతికత.. అన్నింటా ఉన్నతాధికారుల ప్రోత్సాహం.. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు దర్యాప్తు పక్కాగా, వేగంగా సాగుతున్నది. ఎలాంటి తప్పు చేసినా తెలంగాణ పోలీసుల కండ్ల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అన్న సందేశాన్ని పంపేలా శాస్త్రీయ పద్ధతిలో కేసుల దర్యాప్తు చేపడుతూ.. ఎక్కువ కేసుల్లో శిక్షలు పడేలా చేస్తున్నారు. గతేడాదిలో తెలంగాణ పోలీసుల పకడ్బందీ దర్యాప్తును పరిశీలిస్తే.. దర్యాప్తులో శాస్త్రీయ విధానం, వేగం ఎలా ఉన్న దో అర్థమవుతుంది. గత ఏడాది మొత్తం 2,074 మందికి శిక్షలు ఖరారు కాగా, వీరిలో 140 మందికి యావజ్జీవశిక్షలు పడటం గమనార్హం. అత్యధికంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 16 మందికి యావజ్జీవశిక్ష విధిస్తూ తీర్పులు వచ్చాయి. తాజాగా గత జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కలిపి 125 మంది నిందితులకు శిక్ష పడింది. ఇందులో తొమ్మిది మందికి జీవితఖైదు పడింది. ఫిబ్రవరి నెలలో 101 మందికి శిక్షపడగా.. ఇందులో ఆరుగురికి యావజ్జీవశిక్షలు ఉన్నాయి. 


ఫలిస్తున్న పని విభజన విధానం

పోలీసుల విధులను విభజిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి నూతనంగా అంశాలవారీగా పని విభజన (వర్టికల్స్‌ విధానం) అమల్లోకి తెచ్చారు. దీనిలో భాగంగా ఏర్పాటుచేసిన కోర్టు వర్టికల్‌తో మరింత పర్యవేక్షణ పెరిగి సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రతి స్టేషన్‌ పరిధిలో కోర్టు కానిస్టేబుల్‌ను ఒక వర్టికల్‌గా విభజించి.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాచులుగా డీజీపీ కార్యాలయంలోని లెర్నింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇచ్చారు. ఒక కేసు కోర్టు ట్రయల్‌కు సంబంధించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి. సాక్ష్యాలతో మనోధైర్యాన్ని నింపుతూ, తుది తీర్పు వచ్చేవరకు మాట మార్చకుండా, నిజాయితీగా సాక్ష్యం చెప్పేలా తీసుకోవాల్సిన చర్యలు, కేసుల నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు కోర్టు అంశాలను వివరించడం.. ఇలా కోర్టు కానిస్టేబుల్‌ విధులన్నింటిపైనా స్పష్టత ఇచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టు కానిస్టేబుల్‌ మధ్య సమన్వయం పెరిగేలా చర్యలు తీసుకొన్నారు. దాంతో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తుండటంతో సిబ్బంది మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరిగింది. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో శక్తివంచన లేకుండా కష్టపడిన సిబ్బందికి కానిస్టేబుల్‌ నుంచి యూనిట్‌ అధికారి వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. 


సాంకేతికతతో పక్కాగా ఆధారాల సేకరణ 

కోర్టులో నేరం నిరూపించాలంటే ప్రధానంగా సాక్షాలు పక్కాగా ఉండాలి. నిందితుడు నేరం చేశాడు అనడానికి తగిన శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణలో తెలంగాణ పోలీసులు చూపుతున్న పనితీరుతోనూ నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవల సంచలనంగా మారిన హాజీపూర్‌ సైకోకిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత లైంగికదాడి, హత్య కేసు రికార్డు సమయంలోనే దర్యాప్తు పూర్తిచేశారు. పలు శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించి తెలంగాణ పోలీసుల సామర్ధ్యం ఏమిటో నిరూపించారు. దీంతో రెండు కేసుల్లో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. అత్తాపూర్‌లో సంచలనంగా మారిన హత్య కేసులోనూ రెండురోజుల క్రితమే ముగ్గురు నిందితులకు జీవితఖైదు పడింది. 


వర్టికల్‌ విధానంలో తొలి ఫలితాలివి 

పోలీస్‌ సిబ్బంది రోజువారీ పనులను విభజిస్తూ తీసుకొచ్చిన వర్టికల్‌ విధానంలో వస్తున్న తొలి ఫలితాలు ఇవి. నిందితులకు శిక్షపడేలా శ్రమిస్తున్న కోర్టు వర్టికల్‌ సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, శభాష్‌ అంటూ మెచ్చుకోవడం ద్వారా వారిలో సానుకూల ధృక్పథం పెరిగింది. దీంతో చాలా వరకు కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. 

- ఎం మహేందర్‌రెడ్డి, డీజీపీ, తెలంగాణ


నిరంతర ఫాలోఅప్‌తో శిక్షల ఖరారు 

హాజీపూర్‌లో వరుస హత్యల కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును ముమ్మరంగా చేపట్టాం. పూర్తిస్థాయిలో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం. ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేయడం, రికార్డు సమయంలో ఆధారాలు కోర్టు ముందుంచడంతో నేరస్థుడికి శిక్ష ఖరారైంది. ప్రజల్లో తెలంగాణ పోలీసులపై నమ్మకం పెరిగింది. 

- భగవత్‌, పోలీస్‌ కమిషనర్‌, రాచకొండగతేడాదిలో పలు కేసుల్లో విధించిన శిక్షలు

శిక్షకాలం
నేరస్థులు
0-3 ఏండ్లు
1749
4-7 ఏండ్లు
124
ఏడేండ్లు, ఆపైన
61
యావజ్జీవ ఖైదు
140
మొత్తం నేరస్థుల సంఖ్య 
2074125
తాజాగా జనవరి నెలలో శిక్ష పడిన వారి సంఖ్య. ఇందులో తొమ్మిది మందికి జీవితఖైదు.logo