e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ భయం వద్దు.. మేమొచ్చేస్తున్నాం!

భయం వద్దు.. మేమొచ్చేస్తున్నాం!

  • బాధితులకు గస్తీ పోలీసుల భరోసా
  • ఎంతసేపట్లో చేరుకుంటారో తెలియజేస్తూ ఎస్‌ఎంఎస్‌
  • బాధితులు-కంట్రోల్‌రూం-గస్తీ పోలీసుల మధ్య కనెక్షన్‌
  • టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసుల ముందడుగు
భయం వద్దు.. మేమొచ్చేస్తున్నాం!

‘శ్రావణి.. ప్రైవేటు ఉద్యోగిని, ఆఫీస్‌ చీకట్లో ఇంటికి వెళుతుండగా.. కొందరు ఆకతాయిలు ఆమెను వెంబడించారు. వెంటనే ఆమె 100కు డయల్‌ చేసి సమాచారం ఇచ్చింది. క్షణాల్లో స్థానిక పోలీసుల ద్వారా గస్తీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. తమ వాహనాన్ని శ్రావణి ఉన్నవైపు మళ్లించి.. కంట్రోల్‌ రూం సాయంతో ఆమెకు ఫోన్‌చేశారు.‘ఏం భయం లేదు.. మేము వచ్చేస్తున్నాం.. మీరు ధైర్యంగా ఉండండి’ అంటూ భరోసానిచ్చారు. 

‘సుధీర్‌.. భార్య, పిల్లలతో చీకట్లో ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 100కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. లొకేషన్‌ బేస్డ్‌ సర్వీస్‌(ఎల్‌బీఎస్‌) ద్వారా సుధీర్‌ ఎక్కడ ఉన్న ప్రదేశాన్ని కనుక్కొని పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. జీపీఎస్‌ మ్యాప్‌ ద్వారా నిమిషాల్లోనే స్పాట్‌కు చేరిన పోలీసులు. బాధితులను దవాఖానలో చేర్పించి, వారి ప్రాణాలు కాపాడారు. 

హైదరాబాద్‌, మార్చి 14, (నమస్తే తెలంగాణ): అనుకోని ఆపదలో చిక్కుకున్న వారికి పోలీసులు తమను కాపాడేందుకు వస్తున్నారన్న భరోసా లభిస్తే.. వారు తామున్న పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు లేదా తట్టుకొనేందుకు సిద్ధపడుతారు. తెలంగాణ పోలీసులు బాధితులకు ఆ భరోసా కల్పించేందుకు సాంకేతిక వినియోగంలో మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకే పరిమితమైన సాంకేతిక సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్‌ సిబ్బందికి ఇప్పటికే ట్యాబ్‌లు ఇచ్చారు. టీఎస్‌కాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే అన్ని పోలీసు సేవలు నిర్వహించే వీలు కల్పించారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్టు 100కు కాల్‌ వచ్చిన వెంటనే ఆయా పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇస్తున్నారు. ఆ తరువాత పోలీసులు ఎంత సమయంలో చేరబోతున్నారో తెలుపుతూ బాధితులకు ఎస్‌ఎంఎస్‌ పంపుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో పెట్రోకార్లకు, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వాహనాలకు జీపీఎస్‌ సదుపాయం ఉంది. జీపీఎస్‌ మ్యాప్‌ ఆధారంగా ఎల్బీఎస్‌ ద్వారా బాధితులను క్షణాల్లో చేరుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లోని పోలీస్‌ వాహనాలకు కూడా జీపీఎస్‌ సదుపాయం కల్పించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పెట్రోకార్లకు పర్మినెంట్‌గా ఒక ఫోన్‌ను కేటాయించనున్నారు. సిబ్బంది మారినా.. ఒకే ఫోన్‌ నంబర్‌ ఉండడంతో అత్యవసరాల్లో క్షణం కూడా వృథాకాకుండా విధులు నిర్వర్తించే వీలు కలుగుతుంది. అన్ని పోలీస్‌ వాహనాలకు జీపీఎస్‌ సదుపాయం కల్పించడం పూర్తయిన తర్వాత నేరుగా బాధితులకు సైతం ఎస్‌ఎంఎస్‌ లింక్‌ ద్వారా పోలీసుల లైవ్‌ లొకేషన్‌ను షేరే చేసే వ్యవస్థను తెచ్చేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఊబర్‌, ఓలా మాదిరిగా మనకు ఎంత దూరంలో పోలీసులు ఉన్నారు.. ఎక్కడి వరకు చేరుకున్నారు.. ఇంకా ఎంత సమయం పట్టొచ్చు.. ఇలా అన్ని వివరాలు బాధితుడు తన స్మార్ట్‌ఫోన్‌లో చూడగలిగే సదుపాయాన్ని కల్పించే యోచనలో ఉన్నట్టు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భయం వద్దు.. మేమొచ్చేస్తున్నాం!

ట్రెండింగ్‌

Advertisement