గురువారం 09 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:03:08

నకిలీ విత్తనాలపై కొరడా

నకిలీ విత్తనాలపై కొరడా

  • రాష్ట్రంలో పలుచోట్ల విస్తృత తనిఖీలు
  • రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.50 లక్షల పత్తివిత్తనాలు స్వాధీనం
  • ఖమ్మం జిల్లాలో నిల్వ ఉంచిన జీలుగ విత్తనాల పట్టివేత

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/కొణిజర్ల: నకిలీ విత్తనాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మరో వైపు అక్రంమంగా నిల్వ ఉంచిన రాయితీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నకిలీ పత్తి విత్తనాలను బ్రాండెడ్‌ కంపెనీల పేరిట ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను రాచకొండ ఎస్‌వోటీ, హయత్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 లక్షల విలువ చేసే నకిలీ పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామంలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ జీలుగ విత్తనాలను వేరే సంచుల్లోకి మారుస్తుండగా వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భాగవత్‌ కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు నంద్యాలకు చెందిన పాత్లావత్‌ కృష్ణానాయక్‌, పుట్ట వెంకటరమణ పరిచయమయ్యారు. ముగ్గురు కలిసి నకిలీ విత్తనాల తయారీకి పథకాన్ని రూపొందించారు. వెంకటేశ్వర్లు నకిలీ విత్తనాల తయారీతోపాటు ఇతర వ్యవహరాలు చూసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. హయత్‌నగర్‌ సమీపంలోని బ్రాహ్మణపల్లిలో స్థానికుడైన నోముల వెంకన్న సహాయంతో గోదాము ఏర్పాటు చేసుకున్నారు. 

వెంకటరమణ, కృష్ణ నాయక్‌ నాసిరకం విత్తనాలు తెచ్చి ఎరుపు రంగుతోపాటు ఇతర రసాయనాలను కలిపి అసలు విత్తనాలను తలపించేలా తయారు చేసి బిల్లా, పావని, సర్పంచ్‌ గోల్డ్‌ లేబుల్స్‌తో ప్యాకింగ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం వీటి ధర 450 గ్రాములకు రూ. 730 ఉండగా వీళ్లు రూ. 500కే అమ్ముతూ మోసం చేస్తున్నారు. వీటిని విక్రయించేందుకు అశోక్‌ అనే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకున్నారు. వీటిని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతోపాటు షాద్‌నగర్‌లోనూ విక్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్రాహ్మణపల్లిలోని గోదాంపై దాడి చేసి రూ. 50 లక్షల విలువ చేసే నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

సబ్సిడీ జీలుగ విత్తనాల పట్టివేత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారంలో వంద సంచుల  అక్రమంగా నిల్వ ఉంచిన సబ్సిడీ జీలుగ విత్తనాలను స్థానిక ఏవో బాలాజీ, ఏఈవో ఆయేషా పట్టుకున్నారు. అధికారుల రాకను గమనించిన నిందితుడు పారిపోయాడు.  పట్టుబడిన సబ్సిడీ విత్తనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


logo