ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 07:34:38

సలాం పోలీస్‌భాయ్‌... అన్నార్తులకు అమోఘ సేవలు

సలాం పోలీస్‌భాయ్‌... అన్నార్తులకు  అమోఘ సేవలు

  • విసుగు లేదు.. విరామం లేదు..! 
  • 24 గంటలు నిరుపమానంగా సేవలు
  • అత్యవసరాల్లో అందరికీ అండ.. కరోనాపై యుద్ధంలో సాటిలేని పటిమ
  • అభాగ్యుల పాలిట ఆపన్నహస్తం.. సమాజానికి సురక్షాకవచం
  • అవిశ్రాంతంగా విధుల నిర్వహణ
  • లాక్‌డౌన్‌ అమలుకు కృషి
  • అన్నార్తులకు  అమోఘ సేవలు
  • పోలీస్‌ సేవలపై సర్వత్రా హర్షం
  • వారి కుటుంబాలు అందిస్తున్న సహకారానికి జేజేలు

ఓ పక్క  భగభగ మండుతున్న సూర్యుడు.. మరోపక్క తమను అడ్డుకొంటున్నారని మండిపడే ప్రజలు.. రెండింటినీ భరించాలి. అందరినీ సమన్వయపరచుకోవాలి. సంజాయించాలి. కోపం తెచ్చుకోవద్దు.. అదే సమయంలో శాంతిభద్రతలనూ కాపాడాలి. అందర్నీ సామాజిక దూరం పాటించాలని చెప్పాలి. తమకు మాత్రం ఆ సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదు. ఎవరూ ఇండ్లనుంచి బయటకు రాకుండా నియంత్రించాలి.  తామేమో 24 గంటలు ఇండ్ల బయటే ఉండాలి. గంటలకొద్దీ నడిరోడ్డుపైనే నిల్చోవాలి. ఎప్పుడు తింటారో తెలియదు. విశ్రాంతికి సమయం చిక్కదు. కంటిమీద కునుకుండదు.. అయినా అలుపనేది ఎరుగకుండా కనిపించని భయానక శత్రువునుంచి యావత్‌ తెలంగాణ జాతిని రక్షించడానికి లాఠీ పట్టుకొని విధులు నిర్వహించే సైనికులు వారు. సర్వదా మన క్షేమంకోసం.. మన ఆరోగ్యంకోసం.. రాష్ట్ర సంక్షేమంకోసం నిరంతరం పాటుపడుతున్న పోలీసులు వారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కంటికి కునుకులేదు.. ఒంటికి విశ్రాంతిలేదు.. వేళకు తిండిలేదు.. గంటల తరబడి రోడ్లపైనే విధులు.. అవగాహన లేమితో రోడ్లపైకి వచ్చేవారికి నచ్చజెప్తూ.. వినకపోతే మందలిస్తూ.. కొన్నిరోజులుగా రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి అవిశ్రాంతంగా సేవలందిస్తున్న తెలంగాణ పోలీస్‌కు జనం సలాం కొడుతున్నారు. వైద్య సిబ్బందితో కలిసి వారు అందిస్తున్న సేవలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 


డీజీపీ నుంచి హోంగార్డు వరకు అటెన్షన్‌ 

కరోనా కట్టడిలో డీజీపీ నుంచి హోంగార్డు వరకు 78వేల మంది సిబ్బంది పోరాడుతున్నారు. రెండు జోన్ల ఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో పరిస్థితులపై ఆరా తీస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారు. ప్రజలను రోడ్లపై తిరుగకుండా నివారించడంతోపాటు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి క్వారంటైన్‌ సెంటర్లకు తరలించడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా వ్యాప్తివల్ల పొంచి ఉన్న ముప్పుపై పలుచోట్ల పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు అభినందనలు అందుకుంటున్నది. ప్రభుత్వ సూచనలు పాటించాలని, ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ఇక కొన్నిచోట్ల తమ లాఠీలకు పనిచెప్తున్నవారూ లేకపోలేదు. ప్రభుత్వం కూడా పోలీసుల రక్షణ విషయంలో శ్రద్ధ చూపుతున్నది. అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లను పంపిణీ చేస్తున్నది. 

అన్నార్తుల ఆకలి తీరుస్తూ.. 

ఖాకీలు కర్కశులు అన్న అపవాదును తొలగించుకుంటూ రాష్ట్ర పోలీసులు ఎంతోమంది అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాచకులు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తూ రోజుకూలీ చేసుకునేవారి పరిస్థితి దుర్భరంగా మారింది. పోలీసులు వారి ఆకలిని తీరుస్తూ ఆపన్నులుగా నిలుస్తున్నారు. కొన్నిచోట్ల సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఆర్థికసాయం చేస్తున్నారు.


ఆలోచింపజేస్తున్న చిన్నారి పోస్టర్‌.. 

‘మా నాన్న ఒక పోలీస్‌. ఆయన మీకు సహాయం చేయడానికి నాకు దూరంగా ఉన్నాడు.. మీరు ఆయనకు సహాయం చేయడానికి దయచేసి ఇంట్లో ఉండం డి..’ అంటూ ఓ చిన్నారి ప్రదర్శించిన పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విధుల్లో ఉన్న పోలీసులకు వారి కుటుంబాలు అందిస్తున్న సహకారాన్ని ఆ చిన్నారి పోస్టర్‌ ఆవిష్కరించింది. పోలీసులు అందిస్తున్న సేవలకు పలువురు నెటిజన్లు సలాం కొడుతూ ట్వీట్‌ చేస్తున్నారు. 


అజాగ్రత్తగా ఉంటే తీవ్ర పరిణామాలు

కరోనాను అరికట్టే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందరం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నిత సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలి. తప్పనిసరైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలి. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసులందరికీ అభినందనలు. 

-ఎం మహేందర్‌రెడ్డి, డీజీపీ

ప్రజా సేవతో సంతృప్తి

ప్రజల భద్రత మాకు ముఖ్యం. వారికి సేవలందించడం మాకు సంతృప్తినిస్తున్నది. లాక్‌డౌన్‌ సమయంలో మా సిబ్బంది అందరూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కరోనా విస్తరించకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. అర్ధరాత్రి వరకు ఫీల్డ్‌లో ఉంటున్నాం. తిరిగి సూర్యోదయం నుంచే అన్నీ సరిచూసుకోవాలి. ప్రజలు బాగా సహకరిస్తున్నారు. 

- సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

ప్రజలు  సహకరిస్తున్నారు

లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నది. వాళ్లు పరిస్థితిని అర్థం చేసుకుని ఇండ్లలోంచి బయటికి రావడం తగ్గించారు. మా సిబ్బంది రోజుకు 16 గంటలు ఫీల్డ్‌లో ఉంటూ సేవలందిస్తున్నారు. సిబ్బందికి అత్యవసరమైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫిర్యాదుల కోసం, ప్రజలకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు కొవిడ్‌-19 కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేశాం.

-మహేశ్‌భగవత్‌, రాచకొండ సీపీ


logo