శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 18:08:01

సూరత్‌లో చిక్కుకున్న తెలంగాణవాసులకు కేటీఆర్‌ అభయం

సూరత్‌లో చిక్కుకున్న తెలంగాణవాసులకు కేటీఆర్‌ అభయం

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందరో కాలినడక ఇండ్లకు చేరుకొంటుండగా.. పలువురు మార్గమధ్యంలోనే కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కార్మికులు వారి సొంతూళ్లకు పోయేందుకు ఇక్కడి ప్రభుత్వం  రవాణా సౌకర్యాలు కల్పించి పంపించింది. వారిని సొంత మనుషుల్లాగే చూసుకొని ఉచిత బియ్యం, నగదు ఇచ్చింది. ఇలాంటి వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి  కే తారకరామారావు.. తనకు సోషల్‌ మీడియా ద్వారా అందే  విజ్ఞప్తులకు అంతే తొందరగా  స్పందిస్తూ సాయం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ పట్టణంలో చిక్కుకుపోయి గత 55 రోజులుగా అష్ఠకష్టాలు పడుతున్న తమను తెలంగాణకు వచ్చేట్లుగా సహకరించాలని దాదాపు 34 మంది వలస కూలీలు శనివారం ట్విట్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి  కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ తిండిలేక అల్లాడుతున్నాం, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, దయచేసి అనుమతి ఇప్పించి బస్సులు నడిపి తమను ఇండ్లకు పోయేలా చేయండి.. అంటూ ట్విట్టర్లో విజ్ఞప్తిచేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్‌.. విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి  తీసుకెళ్లారు. సూరత్‌లో ఇబ్బందిపడుతున్న తెలంగాణకు చెందిన వలసకార్మికులను తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోండి అని సూచించారు.


logo