బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Feb 19, 2020 , 02:35:07

చరిత్ర తెలుసుకో కిషన్‌!

చరిత్ర తెలుసుకో కిషన్‌!
  • 1870లోనే నిజాంస్టేట్‌ రైల్వే వ్యవస్థ ఏర్పాటు
  • 1907లో నాంపల్లి, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్‌
  • ఆ సమయంలో అనేక రాష్ర్టాలకు రైలంటేనే తెలియదు
  • 1966లో నిజాంస్టేట్‌ రైల్వే.. దక్షిణమధ్య రైల్వేగా మార్పు
  • మోదీ వచ్చేవరకు రాష్ర్టానికి ఎర్రబస్సే దిక్కనడం అజ్ఞానమే
  • ఢిల్లీ మెప్పుకోసం పుట్టినగడ్డను కించపరిచేలా వ్యాఖ్యలా!
  • కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణవాదులు
  • సెటైర్లతో కేంద్ర సహాయమంత్రిని ఆటాడుకున్న నెటిజన్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాలుగు వందల ఏండ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో 1870లోనే నిజాం స్టేట్‌ రైల్వేవ్యవస్థ మొదలైంది. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఏర్పాటయ్యాయి. అనేక రాష్ర్టాల్లో రైల్వే వ్యవస్థ అంటే తెలియని రోజుల్లోనే తెలంగాణ ప్రాంతంలో రైలుకూత వినిపించింది. అలాంటి తెలంగాణకు ఆరేండ్ల కిందట మోదీ ప్రధాని అయ్యేవరకు రైలంటే తెలియదని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్‌ ఇన్‌ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. 


నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణపనుల అనంతరం కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత. మూడుసార్లు గెలిచిన స్థానం నుంచి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి! సానుభూతి కనబర్చిన ప్రజలు వెనువెంటనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో పట్టంకట్టి తలెత్తుకొనేలా చేస్తే ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు! కానీ కిషన్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌ గల్లీ నుంచి ఢిల్లీకి పంపిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిందిపోయి అవమానించారని పలువురు మండిపడుతున్నారు. 


ప్రస్తుతం ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌లోనే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఉన్నది. దేశంలో రైల్వేశాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న జోన్‌ ఇదే. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన అంబర్‌పేట నియోజకవర్గంలో మరో ప్రముఖ రైల్వేస్టేషన్‌ కాచిగూడ ఉన్నది. ప్రధాని మోదీకి భజనచేసేందుకు తెలంగాణను కించపరుచొద్దని, కిషన్‌రెడ్డి చరిత్ర చదువుకోవాలని తెలంగాణవాదులు సూచిస్తున్నారు. అహంకార పూరిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రైల్వేలో తెలంగాణది ఘన చరిత్ర 

తెలంగాణలో రైల్వేప్రస్థానాన్ని పరిశీలిస్తే.. దాదాపు 130 ఏండ్ల కిందటే ఇక్కడ రైల్వేవ్యవస్థకు బీజంపడింది. 1870లో నిజాం స్టేట్‌ రైల్వేవ్యవస్థ తెలంగాణ ప్రజల సొంతడబ్బుతో ఏర్పాటయింది. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్‌ నిర్మించారు. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ర్టాల పరిధిలో అసలు రైలు అంటేనే తెలియని పరిస్థితి. 1966లో నిజాం స్టేట్‌ రైల్వే దక్షిణ మధ్యరైల్వేగా మారింది. కిషన్‌రెడ్డికి ఈ మాత్రం అవగాహన లేకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అంబర్‌పేట పరిధిలోనే కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఉండగా, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి దగ్గర్లోనే నాంపల్లి రైల్వేస్టేషన్‌ ఉన్నది. 


వీటికి శతాబ్దాల చరిత్ర ఉంటే, మోదీ ప్రధాని అయ్యాకే కొత్తగా రైళ్లు తిరుగుతున్నాయని వ్యాఖ్యానించడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘హోదా ఆభరణంలా ఉండాలి.. ప్రజాసేవలో ఉన్న రాజకీయనాయకులైతే హుందాగా వ్యవహరించాలి. ఏకంగా కేంద్రమంత్రి హోదాలో ఉన్న కిషన్‌రెడ్డి.. ప్రధానికి భజనచేసే క్రమంలో స్థాయిని, అవగాహనను అటకెక్కించి.. పుట్టినగడ్డను, తలెత్తుకొనేలా సహకరించిన ప్రజలను కించపరిచారు. తెలంగాణ చరిత్రపై అవగాహన లేకపోవడంతోపాటు మోదీ భజన కోసం లేనిగొప్పల్ని చెప్పేప్రయత్నంలో నీచానికి దిగజారారు’ అని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పటికీ, కిషన్‌రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకొన్నారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణపై కిషన్‌రెడ్డికి ఎంతప్రేమ ఉన్నదో.. ఉద్యమ సమయం నుంచి నేటి ఎర్రబస్సు మాటలవరకు అర్థమవుతూనే ఉన్నదని ఎద్దేవాచేస్తున్నారు. 


నెట్టింట చెడుగుడు 

తెలంగాణ చరిత్రను మరుగునపడేస్తూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు నెట్టింట చెడుగుడు ఆడుతున్నారు. తెలంగాణ రైల్వే ప్రస్థానాన్ని ఉదహరిస్తూ.. ఆయన తీరును ఎండగడుతున్నారు. 1938లో జనవరి 12న.. అంటే 82 ఏండ్ల కిందట నిజాం స్టేట్‌రైల్వే ముక్కోటి ఏకాదశికి భద్రాచలం వెళ్లే భక్తులకు రైల్వేలో రాయితీపై ఇచ్చిన ప్రకటన అచ్చయిన గోల్కొండ పత్రికను పోస్టుచేసి కిషన్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. మోదీ వచ్చాకే తెలంగాణకు రైలంటే తెలిసిందనే వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. 


‘ప్రధానిమోదీ పుట్టిన సంవత్సరం 1950, మోదీ అమ్మగారు పుట్టిన సంవత్సరం 1920, మోదీ అమ్మమ్మగారు పుట్టిన సంవత్సరం 1890 (సుమారుగా).. మరి తెలంగాణలో రైల్వే మొదలైన సంవత్సరం 1870. ఎవరికి ఎవరు రైల్వే అంటే తెలియజెప్పారు?’ అంటూ చురకలంటిస్తున్నారు. మోదీ వచ్చాకే ఇక్కడ రైల్వే సౌకర్యం వచ్చిందా? అసలు తెలంగాణలో రైళ్లు తిరగడం మొదలుపెట్టినపుడు ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో విద్యుత్‌ కూడా లేదంటూ నెటిజన్లు వాస్తవాన్ని కండ్ల ముందుంచారు. ‘తెలంగాణ భూమి పుత్రులారా.. పొరపాటున బీజేపీ వంటి పార్టీలను నమ్మితే బతుకును కుక్కలు చింపిన విస్తరిచేస్తరు తస్మాత్‌జాగ్రత్త’ అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.


తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సే తెలుసు 

  • కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి వ్యాఖ్య

 ‘రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్‌ ఇన్‌ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ ప్రారంభించారు. అనంతరం క్లాక్‌టవర్‌ సమీపంలోని టైమ్‌స్కేర్‌ హోటల్‌లో మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో 48 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. అనేక దశాబ్దాలుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు.