సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 02:55:06

మిడతల దండు దండెత్తవచ్చు

మిడతల దండు దండెత్తవచ్చు

  • 200 కి.మీ. దూరంలో రాకాసి సమూహం
  • ముప్పు తప్పించేందుకు అధికారులు సిద్ధం కావాలి
  • సరిహద్దు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం.. ఉన్నతస్థాయి సమీక్ష
  • పర్యవేక్షణకు సీఎస్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం 
  • మహారాష్ట్రలోని రాంటెక్‌ వద్ద దండు 
  • దక్షిణ దిశగా ప్రయాణిస్తే రాష్ర్టానికి ముప్పే 
  • ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు వచ్చే అవకాశం
  • మిడతలు వర్షాకాలంలో దాడిచేస్తే తీవ్రనష్టం

తెలంగాణకు 200 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ప్రమాదం పొంచిఉన్నది. మహారాష్ట్రలోని రాంటెక్‌ సమీపంలో ఇది తిష్టవేసింది. ఈ దండు దక్షిణంవైపు ప్రయాణిస్తే తెలంగాణకు ముప్పుతప్పనట్టే. ఈ నెల 20 నుంచి జూలై 5వ తేదీ లోపు ఎప్పుడైనా రావచ్చని, వానకాలం సీజన్‌ ప్రారంభంలో ఇది దాడిచేస్తే తీవ్రనష్టం జరుగవచ్చని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. మిడతల దాడినుంచి రాష్ర్టాన్ని రక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. దీనిపై పర్యవేక్షణకు సీఎస్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచిఉన్న నేపథ్యంలో అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. దండు దాడినుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గతనెలలో మూడువిడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు వచ్చాయి. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి తీవ్ర నష్టం కలిగించవచ్చని భావించినా.. అవి రాష్ట్రంవైపు రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, తాజాగా రాష్ర్టానికి 200 కిలోమీటర్ల దూరంలో మరో దండు ప్రమాదం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. 

మహారాష్ట్రలోని రాంటెక్‌కు సమీపంలో అజ్ని గ్రామం వద్ద మిడతల దండు ఉన్నది. దానిప్రయాణం దక్షిణం వైపు సాగితే, తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మిడతల దండు నుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నముఖ్యమంత్రి.. అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి జూలై 5వ తేదీ వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఆ సమయంలో మొలకెత్తే దశలో ఉండే వానకాలం పంటకు మిడతల దండు దాడితో తీవ్రనష్టం జరిగే ప్రమాదం ఉన్నది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. 


ఎనిమిది జిల్లాల్లో అప్రమత్తం

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఆ రాష్ర్టాలకు సరిహద్దులోని ఎనిమిది జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్‌, బోధన్‌, జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి మిడతల దండు రావచ్చని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు.

వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీఐపీఎంసీ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌ సునిత, వ్యవసాయ వర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త రహమాన్‌ తదితరులతో కూడిన బృందం ఒకటి రెండ్రోజుల్లో ఆదిలాబాద్‌లో పర్యటించనున్నది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తుంది. సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీఐపీఎంసీ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌ సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త రహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo