గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:11

మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్టు

మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్టు

  • 112 ఎకరాలకు ఎన్వోసీ 
  • ఇచ్చేందుకు 1.12 కోట్లు లంచం  
  • రూ.40 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన వైనం 
  • కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఘటన 
  • కటకటాల్లోకి నర్సాపూర్‌ ఆర్డీవో, చిలిపిచెడ్‌ తాసిల్దార్‌తోపాటు మరో ఇద్దరు 

సంగారెడ్డిప్రతినిధి, నమస్తే తెలంగాణ/మెదక్‌/ఘట్‌కేసర్‌/దుండిగల్‌: సామాన్య రైతుల భూసమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ సంస్కరణలు తెస్తున్నా అధికారుల్లో మార్పు కన్పించట్లేదు. బుధవారం శాసన సభలో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ 112 ఎకరాల భూమికి ఏకంగా 1.12 కోట్లు లంచం డిమాండ్‌ చేసి.. 40 లక్షలతో ఏసీబీకి చిక్కాడు. మేడ్చల్‌ తాసిల్దార్‌ అవినీతి ఘటన మరచిపోకముందే ఈ ఘటన వెలుగుచూడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలోని 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వాలని సంబంధిత భూయజమానులు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను ఆశ్రయించారు. ఎకరాకు లక్ష చొప్పున రూ.1.12 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కోర్టు నుంచి వారెంట్‌ తీసుకుని మెదక్‌లోని అధికారిక నివాసంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరావు నేతృత్వంలో సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు. రూ.లక్ష నగదుతోపాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో నగేశ్‌ సతీమణి మమతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంపల్లిలోని నగేశ్‌కు చెందిన రాయలమిడోస్‌ నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఈ కేసుతో సంబంధముందని గుర్తించిన పలువురు రెవెన్యూ సిబ్బంది ఇండ్లలోనూ ఏకకాలంలో 12 చోట్ల సోదా లు నిర్వహించారు. నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి స్వగ్రామం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడెంలో, చిలిపిచెడ్‌ తాసిల్దార్‌ సత్తార్‌ స్వగ్రామం సంగారెడ్డి పట్టణంలోని ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో దాదాపు రూ.26 లక్షల నగదు, అర కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు తెలిసింది. కాగా, ఈ 1.12 కోట్ల డీల్‌లో బాధితుడు మూర్తితోపాటు అతనికి సంబంధించినవారు రూ.40లక్షల వరకు నగేశ్‌కు అప్పగించారు. మిగతా డబ్బుల కోసం బాధితుల నుంచి ప్రామిసరీ నోట్‌తో పాటు చెక్కులు తీసుకోవడం గమనార్హం. లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌తోపాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, చిలిపిచెడ్‌ తాసిల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ వహీం, అదనపు కలెక్ట్‌ బినామీ జీవన్‌గౌడ్‌ను అరెస్ట్‌ చేశారు.  

1982లో భూమి కొనుగోలు...

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తిలోని 58, 59 సర్వే నంబర్లలోని 187 ఎకరాల భూమిని హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన మూర్తితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు 1982-83లో కొనుగోలు చేశారు. అప్పటివరకు అసైన్డ్‌గా ఉన్న భూమిని 1987-88లో పట్టా భూమిగా అధికారులు మార్చా రు. ఇందులో 112 ఎకరాలకు సంబంధించి ఎన్వోసీ అవసరంరాగా, మూర్తితో పాటు అతని సంబంధీకులు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను ఆశ్రయించారు. దీంతో ఆయన ఎకరాకు లక్ష చొప్పున లంచం డిమాండ్‌ చేశాడు. ఇప్పటికే రూ.40 లక్షల వరకు బాధితులు ముట్టజెప్పారు. మిగతా డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రామిసరీ నోట్‌ రాసిచ్చారు. రూ.40 లక్షలు ఇచ్చినా ఇబ్బంది పెడుతుండటంతో మూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వలపన్ని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బలమైన ఆధారాలు ఉండడంతోనే ఏకకాలంలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినట్లు స్పష్టం అవుతున్నది. 

ఏసీబీ చరిత్రలో తొలిసారి అదనపు కలెక్టర్‌ అరెస్టు  


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మొన్న కీసర తాసీల్దార్‌ నాగరాజు.. ఇప్పడు ఏకంగా మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌.. వివాదాస్పద భూముల సెటిల్‌మెంట్‌లో కొందరు రెవెన్యూ అధికారులు ఆరితేరుతున్నారు. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లలో డీల్‌ కుదుర్చుకుంటున్నారు. సోదాలకెళ్లిన ఏసీబీ అధికారులుసైతం నోరెళ్లబెట్టే రేంజ్‌లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. సరిగ్గా నెల రోజులు కూడా దాటక ముందే రెండు భారీ అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులు పక్కాగా వలవేసి పట్టుకొన్నారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా అదనపు కలెక్టర్‌ స్థాయి వ్యక్తి రూ.కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇదే మొదటిసారి. కీసర తాసిల్దార్‌ నాగరాజు రూ.కోటి 10 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే.. మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ రూ.కోటి 12 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. రెవెన్యూశాఖలో అవినీతి అధికారులపై ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు కొరఢా ఝులిపిస్తూనే ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ట్రాప్‌ చేయడం, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆదాయానికి మించిన ఆస్తులు ఇలా 2016నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రెవెన్యూ అధికారులపై మొత్తం 114 కేసులను ఏసీబీ నమోదు చేసింది. 

వెలుగులోకి ఫోన్‌ సంభాషణ

మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అవినీతి వ్యవహారంలో కీలక ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. తనకు ఇంత కావాలని బాధితుడితో ఆయన నేరుగా చర్చలు జరిపిన ఫోన్‌ సంభాషణ బయటకు రాగా.. వీడియో టేపులు కూడా ఉన్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్‌ నగేశ్‌ బాధితుడితో జరిగిన ఆడియో సంభాషణ ఇలా.. 

నగేశ్‌: మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? మీకు క్లారిటీ ఉన్నదా..?

బాధితుడు: నాకు క్లారిటీ ఉంది సార్‌.

నగేశ్‌: మొదట 25 లక్షలు ఇస్తాం అన్నారు. తరువాత 19. 50 లక్షలు ఇచ్చారు. మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు?

బాధితుడు: వహీంకు రూ.5 లక్షలు ఇచ్చాను. మొదట రెండు, తరువాత మూడు లక్షలు ఇచ్చాను.

నగేశ్‌: నేను రెండు లక్షలు అని చెప్పాను కదా..? నాకు చెప్పాలి కదా..?

బాధితుడు: మీకు వహీం కాల్‌ చేశానని చెప్పడంతోనే ఇచ్చాను సార్‌.

నగేశ్‌: ఎవరికి ఏమి ఇచ్చినా నాకు చెప్పాలి కదా..? ఐదు లక్షలు ఇవ్వాల్సింది కాదు. 


logo