గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:16

సొంత రాబడుల్లో నంబర్‌వన్‌

సొంత రాబడుల్లో నంబర్‌వన్‌

  • జీఎస్డీపీలో 7.4 శాతం సొంత ఆదాయం
  • కేంద్రం గ్రాంట్‌లో కోత పడినా పురోగతి
  • 58 శాతం తగ్గిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌
  • పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌ నివేదికలో వెల్లడి

ప్రత్యేక ప్రతినిధి, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సొంత రాబడులలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2015-2020 మధ్యకాలంలో  రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సొంత రాబడి 7.4 శాతం ఉన్నట్టు ‘పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌' తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం సంపదలో సొంత పన్నుల ద్వారా అధిక రాబడిని సమకూర్చుకున్న రాష్ర్టాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా, 7.2శాతం ఆదాయంతో ఉత్తరప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచింది. మరే రాష్ట్రం ఏడు శాతం ఆదాయాన్ని దాటలేదు. మహారాష్ట్ర 6.8 శాతం రాబడితో మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 6.4శాతం సొంత రాబడులను సాధించినట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా, 2015-19 మధ్య తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ -ఇన్‌-ఎయిడ్‌లో 58శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఆదాయం కేవలం రూ.35వేల కోట్ల వరకు ఉండగా, ఆ తరువాత మూడేండ్లలోనే అది రూ.60వేల కోట్ల వరకు పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంత జీడీపీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ఆవిర్భవించిన ఆరేండ్లలోనే ఆర్థిక రంగంలో విప్లవాత్మక మెరుగుదలను సాధించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ జీఎస్డీపీ రూ. 4లక్షల కోట్లు కాగా.. ఆరేండ్లలోనే అది రూ 9.6లక్షల కోట్లకు పెరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఏటా సొంత పన్నుల రూపంలో 7.4శాతం వరకు (సుమారు రూ.60వేల కోట్లు) సమకూర్చుకుందని ఆ నివేదిక వెల్లడించింది.


logo