శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 01:38:22

కరోనాపై ముప్పేట దాడి

కరోనాపై ముప్పేట దాడి

  • జీవనప్రదాతలుగా వైద్యులు
  • వీధుల్లో పోలీసుల యుద్ధం
  • వదంతులపై ప్రత్యేక  నిఘా
  • మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది అప్రమత్తం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అధికారులు, సిబ్బంది ముప్పేట దాడిచేస్తున్నారు. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల బృందాలు పోరు సల్పుతున్నాయి. ముఖ్యంగా వైద్యసిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు. వారితోపాటు పోలీసులు, మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది, అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎనలేని సేవలందిస్తున్నారు. వీరి పనితీరును ప్రజలంతా అభినందిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి 24 గంటలపాటు జనతా కర్ఫ్యూను విధించిన ప్రభుత్వం.. వచ్చేవారం వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ‘మీరు ఇండ్లలో ఉండండి.. కొవిడ్‌-19 మహమ్మారితో మేము పోరాడుతాం’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.

ప్రాణాలను పణంగాపెట్టి..

కరోనా వ్యాధిగ్రస్థులకు సేవలందించడంలో వైద్యసిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయడంలేదు. గాంధీ, ఫీవర్‌, ఛాతీ తదితర దవాఖానల్లో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, హౌస్‌కీపింగ్‌ వర్కర్లతోపాటు దాదాపు 500 మంది అంబులెన్సు సిబ్బంది కరోనాపై ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. 104 హెల్ప్‌లైన్‌ కేంద్రం పరిధిలోనే వెయ్యిమంది, అన్ని జిల్లాల్లోని ‘ర్యాపిడ్‌ రియాక్షన్‌' బృందాల్లో మరో వెయ్యిమందికిపైగా సిబ్బం ది పనిచేస్తున్నారు. వీరి అమూల్య సేవలకు యావత్‌ తెలంగాణ ప్రజానీకం జైకొడుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ఎన్నో ప్రత్యేక విభాగాలున్నప్పటికీ కరోనాపై పోరులో జనరల్‌ మెడిసిన్‌, పల్మనాలజీ, క్రిటికల్‌ కేర్‌ విభాగాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.

శభాష్‌ పోలీస్‌

కరోనాపై సాగుతున్న యుద్ధంలో తెలంగాణ పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి క్వారంటైన్‌ సెంటర్లకు తరలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా కట్టడికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ)లోని 188 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు లాఠీలను పక్కనపెట్టి ప్రత్యేక డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. జనం గుంపులు గుంపులుగా తిరగకుండా కట్టడిచేస్తున్నారు. కానిస్టేబుల్‌ మొదలుకొని డీజీపీ వరకు 60 వేలమంది పోలీస్‌ సిబ్బంది, 18 వేలమంది హోంగార్డులు పూర్తిస్థాయి విధుల్లో కొనసాగుతున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. కరోనాపై సోషల్‌మీడియాలో వదంతులు వ్యాపించకుండా పోలీసులు గట్టి నిఘాపెట్టారు. అన్ని జిల్లాల్లో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్ల నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య యుద్ధం

కరోనాను నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య యుద్ధం మొదలైంది. ప్రతి గ్రామానికి బ్లీచింగ్‌, ఫినాయిల్‌తోపాటు ఇతర క్రిమిసంహారక మందులను పంపిణీ చేశారు. అన్ని వీధుల్లో వీటిని క్రమం తప్పకుండా పిచికారీ చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులు ఆదేశించారు. శానిటేషన్‌ సిబ్బందికి రూ.15 వేల చొప్పున వెచ్చించి మాస్కులు, డ్రెస్‌లను అందజేశారు. వీటిని నిత్యం ఉపయోగించాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కొత్తవారిని గ్రామాల్లోకి రానీయకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా.. పూర్తిస్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహించి అత్యవసరమనుకుంటేనే గ్రామాల్లోకి అనుమతించనున్నారు. దీనిపై నిఘా పెట్టేందుకు అన్ని గ్రామాల సరిహద్దుల్లో సిబ్బందిని మోహరిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది రోజువారీగా గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఇంటినీ పరిశీలిస్తున్నారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలుంటే వెంటనే దవాఖానలకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని గుర్తించి ఇండ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా వారి చేతులపై క్వారంటైన్‌ ముద్రలు వేస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని మున్సిపాల్టీల పరిధిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.


logo