ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:23:28

ప్రగతి నిరోధకులుగా ప్రతిపక్షాలు

ప్రగతి నిరోధకులుగా ప్రతిపక్షాలు

  • కాంగ్రెస్‌, బీజేపీల తీరు మారాలి
  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత హితవు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విజన్‌తో పనిచేస్తుంటే.. ప్రతిపక్షాలు విధ్వం సం చేసేందుకు కంకణం కట్టుకున్నాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మండిపడ్డారు. ప్రతిపక్షాలవి పిల్లి శాపాల్లాంటివని, వారు ప్రగతి నిరోధకులుగా మారిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అసూయ, విద్వేషాలతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, బీజేపీల తీరు మారాలని హితవుపలికారు. బుధవారం అసెంబ్లీ మీడియాలో పాయింట్‌లో మీడియా సమావేశంలో గొంగిడి సునీత మాట్లాడుతూ.. తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ నేతల కండ్లు అసూయతో ఎర్రబడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలు అప్పులు చేయడం లేదా? అని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకొని రైతుల కండ్లలో సంతోషం చిగురించేలా చేశాయని ఆమె చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఎడారిని తలపించేదని, కానీ ఇప్పుడు గోదావరి, కృష్ణాజలాలను జిల్లాకు తరలించి సీఎం కేసీఆర్‌ దేవుడయ్యాడని పేర్కొన్నారు. ఆకలితో అలమటించిన నల్లగొండ జిల్లా ఇప్పుడు రైతులపాలిట స్వర్గమైందని చెప్పారు. నల్లగొండ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని తెలిపారు. కేసీఆర్‌ పాలన రైతులకు స్వర్ణయుగమని అభివర్ణించారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో సాగువిస్తీర్ణం పెరుగడానికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలే కారణమని తెలిపారు. కరోనా సమయంలోనూ దేశానికి రికార్డుస్థాయిలో ధాన్యాన్ని అందించిన ఘనత తెలంగాణదేనని చెప్పారు.


logo