సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 18:23:49

దేశానికే ఆద‌ర్శంగా.. తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌

దేశానికే ఆద‌ర్శంగా.. తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌

హైదరాబాద్ :  తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న మిష‌న్ భ‌గీర‌థ పథ‌కం విధానం అన్ని రాష్ట్రాల‌కు మార్గదర్శిగా నిలుస్తుంద‌న్న జాతీయ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ డైరెక్టర్ మ‌నోజ్ కుమార్ సాహోకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రం మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించిన నేప‌థ్యంలో మిష‌న్ భ‌గీర‌థ పై  ఆ శాఖ  ఉన్నాతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిష‌న్ భ‌గీర‌థ‌ త‌ర‌హాలో అమ‌లు చేస్తున్న జ‌ల్ జీవ‌న్ లోనూ ఫ్లో కంట్రోల్ వాల్వ్ ని వాడాల‌ని సూచించారు. తెలంగాణ మోడ‌ల్ ని అధ్యయనం చేయ‌డానికి సాంకేతిక బృందాల‌ను  పంపండి అని అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌లు రాశారు. 

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని మంచినీటి కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఎండా కాలం వచ్చిందంటే చాలు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి ఉండేదన్నారు. నల్లాలు, బోరింగుల దగ్గర శిగపట్లు. పానీ పట్లు. నిత్యకృత్యమని పేర్కొన్నారు. నీటి సమస్యలను చూసి అసెంబ్లీని ఆలస్యంగా సమావేశ పరిచే దుస్థితులు ఉండేవన్నారు.

సుదీర్ఘ పోరాటంతో ప్రజల నీటి గోస తీరింది. అపర భగీరథుడిలా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ అపూర్వ పథకానికి అంకురార్పణ చేసి నీటి కష్టాలను తీర్చారని తెలిపారు.చిన్నచిన్న విష‌యాల‌పై రాద్ధాంతాలు చేసే, రాష్ట్ర బీజేపీ నేత‌లు ఇలాంటి ప‌థ‌కాల‌కు కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. అభివృద్ధికి రాజ‌కీయాలు అద్ది..రాద్ధాంతాలు చేసి, మీరు ఎవ‌రి త‌ర‌పున‌, ఎవ‌రి కోసం? ఎందుకు మాట్లాడుతున్నారో ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలని హితవు పలికారు. నిజంగా మీరు తెలంగాణ బిడ్డలే అయితే. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములు కండి అని సూచించారు.



logo