శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 13:12:06

యాదాద్రిలో బస్టాండ్‌, బ‌స్‌డిపోల స్థ‌లాల ప‌రిశీల‌న‌

యాదాద్రిలో బస్టాండ్‌, బ‌స్‌డిపోల స్థ‌లాల ప‌రిశీల‌న‌

యాదాద్రి భువ‌న‌గిరి : యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్య క్షేత్రాన్ని భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు యాదాద్రిలో నిర్మించాల్సిన బ‌స్టాండ్‌, బ‌స్‌డిపోల కోసం స్థ‌లాల‌ను మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న‌ ప్రధాన ఆలయ పనులు పూర్తి అవుతున్నాయ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆల‌య ఆవ‌ర‌ణ‌లోని క‌ల్యాణ‌క‌ట్ట‌, అన్న‌దాన స‌త్రంతో పాటు ఇత‌ర ప్రాంతాల‌కు భ‌క్తుల‌ను చేర‌వేసేందుకు అనువైన ప్ర‌దేశాల్లో బ‌స్టాండ్‌, బ‌స్‌డిపోల‌ను ఏర్పాటు చేసేందుకు స్థ‌లాల‌ను ప‌రిశీలించామ‌ని చెప్పారు.   ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వీటి నిర్మాణం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. యాదగిరిగుట్ట ఆవరణలో గండి చెరువు వద్ద నిర్మించిన బ‌స్టాప్‌ను, సైదాపూర్ లో నిర్మించిన బస్ డిపోలను కూడా ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. యాదగిరిగుట్ట‌కు రింగ్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. టెంపుల్ సిటీని కూడా ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. ప్ర‌ముఖులు సంద‌ర్శించ‌డానికి ప్రెసిడెన్షియ‌ల్ ఘాట్‌, క‌ల్యాణ‌క‌ట్ట పుష్క‌ర్ ఘాట్‌ను నిర్మిస్తామ‌న్నారు.  

అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. యాద‌గిరిగుట్ట నుంచి వివిధ ప్రాంతాల‌కు భ‌క్తులు వెళ్లేందుకు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌న్నారు. బ‌స్ టెర్మిన‌ల్‌, టెంపుల్ టెర్మిన‌ల్ ఏర్పాటుకు కావాల్సిన ల్యాండ్‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. బ‌స్ డిపో నందు 150 బ‌స్సులు నైట్‌హాల్ట్ చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

 

ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట టెంపుల్ టూరిస్ట్ హబ్‌గా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. యాదాద్రి అభివృద్ధి చెంద‌డంతో స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు. 

భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి ఆల‌యాన్ని ఆధునిక హంగుల‌తో తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీ చైర్మన్ సందీప్  రెడ్డి, ఆలయ ఈవో గీత, మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్, రీజినల్ మేనేజర్ నల్గొండ వెంకన్న, ఆర్ అండ్ బి ఎస్ఈ వసంత నాయక్, ఈడీ రెవెన్యూ పురుషోత్తం, ఈడీ కరీంనగర్ హైదరాబాద్ మునిశేఖర్, ఎండీ సునీల్ శర్మ, సూర్యాపేట‌ డివిజనల్ మేనేజర్ కేశవులు, డిపో మేనేజర్ రఘు, ఆర్డీవో భూపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.