మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 01:25:24

మంత్రుల ‘జనతా కర్ఫ్యూ’

మంత్రుల ‘జనతా కర్ఫ్యూ’

  • స్వచ్ఛందంగా ఇండ్లకు పరిమితం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులందరూ ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్‌ నుంచి ప్రజానీకాన్ని కాపాడేందుకు కృషిచేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు సంఘీభావంగా సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను పణంగాపెట్టి ప్రజలను కాపాడుతున్నవారి సేవలు అమోఘమని తెలిపారు. ఇటలీ లాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ఉందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. 

ప్రతివ్యక్తి సామాజిక బాధ్యతగా భావించి కరోనా కట్టడి కోసం ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ప్రపంచ దేశాలు వణికిస్తున్న కరోనాను ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టడానికి స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్‌ చూపించిన చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. 

కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు పాటిద్దామని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఖతంచేసేదాకా కంకణబద్ధులమవుదామని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. స్వీయ క్రమశిక్షణతో కరోనా మహమ్మారిని తరిమికొడుదామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు విధిగా పాటించి మనల్ని మనం కాపాడుకుందామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రజలంతా బ్‌పమత్తంగా ఉండి సమాజాన్ని కాపాడుకోవాలని రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి  పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ ఎమర్జెన్సీ సేవల్లో భాగంగా విధులు నిర్వహించిన విద్యుత్‌శాఖ సిబ్బందికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు.


జనతా కర్ఫ్యూలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు

జనతా కర్ఫ్యూ విజయవంతానికి టీఆర్‌ఎస్‌ నాయకులు కృషిచేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, 60 లక్షల మంది సభ్యులు జనతాకర్ఫ్యూకు మద్దతు పలికారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చికిత్సలేదని, నివారణ ఒక్కటే మార్గమని ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణకు నుంచి కరోనాను తరిమి కొట్టడానికి ప్రతిఒక్కరూ ఇంట్లో ఉండటమే మార్గమని చైతన్యం తీసుకొచ్చారు. logo
>>>>>>