శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 10:34:49

జిల్లా కేంద్రాల్లో మైదానాలు

జిల్లా కేంద్రాల్లో మైదానాలు
  • రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి
  • మరో 20 ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రి
  • అసెంబ్లీలో పద్దులపై చర్చలో మంత్రి శ్రీనివాసగౌడ్‌
  • ఒకేసారి 25 పద్దులను ప్రవేశపెట్టిన స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారని పర్యాటక, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లో పర్యాటక, క్రీడా మైదానాలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొత్తం 25 పద్దులను ఒకేసారి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. అన్నింటిపై కలిపి సభ్యులు చర్చలో పాల్గొనాలని కోరారు. అన్ని అంశాలపైనా లేదా ఎంచుకున్న అంశంపై క్లుప్తంగా అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తాగు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసిన వెంటనే ఇతర రంగాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ వ్యూహం సిద్ధంచేశారని పేర్కొన్నారు. వచ్చే ఇరవై ఏండ్లు కేసీఆరే సీఎంగా కొనసాగుతారని, ఆయన మదిలో పేదలకు కావాల్సిన ఎ న్నో పథకాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఒక ఇంజినీర్‌గా సీఎం కేసీఆర్‌ మూడేండ్లలో నే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చరిత్ర సృష్టించారని, అందుకు అభినందనలు తెలిపారు. 


హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి

పద్దులపై చర్చ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం గొప్ప విషయమన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డివిజన్లను పెంచాలని కోరారు. దశాబ్దాల నుంచి నెర్రెలిచ్చిన నేల ఇప్పుడు కృష్ణా, గోదావరి జలాల వల్ల సాగుతో ఆకుపచ్చగా కనిపిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పట్టుదల, కృషి వల్లే రాష్ట్రం వెలుగుల తెలంగాణగా విరాజిల్లుతున్నదని చెప్పారు. పారిశ్రామిక విధానమే కాదు, ప్రతి అంశంలోనూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇత ర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చెప్పారు. కొత్త జిల్లాలవారీగా నూతన ఈఎస్‌ఐ దవాఖానలను ప్రారంభించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు. సౌకర్యాలు మెరుగైనపుడు ప్రజలు కొంత పన్నులు పెంచినా భారంగా భావించరని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనతో 1700 సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడమనేది గొప్ప విషయమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. 


700 కోట్లతో యాదాద్రి అభివృద్ధి: మంత్రి అల్లోల


రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం, భూముల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, వసతుల కల్పనకు రూ.700 కోట్లు ఖర్చుచేశాం. 1,427 దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం కోసం రూ.287 కోట్లను మంజూరుచేశాం. ధూపదీప నైవేద్య పథకం కింద 3,645 దేవాలయాలకు ప్రతినెలా రూ.6,000 చొప్పున అందజేస్తున్నాం.  


కార్మికుల జీవితాల్లో వెలుగులు: మంత్రి మల్లారెడ్డి 


సీఎం కేసీఆర్‌ను కార్మికులంతా దేవుడిలా కొలుస్తున్నారు. గత ప్రభుత్వాలు కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తే.. సీఎం కేసీఆర్‌ మాత్రం వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కార్మికశాఖ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణను అందజేస్తున్నాం. 


ఇబ్బంది తీర్చిన మిషన్‌ భగీరథ: మంత్రి ఎర్రబెల్లి 


రాష్ట్రంలో మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు.  మిషన్‌ భగీరథకు మూడుసార్లు హడ్కో అవార్డు, జాతీయ వాటర్‌ మిషన్‌ వంటి అవార్డులెన్నో వచ్చాయి. తెలంగాణ పల్లెల్లో పచ్చదనం- పరిశుభ్రత వెల్లివిరియాలి.  


బకాయిలపై తప్పుడు ప్రచారం: మంత్రి వేముల


రహదారులు, భవనాల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు బకాయిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి కేవలం 10-12 శాతమే బకాయిలు ఉన్నాయి. రూ.843 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాం. రూ.645 కోట్లతో రహదారుల మరమ్మతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 31,345 కి.మీ. జాతీయ, రాష్ట్ర రోడ్లున్నాయి. 


పల్లె ప్రగతి అద్భుతం

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతం. కేసీఆర్‌ కిట్‌ పథకం తెచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి.  తక్కువమంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలి. విద్యార్థులు తక్కువగా ఉన్న నాలుగైదు పాఠశాలలు కలిపి ఒక్కచోట నిర్వహించాలి.  ప్రభుత్వ దవాఖానలను తీసేయాలి. జిల్లాలవారీగా కార్పొరేట్‌ దవాఖానలను ఎంపికచేసి ప్రజలకు వైద్యం అందించేలా రిఫర్‌చేయాలి. వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చుచేసే నిధులను ఇందుకు వినియోగించాలి.


కరోనాతో ప్రాణహాని తక్కువే

  • ఆరోగ్యశాఖ పద్దులపై మంత్రి ఈటల రాజేందర్‌ 


తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరికీ కరోనా వైరస్‌ సోకలేదు.  ఇతర దేశాలనుంచి రాష్ర్టానికి వచ్చినవారికే సంక్రమించింది. బయటిదేశాలనుంచి నగరానికి వచ్చేవారిని ఆపగలిగితే కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసినట్టే. ఇదేవిషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం. ఆరోగ్యంగా ఉన్నవాళ్లెవరూ మాస్కుల కోసం తిరగాల్సిన అవసరం లేదు. కరోనా లక్షణాలున్నవారికి చికిత్స అందించే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది మాత్రమే వినియోగించాలి. కరోనా సోకినవారిలో 81శాతం మందికి పద్నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. 14శాతం మంది మామూలు డాక్టర్ల వద్ద చికిత్స తీసుకున్నా తగ్గుతుంది. కరోనా వైరస్‌తో దాదాపు తొంభైఐదుశాతం వరకూ ప్రాణహాని లేదు. 


యాసంగిలో 38 లక్షల ఎకరాల సాగు: మంత్రి హరీశ్‌రావు


రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా యాసంగిలో 38 లక్షల ఎకరాలు సాగయింది. సీఎం కేసీఆర్‌ కృషి వల్ల పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడం, మిషన్‌ కాకతీయ ద్వారా ఇది సాధ్యమైంది. సీఎం కేసీఆర్‌ నీటిపారుదలశాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని.. జాతీయస్థాయిలో అనేకమంది నీటిపారుదల ఇంజినీర్లు, ప్రముఖులు ప్రశంసించారు. అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యం. 


సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం: మంత్రి జగదీశ్‌రెడ్డి 


తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సరఫరా సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం. విద్యుత్‌ సమస్యను తక్కువ కాలంలో పరిష్కరించిన ఘనత ఆయనదే. 19 లక్షలు ఉన్న వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు ప్రస్తుతం 24.5 లక్షలకు పెరిగాయి.  2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్‌ కోతలు, పవర్‌ హాలిడేస్‌ ఉండేవి. ఆ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడం సీఎం కేసీఆర్‌కే చెల్లింది.


విద్యాభివృద్ధికి రూ.16,450 కోట్లు: మంత్రి సబిత


రాష్ట్రంలో పాఠశాల విద్య, గురుకుల విద్యాలయాల అభివృద్ధి కోసం మొత్తం రూ.16,450 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం. రాష్ట్రంలో 1,626 గురుకులాలను నెలకొల్పాం. మధ్యాహ్న భోజన పథకం కోసం రూ.474 కోట్లు ప్రతిపాదించాం. సీఎం కేసీఆర్‌ చేపట్టిన ‘ఈచ్‌వన్‌ -టీచ్‌వన్‌'లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇంటర్‌ పరీక్షలపై ప్రత్యేకశ్రద్ధ వహించాం. 


logo