బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 15:23:13

హైద‌రాబాద్ అభివృద్ధిపై ప్ర‌గ‌తి నివేదిక‌: మ‌ంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్ అభివృద్ధిపై ప్ర‌గ‌తి నివేదిక‌: మ‌ంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ‌హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త ఐదేండ్లుగా జ‌రిగిన అభివృద్ధి గురించి ఒక ప్ర‌గ‌తి నివేదిక‌ను రూపొందించి విడుదల చేస్తామ‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ క‌మిటీ అధ్య‌క్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మ‌ధ్యాహ్నం జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ప్ర‌జాప్ర‌తినిధులతో జ‌రిగిన భేటీలో కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ స‌మావేశానికి న‌గ‌రానికి చెందిన‌ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. 

ప్రభుత్వం గత ఐదేండ్లుగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింద‌ని మంత్రి కేటీర్ చెప్పారు. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించడంతోపాటు వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధిపరచింద‌ని తెలిపారు. అంతేగాక‌ లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించింద‌న్నారు. హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల కోసం ఐడేండ్ల‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు.

గత ఐదేండ్లుగా హైదరాబాద్ నగరంలో చేప‌ట్టిన‌ కార్యక్రమాలు, పథకాలు, మౌలిక వసతులకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకచోట చేకూర్చి ప్రగతి నివేదిక విడుదల చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రగతి నివేదిక తమ ప్ర‌భుత్వ‌ పనితీరుకు నిదర్శనంగా ఉండబోతుంద‌ని చెప్పారు. జీహెచ్ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి బ‌లంగా తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కార్పొరేటర్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ కోరారు. రిజిస్ట్రేష‌న్లు, ఆస్తుల‌పై హ‌క్కుల‌కు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల‌ను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నద‌ని చెప్పారు. స్థిరాస్తుల పైన యాజమాన్య హక్కులు కల్పించ‌డానికి చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంద‌న్నారు. 

ఇక‌, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక‌టో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని మంత్రి కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సూచించారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు, నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సీరియ‌స్‌గా పనిచేయాల‌ని న‌గ‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఆదేశించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo