సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:22:55

కావ్యకెంత కష్టం

కావ్యకెంత కష్టం

  • అప్పులు తీర్చేందుకు దుబాయ్‌ వెళ్లిన భర్త
  • అక్కడే గుండెపోటుతో హఠాన్మరణం
  • ఏడాది కూతురితో చితికి నిప్పు
  • దిక్కుతోచని స్థితిలో బాధితురాలు
  • అప్పులు తీర్చేమార్గం లేక కన్నీరుమున్నీరు 

ధర్మారం : పెండ్లయి రెండేళ్లయింది. ఏడాది పాప. సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని అప్పుల బాధ వెంటాడింది. తప్పని పరిస్థితుల్లో నాలుగు నెలల క్రితం దుబాయ్‌ వెళ్లిన భర్త.. అనుకోనిరీతిలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం తో ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గురువారం దుబాయ్‌ నుంచి భర్త మృతదేహం రాగా, ఏడాది కూతురితో చితికి నిప్పుపెట్టించి తనలోనే కుమిలిపోయింది. వివరాలుఇలా.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని న్యూకొత్తపల్లికి చెందిన తీగెల ఓదెలు(29)కు రెండేండ్ల క్రితమే పెళ్లయింది. భార్య కావ్యతోపాటు ఏడాది వయస్సున్న కూతురు ఉన్నది. పెండ్లికి ముందు నిర్మించిన ఇంటి కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చేందుకని మరో రూ.లక్ష అప్పు చేసి, గత డిసెంబర్‌లో దుబాయ్‌ వెళ్లాడు. వెళ్లిన నెలకు తండ్రి, ఐదు నెలలకు అక్క చనిపోయినా, అప్పులు ఎలాగైనా తీర్చాలన్న ఉద్దేశంతో అక్కడే ఉండిపోయాడు. 

తన వాళ్లను కోల్పోయినా రాలేకపోయానని భార్యతో ఫోన్‌లో చెప్పుకుని కుమిలిపోయాడు. అప్పుతేరిన తర్వాతే ఇంటి వస్తానని చెప్పాడు. కానీ, అంతలోనే ఏప్రిల్‌ 6న గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మృతదేహం అక్కడే ఉండిపోగా, గురువారం స్వదేశానికి పంపించారు. ఏడాది కూతురు రియాన్సితో తండ్రి చితికి నిప్పుపెట్టించగా, ఈ దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఎన్నో కలలుగన్న కావ్య.. భర్త మృతితో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పుట్టెడు దుఃఖంలో మునిగిన ఆమె, ఓ వైపు భర్తను కోల్పోయి, మరోవైపు అప్పుల భారం మీద పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది.


logo