e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home తెలంగాణ సంక్షేమ సింగిడి..

సంక్షేమ సింగిడి..

సంక్షేమ సింగిడి..
  • తెలంగాణలో అభివృద్ధి ఉషస్సులు
  • ఇంటింటా సంతోషాల వెల్లువ
  • గర్జల నిండుగా ధాన్యపురాశులు.. గుండెల నిండా సంబురాలు
  • సంక్షేమంలో సాటిలేని రాష్ట్రం
  • ప్రగతిపథంలో పరుగుల తెలంగాణ

తెలంగాణ వచ్చినప్పుడు ఏ వృద్ధుడూ అనుకోలేదు.. తనకు రెండు వేల పింఛన్‌ వస్తుందని.. ఏ బీడీ కార్మికురాలూ ఊహించలేదు.. తానూ పింఛను అందుకొంటానని.. ఏ ఆడపిల్లా భావించలేదు.. రంది లేకుండా తన పెండ్లి అయిపోతుందని..ప్రభుత్వ బడిలో చదువుకొన్న ఏ విద్యార్థీ అనుకోలేదు.. తాను పై చదువుల కోసం విదేశాలకు వెళ్తానని.. ఏ బాలింత అనుకోలేదు.. తనకు సుఖప్రసవమవుతుందని.. తన బిడ్డ ఆలనాపాలనా కష్టం కాదని..

అనుకోనివన్నీ జరిగిపోయాయి.. ఎవరూ ఊహించనివి సాధ్యమైపోయాయి. గడ్డమీదకు నీళ్లొచ్చినయి. ఇంటికాడికి మార్కెట్లు వచ్చినయి. ఇంట్లోకి ధాన్యపురాశులొచ్చినయి. పట్నం కంటే.. పల్లెల్లో పైసలెక్కువైపోయినయి.. ఇప్పుడు తెలంగాణలో ప్రసవం కష్టం కాదు. చదువు కష్టంకాదు. ఉపాధి కష్టం కాదు. ఏడేండ్లలో ఎట్లాంటి తెలంగాణ ఎట్టెట్టా మారిపోయింది? ఇవాళ తెలంగాణ పేరు వింటేనే దేశం తన కండ్లు జిగేల్‌ చేసుకొని చూస్తున్నది. ఆశ్చర్యంతో చకితమవుతున్నది. ఏడేండ్లలో ఎట్లా సాధించిందని ముక్కున వేలేసుకొంటున్నది. ఇదంతా తెలంగాణ కాబట్టే సాధ్యమైంది. ఇక్కడి పాలకుడు కేసీఆర్‌ కాబట్టే సాకారమైంది.


హైదరాబాద్‌, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): ‘ఇల్లిల్లు శోకాలురా తెలంగాణ.. ఇంకెపుడు తీరేనురా’ అంటూ అరిగోస పడ్డ తెలంగాణ.. ఇప్పుడెట్లా మారిపోయింది? ఒక్కో ఇంట్లో మారిన చిత్రాలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. తెలంగాణకు ముందు ఏర్పడ్డ రాష్ట్లాల్లో ఇప్పటికీ సామాన్యుడి గోసలు గోసగానే ఉండిపోయినయే.. తెలంగాణ వచ్చి ఏడేండ్లలోనే సప్త వర్ణాల ఉషస్సులు ఎలా ఉదయిస్తున్నాయి? అంటూ అరిగోసపడ్డ తెలంగాణ అద్భుత జీవన వికాసాన్ని సొంతం చేసుకొంటున్నది. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతూ తనను తాను నవీకరించుకొంటున్నది. తాను తేజోమయమవుతూ.. దేశానికి వెలుగునిస్తున్నది. స్వరాష్ట్రం సాధించుకొన్న ఏడేండ్లల్లో ఇంటింటా ఇంద్రధనస్సు విరుస్తున్నది. మన అవసరాలను మనకంటే ముందుగానే ఎరిగిన ముఖ్యమంత్రి ఆ అవసరాలు తీరేందుకు సమయానుకూలంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు స్వరాష్ట్రాన్ని సప్తవర్ణ శోభితం చేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఎవరూ అడుగకుండానే అమలుచేస్తూ సంక్షేమఫలాలను అందిస్తున్నారు. నాలుగు వందలకు పైగా పథకాలను ప్రవేశపెట్టి ప్రజల దీవెనలు పొందుతున్నారు. సాధారణంగా ఎన్నికల సందర్భంగా అధికారమే పరమావధిగా ప్రజాకర్షక పథకాలను ప్రకటించి, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయే ప్రభుత్వాలను చాలా చూశాం. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తన ప్రజలకు ఏమి కావాలో, వాటిని ఎప్పుడు.. ఎలా తీర్చాలో తెలిసిన నాయకుడిగా.. పాలకుడిగా సందర్భాన్ని బట్టి అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రజల అవసరాలను తెలుసుకొని తననెవరూ అడగకపోయినా తనంటతానుగా అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేశారు.

విరిసిన విద్యా కుసుమాలు

కేజీ టు పీజీ సీఎం కేసీఆర్‌ నినాదం. సర్కార్‌ సారథ్యంలోనే నాణ్యమైన ఉన్నతవిద్య అందించాలన్న సంకల్పంతో గురుకులాలను, వృత్తివిద్యా కళాశాలలను ఏర్పాటుచేసి లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన అందిస్తున్నారు. నియోజకవర్గానికో గురుకులాన్ని ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు,
బలహీనవర్గాలకు ఐఐటీ, ఐఐఎం వంటి కోర్సుల్లోనే కాకుండా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి కోర్సుల్లో సీట్లు సాధించేలా రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు. హాస్టళ్లల్లో సన్నబియ్యంతో బువ్వ. వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు, రెండుసార్లు మటన్‌, చికెన్‌తో భోజనం. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి దాకా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఆడబిడ్డల అవసరాలను గుర్తించి
శానిటరీ న్యాప్కిన్స్‌ అందిస్తూ ఈ సర్కార్‌ తల్లిలా కాపాడుకొంటున్నది. ఒకటి కాదు రెండు కాదు పదులు కాదు.. స్వరాష్టం సాధించుకున్న ఏడేండ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందల పథకాలు ప్రవేశపెట్టారు. ఆడబిడ్డల నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఆయన భగీరథుయ్యాడు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని ప్రకటించిన ధీరోదాత్తుడు సీఎం కేసీఆర్‌. ఈ పథకాలన్నింటిలో అత్యధికం సీఎం కేసీఆర్‌ మనోఫలకం మీద పుట్టినవే. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. కానీ తన ప్రజలకు ఎప్పుడు ఏమికావాలో తెలుసుకొని మానవత్వం మూర్తీభవించిన అమ్మలా
తన బిడ్డల్ని చూసుకొంటున్నారు. నాన్నలా రాష్ర్టాన్ని ఏలుతున్నారు. తెలంగాణ ఇల్లిల్లూ ఏదోవిధంగా సర్కార్‌ లబ్ధిపొందిందంటే అది కేసీఆర్‌ చలవే. మనిషి
మనిషికి ప్రభుత్వ అండ దొరికిందంటే.. అది కేసీఆర్‌ ఔదార్యమే.

అంతా నా కుటుంబమే..

అధికారంలో ఉన్న వ్యక్తి ప్రజలందరినీ తన కుటుంబంగా భావించడం అరుదైన సన్నివేశం. బహుశా దేశంలో స్వాతంత్య్రం వచ్చిన ఈ ఏడున్నర దశాబ్దాల్లో ఇలాంటి సీఎంలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో. కానీ కేసీఆర్‌ లాంటి పాలకుడు లేడనే చెప్పాలి. సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఏ వర్గానికి చెందిన సమస్యలనైనా వినాలంటే.. చర్చించాలంటే.. ఆయా సంఘాల నాయకులను పిలిపించి.. క్లోజ్‌డ్‌ డోర్‌ మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకొంటారు. కానీ కేసీఆర్‌ అలా కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నాయకులనే కాకుండా కార్యకర్తలను, ఉద్యోగులను, కార్మికులను కూడా ఎంతో ఔదార్యంతో ఆదరించిన నాయకుడు. సఫాయీ కార్మికులు, అంగన్‌ వాడీలు, ఆశా వర్కర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, విద్యుత్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు.. ఇలా ఒకరేమిటి.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ ఆదరణ పొందని వర్గం లేదు. తన అధికార నివాసానికి ఆహ్వానించి.. వారి సమస్యలను గంటల తరబడి సావధానంగా విని, వారితో కలిసి సహపంక్తి భోజనం చేసి.. వారిని ఆనందపరిచి సంతోషంగా ఇండ్లకు పంపించిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కరు.. కేసీఆర్‌.

ప్రజల కన్నీళ్లు.. తన కన్నీళ్లుగా..

ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసిన సీఎం కేసీఆర్‌ ఏడేండ్లలో ఇంటింటికీ సంక్షేమాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇవ్వాళ ప్రభు త్వ పథకం చేరని ఇల్లు లేదు. అర్హులై ఉండి ఆసరా పథకం అందుకోని వ్యక్తిలేరు. రాష్ట్రంలో 38,63,775 మంది ఆసరా పింఛన్‌ పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులే కాకుండా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళకు, బోదకాలు బాధితులకూ పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.1,00,116 ప్రభుత్వం నేరు గా ఆర్థిక సహాయం అందించే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకం దేశంలో మరెక్కడా కోలేదు. దీనికింద ఇప్పటి వరకు 9 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. ఉద్యమ నేతగా ఒక గిరిజన కుటుంబం వేదనను ప్రత్యక్షంగా చూసి చలించిన కేసీఆర్‌ రాష్ట్రం సాధించాక రూపకల్పన చేసిన పథకమే కల్యాణలక్ష్మి. పంట సమయంలో మిత్తికి అప్పుతెచ్చి అదే మిత్తి మెడమీద కత్తిగా మారిన దుర్భర స్థితి తెలిసిన సగటు రైతుగా రైతుల కష్టాలను శాశ్వతంగా రూపుమాపేందుకు రైతుబంధు తెచ్చా రు.

ఈ వానకాలం రైతుబంధు కింద ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా రూ.15వేల కోట్లు జమకాబోతున్నాయి. గత మూడేండ్లలో ఈ పథకానికి రూ.50,600 కోట్లు వెచ్చించారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఒకవైపు అప్పులు.. మరోవైపు ఇంటి యజమాని పోతే ఆ కుటుంబం దిక్కులేని పక్షి అవుతుందని తెలిసిన మానవీయ హృదయుడిగా రైతుబీమాను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్‌. రైతులు నయాపైసా చెల్లించకుండా ప్రభుత్వమే రైతుపేరిట బీమా సొమ్ము చెల్లించటం ద్వారా రైతు మరణించిన ఆరేడు రోజులకు ఆ కుటుంబానికి రూ.5 లక్షలు చేరే ఏర్పాటుచేసిన మానవీయ ప్రభుత్వంగా కేసీఆర్‌ సర్కార్‌ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇప్పటికీ రైతుబీమా ద్వారా రాష్ట్రంలోని 50,662 మంది రైతుకుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ధీమా అయ్యారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వమే పచ్చి బాలింతకు పురుడు పోయటమే కాదు పుట్టిన బిడ్డ ఆలనాపాలనా అన్నీ తానై చూసుకొంటున్నది. సర్కార్‌ వైద్యాన్ని మెరుగుపరచటం, తద్వారా తల్లీబిడ్డలకు సాంత్వన కలిగించి ఆర్థిక భరోసాను ఇవ్వటమనే మహత్తర లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. రక్తహీనత, పౌష్టికాహారలోపం వంటి సమస్యల్ని అధిగమించి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆరోగ్యలక్ష్మికి అంకురార్పణ చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిపుష్టం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంక్షేమ సింగిడి..

ట్రెండింగ్‌

Advertisement