సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 02:03:42

తెలంగాణలో లాక్‌డౌన్‌ భేష్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌ భేష్‌

-నిత్యావసరాల ధరలు పెరగొద్దు

-సరుకు వాహనాలను ఆపొద్దు

-సీఎస్‌, డీజీపీలతో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి  రాజీవ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. గురువారం కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును అడిగి తెలుసుకొన్నారు. తెలంగాణలో పరిస్థితిని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వివరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతున్నదని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి అభినందించారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగకుండా చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల రవాణాను అడ్డుకోవద్దని స్పష్టంచేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేసిన తరుణంలో నిత్యావసర వస్తువులు రవాణాచేసే వాహనాలను ఎలాంటి ఆటంకంలేకుండా అనుమతించాలని సూచించారు. సరుకుల హోం డెలివరీ విధానాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా, లాక్‌డౌన్‌ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా, ఆయా యాజమాన్య సంస్థలు వేతనాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలను కూడా రద్దు చేశామని, దీంతో బయటి నుంచి కరోనా వైరస్‌ వచ్చే అవకాశం లేదన్నారు. ఇప్పటికే బయటి నుంచి వచ్చినవారి ద్వారా ఎంతమందికి ఈ వైరస్‌ సోకిందనే వి షయం తెలియదని, లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలు బయటకురాకుండా కట్టడిచేస్తేనే వైరస్‌వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ఇందుకు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాలని క్యాబినెట్‌ కార్యదర్శి రాష్ట్రాలను ఆదేశించారు.


logo