సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 01:49:33

12 కిలోల బియ్యం.. రూ.1500

12 కిలోల బియ్యం.. రూ.1500

  • పేదలకు 12 కిలోల బియ్యం
  • రేషన్‌కార్డుకు 1500 నగదు
  • ఇంటికొక్కరే బయటకు రావాలి
  • ఉద్యోగులు 20% హాజరైతే చాలు
  • ప్రగతిభవన్‌లో మీడియాతో కేసీఆర్‌
  • ఆదివారం జనతా కర్ఫ్యూ  కనీవినీ ఎరుగని విజయం
  • అద్భుతాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సమాజం 
  • ప్రతి తెలంగాణబిడ్డకు ధన్యవాదాలు:  సీఎం కేసీఆర్‌
  • తెల్లరేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ
  • అందుబాటులో కూరగాయలు, పాలు, కిరాణషాపులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు చాలామంది ఉన్నరు.. 31 తేదీదాక లాక్‌డౌన్‌లో వాళ్లు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నది.. వాళ్లందరికీ నెల రోజులకు సరిపడే రేషన్‌ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం.. ఇతర సరుకుల కోసం ఒక్కో తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ.1500 నగదు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ సంక్షేమంలో నంబర్‌వన్‌గా ఉన్నదని, రూ.40 వేల కోట్లతో సంక్షేమాన్ని అమలుచేస్తున్న విషయం అందరికీ తెలుసిందేనని చెప్పారు. 

‘నిరుపేదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలికి గురికాద్దని ఆలోచిస్తున్నం. వారంరోజుల లాక్‌డౌన్‌ అయినా.. దానిప్రభావం పది రోజులపాటు ఉం టుంది. అందుకే ఒక్కవారానికి సరిపడ సరుకులు అని కాకుండా నెలరోజులకు సరిపడే రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తం. మన రాష్ట్రంలో బియ్యం నిల్వలు మరే రాష్ట్రంలో లేనివిధంగా ఉన్నాయి. 1.03 కోట్ల కుటుంబాల ఉండగా.. అందులో 87.59 లక్షలమందికి తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వాళ్లందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం ఇస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడున్న డీలర్ల వ్యవస్థ ద్వారానే అందిస్తామని తెలిపారు. 

సాధారణంగా తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతినెలా 1.50 లక్షల టన్నులు ఇస్తున్నాం.. ఇప్పుడు డబుల్‌ ఇస్తున్నందున 3.36 లక్షల టన్నుల పైచిలుకు బియ్యం ఉచితంగా పంపిణీచేస్తాం.. దానివిలువ దాదాపు రూ.1103 కోట్లు అని చెప్పారు. ‘పేదలకు నెలదాకా సరిపడే బియ్యం పంపిణీతోపాటు పప్పు, ఉప్పులాంటి సరుకులు కూడా కొనుకోవాల్సి ఉంటుంది. అందుకే వాటికోసం బియ్యంతోపాటు ప్రతి రేషన్‌కార్డుదారుడికి రూ.1500 నగదు కూడా ఇస్తాం. దీనితో ఎవరు ఏదికావాలి ఉంటే అది కొనుక్కుంటరు. ఇందుకోసం రూ.1,314 కోట్లు ఖర్చవుతుంది. అంటే బియ్యం, నగదుకు కలిపి మొత్తం రూ.2,417 కోట్లు ఖర్చవుతున్నందున వెంటనే ప్రభుత్వం విడుదలచేస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

‘వాస్తవానికి కొందరు అధికారులు, నాయకులు రూ.1000 ఇవ్వమన్నారు. నేను దానిని రూ.500 పెంచి రూ.1500 ఇవ్వాలని చెప్పిన. ఔట్‌ఆఫ్‌ బడ్జెట్‌ నుంచి ఇస్తున్నాం. ప్రతిరాష్ట్రంతో, కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తున్నాం. సంకుచితంగా ఆలోచించే సమయం కాదిది. రాజకీయాలు, చిల్లర ఆలోచనలు చేయరు’ అని పేర్కొన్నారు. కూరగాయలు, పాలు, కిరాణషాపులు తెరిచి ఉంచాయని, వాళ్లు ఇంటికి ఒక్కవ్యక్తి మాత్రమేపోయి వాటిని కొనుక్కోవచ్చని సీఎం సూచించారు. ఇది కర్ఫ్యూ లాంటిది కాదుకానీ.. ఒక్కదగ్గర ఐదుగురి కంటే ఎక్కువమందిని అనుమతించబోమని    తెలిపారు. వాళ్లుకూడా ఫీట్ల దూరం పాటించాలని చెప్పారు. 


ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు

లాక్‌డౌన్‌ సమయంలో ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు ఆయా సంస్థలు వేతనాలు చెల్లించాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు, కూలీలకు సంబంధిత యజమానులు ఈ వారం రోజులకు సంబంధించిన వేతనాలు ఇవ్వాల్సిందేనని చెప్పారు. 1897 యాక్ట్‌ ప్రకారం బిల్డింగ్‌ నిర్మాణ యజమానులు, కాంట్రాక్టర్ల కింద పనిచేసే వర్కర్లు, ప్రభుత్వశాఖల పనుల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని అన్నారు. ‘ఇలాంటి సంక్షోభ సమయంలో, సవాల్‌ ఉన్నప్పుడు యాజమాన్యాలు స్పందించాలి. సామాజిక బాధ్యత. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రైవేటు ఉద్యోగులకు ఆయా పరిశ్రమలు ఈ వారం రోజుల వేతనాన్ని చెల్లించాలి’ అని తెలిపారు.


logo