మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:53:25

రాజధానిలో మళ్లీ లాక్‌డౌన్‌?

రాజధానిలో మళ్లీ లాక్‌డౌన్‌?

  • లోతుగా పరిశీలించి నిర్ణయం
  • నిత్యావసరాల కొనుగోళ్లకు రోజుకు 2 గంటలు అనుమతి
  • రైళ్లు, విమానాలు బంద్‌.. మూడు నాలుగు రోజుల్లో ఖరారు
  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం 
  • పాజిటివ్‌ కేసులు వచ్చినంత మాత్రాన భయపడవద్దు
  • ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలన్న ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించుకొంటే, అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోళ్లుచేయడానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి, రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని తెలిపారు. విమానాల రాకపోకల్ని ఆపాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తరువాత మూడు నాలుగు రోజుల్లో సరైన వ్యూహాన్ని ఖరారుచేస్తామని వెల్లడించారు. కరోనా వైరస్‌వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకినవారికి అందుతున్న చికిత్స, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. అందరికీ సరైన వైద్యం అందించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 

అన్ని నగరాల్లో మాదిరిగానే హైదరాబాద్‌లోనూ..

‘కోటి మందికిపైగా నివసిస్తున్న పెద్ద నగరం హైదరాబాద్‌. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోవలే హైదరాబాద్‌లోనూ సహజంగానే వైరస్‌ వ్యాప్తి చెందుతున్నది. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ప్రజల్లో కదలిక పెరిగి వైరస్‌ విస్తరిస్తున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. దేశంలోని ఇతర నగరాలూ ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడం మంచిదని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ లాక్‌డౌన్‌ విధించడం చాలా పెద్ద నిర్ణయం. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధం కావాలి. అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండుమూడు రోజులపాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడునాలుగు రోజుల్లో క్యాబినెట్‌ను సమావేశపరిచి జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలతోపాటు, ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం చెప్పారు. 

రాష్ట్రంలో మరణాల రేటు తక్కువ

అంతకుముందు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమావేశంలో వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతున్నదని, అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. పాజిటివ్‌గా తేలినవారికి అవసరమైన అన్ని వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కూడా వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు, తక్కువ తీవ్రత ఉన్నవారిని ఇంట్లోనే ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్‌వ్యాప్తిని నియంత్రించడానికి 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యాధికారులు, వైద్యనిపుణులు కోరుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ వివరించారు. వైద్యారోగ్య ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలోనూ తెలంగాణలో వైరస్‌ వల్ల మృతిచెందిన వారి సంఖ్య తక్కువగా ఉన్నదని వెల్లడించారు. కొవిడ్‌ వల్ల మరణించినవారి జాతీయ సగటు 3.04 ఉండగా తెలంగాణలో 1.52 మాత్రమేనని తెలిపారు. తెలంగాణలో పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌గా తేలినవారికి తగిన వైద్యమందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

పలు రాష్ర్టాల్లో మళ్లీ లాక్‌డౌన్లు

బెంగళూరు: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు మళ్లీ లాక్‌డౌన్లు విధిస్తున్నాయి. కర్ణాటకలో ఇకపై ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ విధించబోతున్నట్టు ప్రకటించింది. జూలై ఐదు నుంచి దీన్ని అమలుచేయనున్నారు. సోమవారం నుంచి కర్ఫ్యూ రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ప్రకటించింది. చెన్నైలో ఇప్పటికే ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 తర్వాత కూడా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లో కరోనా వ్యాప్తి కట్టడికి జూలై 31 వరకు లాక్‌డౌన్‌ విధించారు. 


logo