ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:29:57

క్యాష్‌ మామాలపై కొరడా

క్యాష్‌ మామాలపై కొరడా

  • 17 మంది అరెస్టు.. 1.52 కోట్లు జప్తు
  • యాప్‌ నిర్వాహకులపై 
  • నగర పోలీసుల చర్యలు
  • గుర్గావ్‌, హైదరాబాద్‌ 
  • కార్యాలయాల్లో సోదాలు
  • 700 ల్యాప్‌టాప్‌లు, 
  • 22 ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: క్లిక్‌ చేయగానే అప్పిస్తామని ప్రలోభపెడుతూ..రుణగ్రహీతల పరువు, ప్రాణాలు తీస్తున్న లోన్‌ యాప్‌లపై పోలీసులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్‌తోపాటు గుర్గావ్‌లోని రుణ సంస్థల కార్యాలయాలపై దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రూ.1.52 కోట్ల నగదును, భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ ఆన్‌లైన్‌ రుణ సం స్థలు.. అవి ఇచ్చే అప్పుకు వారం రోజులకే 35 శా తం వడ్డీని వసూలు చేస్తున్నాయి. అలా చెల్లించని వారి పరువును బజారున పడేసేందుకు బరితెగిస్తున్నాయి. దీంతో వాటి వేధింపులు తట్టుకోలేక ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రుణ యాప్‌ నిర్వాహకుల మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం పలు సంస్థలపై ఉక్కుపాదం మోపారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, హైదరాబాద్‌ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఈ దాడుల వివరాలను వెల్లడించారు. 

రాయదుర్గంలో రెండు సంస్థలు

రాయదుర్గం కేంద్రంగా పనిచేస్తున్న ఆనియన్‌ క్రెడిట్‌ లిమిటెడ్‌, క్రెడ్‌ ఫాక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థలపై సైబరాబాద్‌ పోలీసులు దాడి చేశారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆ రెండు సంస్థలకు చెందిన శరత్‌చంద్ర సహా ఆరుగురిని అరెస్టు చేశామని, వారి ఖాతాల్లోని రూ.1.52 కోట్లను జప్తు చేశామని చెప్పారు. నిందితుల నుంచి 22 మొబైల్‌ ఫోన్లు, మూడు కంప్యూటర్లు, మూడు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌ పై అంతస్తులో నిర్వహిస్తున్న ఈ రెండు సంస్థల్లో 110 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంస్థల సీఈవో కొనతం శరత్‌చంద్ర, డైరెక్టర్లు పుష్పలత, వాసవ చైతన్య, కలెక్షన్‌ ఏజెంట్లు బీ వెంకటేశ్‌, సచిన్‌దేశ్‌ముఖ్‌, టీమ్‌ లీడర్‌ సయ్యద్‌ ఆషిక్‌ను అరెస్టు చేశాం. ఆన్‌లైన్‌లో వీరివద్ద రుణం తీసుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇటువంటి యాప్‌ల నుంచి ఒకటిన్నర లక్షల మంది వరకు అప్పులు తీసుకోగా, సుమారు 70వేల మంది బాధితులున్నట్టు తెలుస్తున్నది. ఈ సంస్థలు నడిపే కాల్‌సెంటర్ల నుంచి సామాన్యులకు ఫోన్‌లు చేసి అప్పు ఇస్తామని ముగ్గులోకి దింపుతారు. ఆ తరువాత బలవంతపు వసూళ్లతో చిత్రవధ చేస్తారు’ అని సజ్జనార్‌ వివరించారు. 

నిందితుడు శరత్‌ చంద్ర కొన్ని యాప్‌లను రూపొందించి.. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు థర్డ్‌ పార్టీగా పనిచేసే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా వచ్చే నగదును ఈ యాప్‌ల ద్వారా రుణాలుగా ఇచ్చి వాటిని తిరిగి వసూలు చేసి ఎన్‌బీఎఫ్‌సీ చెల్లిస్తారు. ఈ క్రమంలోనే ‘క్యాష్‌ మామా, లోన్‌ జోన్‌, ధనాధన్‌ లోన్‌, క్యాష్‌ అప్‌, క్యాష్‌ బస్సు, మేరా లోన్‌, క్యాష్‌ జోన్‌ పేరిట ఆన్‌లైన్‌ రుణ యాప్‌లను రూపొందించారు. వీటిలో క్యాష్‌ బస్సు, క్యాష్‌ అప్‌ యాప్‌లను ఢిల్లీకి చెందిన ఏషియా ఇన్నో నెట్‌వర్క్స్‌కు, మేరా లోన్‌, క్యాష్‌ జోన్‌ యాప్‌లను బెంగళూరుకు చెందిన బ్లూషీల్డ్‌  ఫిన్‌టెక్‌ ప్రై.లిమిటెడ్‌కు విక్రయించారు. ఇక శరత్‌చంద్ర ఆధ్వర్యంలో ఉన్న క్యాష్‌ మామా, ధనాధన్‌, లోన్‌జోన్‌కు దాదాపు 1.50 లక్షల మంది రుణగ్రహీతలు ఉండగా, వీరిలో దాదాపు 70 వేల మంది ఈ సంస్థలకు ఇంకా బాకీ ఉన్నారు. ధనాధన్‌ యాప్‌ను ఎన్‌బీఎఫ్‌సీకి లింక్‌ చేయకుండా, దాని ద్వారా అక్రమంగా రుణాలను ఇచ్చి భారీగా వడ్డీ వసూలు చేస్తూ అమాయకులను వేధిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఆర్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సుమారు 35 శాతం అధిక వడ్డీ వసూలు చేస్తూ ఫేక్‌ నోటీసులతో వినియోగదారు లను వీరు వేధిస్తున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలు, మార్గదర్శకాలు ఏమిటో తెలుపాలని లేఖలు రాశాం. చైనా దేశానికి చెందిన సంస్థల పాత్రపై ఆరా తీస్తు న్నాం’ అని సజ్జనార్‌ వివరించారు. ఎవరైనా వేధింపుల బారిన పడితే బాధితులు వెంటనే సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444 లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సీపీ సజ్జనార్‌ కోరారు. 

పచ్చి బూతులు తిడుతారు

నిమిషాల వ్యవధిలో చేతికి డబ్బు అందుతుందన్న ఆశతో చాలామంది ఈ యాప్‌ల నిర్వాహకుల చేతికి చిక్కుతున్నారు. అప్పిచ్చేందుకు వారు పెట్టే షరతులన్నింటికీ ఒప్పుకుంటూ తమ ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లన్నీ వారు తెలుసుకొనేందుకు అనుమతిస్తున్నారు. చేతికి డబ్బు అందిన తరువాత తిరిగి చెల్లించేటప్పుడు ఏమాత్రం ఆలస్యమైనా ఓ క్రమ పద్ధతిలో వేధింపులు ప్రారంభమవుతాయి. ఇందుకోసం కాల్‌సెంటర్లలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రుణం తీసుకున్న వారి నుంచి వడ్డీకి చక్రవడ్డీని ఎలా వసూలుచేయాలి, వారిని అసభ్య పదజాలంతో ఎలా వేధించాలో సిబ్బందికి నేర్పుతున్నారు. ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బకెట్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేసి రుణం కట్టని వారిని ఏవిధంగా తిట్టాలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో రుణాలు వసూలుచేసే సిబ్బంది రెచ్చిపోతున్నారు. రుణ గ్రహీతల ఫోన్‌ నుంచి సేకరించిన బంధువులు, స్నేహితుల నంబర్లకు మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు. ఈ విధంగా మానసికంగా వేధిస్తూ, తీసుకున్న రుణానికి పెనాల్టీని జోడించి వసూలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బాధితులను బూతులు తిట్టినా, అవమాన పర్చే విధంగా మెసేజ్‌లు పెట్టినా, ఫోన్లు చేసినా వారిపై ఐపీసీ 506తో పాట ఐటీ యాక్ట్‌ 66ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్‌, సజ్జనార్‌ హెచ్చరించారు. ఈ సెక్షన్‌లలో నేరం రుజువైతే మూడు నుంచి ఐదేండ్లపాటు జైలు తప్పదని వారు స్పష్టం చేశారు.

30 వేల అప్పుకు 7వేల వడ్డీ

ఓ వ్యక్తి ఈ ఏడాది జనవరి 8న ‘క్యాష్‌ మామ’ యాప్‌ నుంచి రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, సంతకం చేసిన ఫొటో, మూడు నెలల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, ఇతర ధ్రువీకరణపత్రాలను అప్‌లోడ్‌ చేశాడు. ఏడు రోజుల్లో అప్పు చెల్లించాలని షరతు విధించారు. ఆ రూ.5 వేలలో జీఎస్టీ, ప్రాసెసింగ్‌ ఫీజుల కింద రూ.1,180 మినహాయింపుకొని రూ. 3,820 ఇచ్చారు. ఇలా అతడు ఆరుసార్లు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి హే ఫిష్‌, మంకీ క్యాష్‌, క్యాష్‌ ఎలిఫెంట్‌, లోన్‌జోన్‌, వాటర్‌ ఎలిఫెంట్‌, మేరా లోన్‌ యాప్‌ల నుంచి రూ.30 వేలు రుణంగా తీసుకున్నాడు. అందులో ఫీజుల కటింగ్‌ పోను చేతికి రూ.20 వేలే అందాయి. తీసుకున్న అప్పుకు రూ.29 వేలు చెల్లించాడు. ఇంకా రూ.8,634 చెల్లించాలని వేధించారు. తన కాంటాక్ట్స్‌లో ఉన్న తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు సదరు బాధితుడు రుణం తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడని బద్నాం చేశారు. దీంతో బాధితుడు ఈ నెల 7న సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రుణయాప్‌ల వెనుక చైనీయుల పాత్ర: సీపీ అంజనీకుమార్‌


రుణ యాప్‌ల నిర్వహణలో చైనీయుల హస్తం ఉన్నట్టు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. రుణయాప్‌ల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్గావ్‌ ఉద్యోగ్‌ విహార్‌లోని రెండుప్రాంతాల్లో, హైదరాబాద్‌లోని బేగంపేట్‌, పంజాగుట్టలో కొనసాగుతున్న కాల్‌సెంటర్లపై వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్ట్‌ చేసినట్టు అంజనీకుమార్‌ తెలిపారు. ‘యాప్‌ల నిర్వాహకులకు, ఆయా సంస్థల్లోని డైరెక్టర్లకు ఇండొనేషియా నుంచి ఆదేశాలు అందు తున్నాయి. గుర్గావ్‌, హైదరాబాద్‌లో లిఫాంగ్‌ టెక్నాలజీస్‌, హాట్‌పుల్‌ టెక్నాలజీస్‌, పిన్‌ప్రింట్‌ టెక్నాలజీస్‌, న్యాబ్లూమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లతో కాల్‌ సెంటర్లు నడుపుతున్నారు. ఈ సంస్థలకు డైరెక్టర్లుగా జీవన్‌జ్యోతి, సిల్వరాజ్‌సింగ్‌, రవికుమార్‌ మంగల, వెంకట్‌ కొనసాగుతున్నారు. హైదరాబాద్‌ కాల్‌సెంటర్లలో 600 మంది, గుర్గావ్‌ కాల్‌సెంటర్లలో 500 మంది పనిచేస్తున్నారు. ఈ రెండు కేంద్రాలనుంచి ముఖ్యులైన 11 మందిని అరెస్ట్‌ చేశాం. అరస్టైనవారిలో గుర్గావ్‌లో పనిచేసే బిందూరాణి, జ్యోతి మాలిక్‌, అమిత్‌, రమణదీప్‌సింగ్‌, ప్రభాకర్‌ దవంగల్‌, హైదరాబాద్‌లో మధుబాబుసిం గి, మనోజ్‌కుమార్‌సింగి, మహేష్‌కుమార్‌సింగి, తరుణ్‌, పవన్‌కుమార్‌, జీవన్‌జ్యోతి ఉన్నారు. ఈ కేం ద్రాల నుంచి 700 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నాం. గుర్గావ్‌ కేంద్రంలో చైనీయుడి పాస్‌పోర్టు లభించింది. దీంతో రుణయాప్‌ల వెనుక చైనీయుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ రుణాల యాప్‌ నిర్వాహకులు 20 నుంచి 50 శాతం వడ్డీని వసూలు చేస్తున్నట్టు తెలిసింది’ అని సీపీ వివరించారు.